రేషన్‌ షాపుల్లో జీఎస్టీ బొమ్మ పెట్టాలి: జీవన్‌రెడ్డి

4 Sep, 2022 04:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రేషన్‌ షాపుల్లో పెట్టా ల్సింది నేతల బొమ్మ లు కాదని, జీఎస్టీ బొమ్మ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బొమ్మల పంచాయితీ మాత్రమే కానీ అభివృద్ధి కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు.

తెలంగాణ ప్రభుత్వ అప్పు రూ.5 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించారు. 8 ఏళ్లలో జీఎస్టీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలపై రూ.3 లక్షల కోట్ల భారం పడిందని, జీఎస్టీ వల్ల ప్రజలకు పన్నుల భారం తప్ప ప్రయోజనం లేదని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నువ్వంటే నువ్వని కొట్లాడుతున్నాయని విమర్శించారు. రైతుబంధు సాకుతో ప్రజలకు అందాల్సిన ప్రయోజనాలన్నీ ఆపేశారని, 2014కు ముందు ఉన్న వాటిని నిలిపివేసి పేర్లు మార్చి గొప్ప లు చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు.  

మరిన్ని వార్తలు