రాజాసింగ్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? మరి అంబర్‌పేట సంగతి!

26 Aug, 2022 18:55 IST|Sakshi

హైదరాబాద్‌జిల్లా అసెంబ్లీ నియోజక వర్గాలన్నిటిలోనూ కుల సమీకరణాలకంటే మత సమీకరణాలే కీలకం కానున్నాయి. అన్ని పార్టీలకు హిందుత్వమే కీలకం కానుంది. మజ్లిస్‌ను ఓడించాలంటే హిందుత్వతోనూ ముందుకు సాగాలని కమలనాథులు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఇక మిగిలిన పార్టీలు కూడా అదే బాటలో నడవక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.

గెలుపునకు వారి ఓట్లే కీలకం
గతంలో కాంగ్రెస్‌కు కంచుకోటలా ఉన్న గోషామహాల్ నియోజకవర్గం ఇప్పుడు బీజేపీకి కంచుకోటగా మారింది. గోషా మహల్‌ను వశం చేసుకునేందుకు కాంగ్రెస్, టిఆర్ఎస్ లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గోషామహల్‌లో ఎలాగైనా పాగా వేయాలని అన్ని పార్టీలు తహ తహలాడుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ కూడా అంతే తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నియోజకవర్గంలో హిందూ ఓట్లే కీలకం కాబోతున్నాయి. 

గత రెండు ఎన్నికల్లో కూడా హిందూ ఓట్లే రాజాసింగ్‌ను గెలిపించాయని చెప్పక తప్పదు. గోషామహాల్ ‌ఏరియాలో బేగం బజార్ అత్యంత కీలకం. ఇక్కడ షాపుల యజమానులందరూ మార్వాడీలే. ఇక్కడ ఈ వర్గం ఎవరికి మద్దతు ఇస్తే వారే గెలిచే అవకాశం ఉంది. అలాగే యాదవ, బెస్త, ముదిరాజ్, గౌడ సామాజిక వర్గాలు కూడా ఎక్కువగానే ఉన్నారు. అన్ని వర్గాలకు దగ్గర అయ్యేందుకు అన్ని పార్టీలు అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

గత ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ పై బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌ 16 వేల ఓట్ల మెజారిటీ తో గెలిచారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఇక్కడ బలమైన అభ్యర్థిని దింపితే గెలుస్తామనే ధీమాను కాంగ్రెస్, టిఆర్ఎస్ లు వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది. అయితే, తాజాగా ఆయనపై నమోదైన కేసులు.. బీజేపీ అధిష్టానం సస్పెన్షన్‌ వేటు వెరసి రాజాసింగ్‌ రాజకీయ భవితవ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. 

కాంగ్రెస్‌నేత ముఖేష్ గౌడ్ మృతి చెందడంతో... ఆ పార్టీ కొత్త అభ్యర్థిని బరిలో దించనుంది. ఫిషర్మెన్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ , అంజన్ కుమార్ యాదవ్ చిన్న కొడుకు అరవింద్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. టిఆర్ఎస్ నుంచి మళ్ళీ ప్రేమ్ సింగ్ రాథోడ్ పోటీ చేసే అవకాశం ఉంది.
(చదవండి: పవర్‌ఫుల్‌ పీడీ యాక్ట్‌.. అదే జరిగితే ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఏడాది జైల్లోనే! )

ఖైరతాబాద్‌లో కాంగ్రెస్‌ నుంచి ఎవరు?
ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే.. అన్ని రంగాలకు చెందిన వీఐపీలు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులే కాకుండా.. ఫిలింనగర్ మురికివాడలు, బస్తీలు కనిపిస్తాయి. టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం, రాజ్ భవన్, మినిస్టర్ క్వార్టర్స్, ఎమ్మెల్యే కాలనీ సహా అనేక రంగాల కీలక కార్యాలయాలు ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. 

పి. జనార్థనరెడ్డి ఉన్నప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. పీజేఆర్ మృతి, 2014లో తెలంగాణ ఏర్పాటుతో ఖైరతాబాద్ లో రాజకీయ సమీకరణాలు మారాయి. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పీజేఆర్ శిష్యుడు దానం నాగేందర్‌ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత దానం టిఆర్ఎస్‌లో చేరి గత ఎన్నికల్లో గెలుపొందారు.
 
ఖైరతాబాద్ లో పట్టు కోసం కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్ లు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. టిఆర్ఎస్ నుంచి దానం నాగెందర్ మళ్ళీ బరిలోకి దిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోవడంతో బీఏస్పీ నుంచి పోటీ చేసిన మన్నె గోవర్ధన్ ఈసారి టిక్కెట్ తనకే అని ప్రచారం చేసుకుంటున్నారు. 

బీజేపీ నుంచి చింతల రాంచంద్రారెడ్డి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి ముగ్గురు నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్ ఆశించి భంగపడ్డ రోహిణ్ రెడ్డి ఈసారి కచ్చితంగా తనకే టిక్కెట్ ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఈ మధ్యే టిఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లో చేరిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా తనకే టిక్కెట్ అని చెబుతున్నారు.
(చదవండి: సెప్టెంబర్‌ 7కు హైదర్‌నగర్‌ భూముల కేసు వాయిదా)
 
సర్వేతో భయపడుతున్న కాలేరు
అంబర్‌పేటలో రెండుసార్లు వరుసగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విజయం సాధించగా... గత ఎన్నికల్లో కిషన్‌రెడ్డి మీద టిఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీ ఈసారి అలాంటి తప్పిదం జరగకుండా జాగ్రత్త పడుతోంది. ఇక్కడ ముస్లిం ఓటు బ్యాక్ ఎక్కువగానే ఉంది. దీంతో హిందూ, ముస్లిం ఎజెండాలో బీజేపీ ఈజీగా బయటపడుతుందని కమలనాధులు లెక్కలేసుకుంటున్నారు. 
 
గత ఎన్నికల్లో గెలిచిన కాలేరు వెంకటేష్ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మళ్ళీ తనకే టిక్కెట్ వస్తుందని కాలేరు వెంకటేష్ భావిస్తున్నారు. అయితే సర్వేలో మంచి మార్కులు వచ్చిన సిట్టింగ్ లకే మళ్ళీ టిక్కెట్ అనడంతో కాలేరుకు సర్వే భయం పట్టుకుందట. ఇక్కడ పార్టీ ఓట్‌బ్యాంక్‌తో పాటు.. మైనారిటీ ఓట్లతో గెలవవచ్చని గులాబీ పార్టీ భావిస్తోంది. అయితే ఎంఐఎం బలమైన అభ్యర్థిని బరిలో దింపితే అన్ని పార్టీలను ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదు.
 
ఇక కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు లైన్ లో ఉన్నారు. అయితే వీహెచ్ ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ తన నియోజకవర్గంలో తాను చెప్పిన వారికే టిక్కెట్ ఇవ్వాలని అదిష్టానం ముందు మెలిక పెట్టారట వీహెచ్. ఫైనల్‌గా వీహెచ్ ఆశీర్వాదం ఉన్న వారికి ఇక్కడ కాంగ్రెస్ టిక్కెట్ దక్కుతుందని అంటున్నారు. గత ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడినందున ఇక్కడ కాంగ్రెస్ స్థానంలో టీజేఎస్ పోటీ చేసింది. అందువల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఇతర పార్టీలకు మళ్ళిందనే ఆందోళన కనిపిస్తోంది.
(చదవండి: ఆ విషయం బీజేపీ ఎంపీకి ముందే ఎలా తెలుసు?)

మరిన్ని వార్తలు