రెండు నెలల ఉత్కంఠకు తెర..  ఊహించిందే జరిగింది

1 Jul, 2022 20:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాక్షి చెప్పిందే నిజమైంది. గత రెండు నెలలుగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్నుకున్న ప్రజలను అయోమయానికి గురిచేసిన అడిక్‌మెట్‌ డివిజన్‌ బీజేపీ కార్పొరేటర్‌ సి.సుíనితా ప్రకాష్‌ గౌడ్‌ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ముఠా జైసింహలు వెంట రాగా కుమారుడు తరుణ్‌తో కలిసి గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో గత రెండు నెలల ఉత్కంఠకు తెరపడింది. సి.ప్రకాష్‌గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం నాయకుడిగా ఉంటూ అంచెలంచలుగా ఎదిగి 2002లో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో అడిక్‌మెట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2009లో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో సి.సునిత తెలుగుదేశం అభ్యర్థిపై 2ఓట్ల తేడాతో విజయం సాధించారు. తరువాత 2014లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు.

అయితే 2015లో టికెట్‌ ఆశించినప్పటికి ఆయనకు టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ దక్కలేదు. అప్పటితో అలకబూనిన ప్రకాష్‌గౌడ్‌ దంపతులు అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి బీజేపీ టికెట్‌ దక్కించుకొని విజయం సాధించారు. గెలిచిన కొద్దిరోజులకే ప్రకాష్‌గౌడ్‌ కరోనాతో మృతిచెందారు. ఆ తర్వాత బీజేపీలోని సీనియర్‌లు కార్పొరేటర్‌కు పెద్దగా సహకరించకపోవడంతో ఒంటరి అయ్యారు. దీనికితోడు ఆమెకు ముగ్గురు పిల్లలున్నారనే కేసును ఓడిపోయిన మాజీ కార్పొరేటర్‌ కోర్టులో ఫైల్‌ చేశారు. వాదనలు తుదిదశకు చేరుకున్నాయి. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.

పైగా అధికార పార్టీ బీజేపీ కార్పొరేటర్లపై వల విసరడంతో కార్పొరేటర్‌ సునితా ప్రకాష్‌గౌడ్‌ అన్ని ఆలోచించి అధికార పార్టీలో చేరాడానికి సంసిద్దులైనట్లు తెలిసింది. దీనికి సంబంధించి టీఆర్‌ఎస్‌తో అవగాహనకు వచ్చిన అనంతరం కార్పొరేటర్‌ కార్యాలయం వైపుకానీ, బీజేపీ కార్యక్రమాలలో పాల్గొనడం కానీ చేయలేదు. ఇక ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా పోయింది. ఫోన్‌ చేసినా సరైన రెస్పాన్స్‌ ఇవ్వడం మానేశారు. దీంతో అనేక రకాలుగా కార్పొరేటర్‌పై ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌లోకి వెళ్తుందనే ప్రచారం జోరుగా సాగింది. ప్రచారానికి తగ్గట్లుగానే ఆమె గురువారం కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.  

పెదవి విరుస్తున్న కొండపల్లి మాధవ్‌.. 
కార్పొరేషన్‌ ఎన్నికలకు ముందు సునితాప్రకాష్‌గౌడ్‌ దంపతులకు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ బీజేపీ టికెట్‌ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన కొండపల్లి మాధవ్‌ తీవ్ర అలకబూనారు. గత అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన తనను విస్మరించి అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన వారికి టికెట్‌ ఇవ్వడంపై మనోవేధనకు గురై టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే ఇప్పుడు అదే సునితాప్రకాష్‌గౌడ్‌ మళ్లీ మాధవ్‌ ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీలోకే ఆమెరావడం విస్మయానికి గురిచేసింది. ఈ విషయంపై టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా బీజేపీ వ్యవహరించిన తీరుగానే టీఆర్‌ఎస్‌ కూడా వ్యవహరించిందని ఎమ్మెల్యే కానీ, ఇతర నాయకులు కానీ ఆమెను చేర్చుకునే విషయంలో ఒక్కమాట కూడా సంప్రదించలేదని పెదవి విరుస్తున్నారు.   

మరిన్ని వార్తలు