సీఎం కావడానికి అర్హతలున్నాయి: కర్ణాటక మంత్రి ఉమేష్‌

23 Jul, 2021 05:31 IST|Sakshi

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పెరుగుతోంది. యడియూరప్ప స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉమేష్‌ కత్తి వ్యాఖ్యానించారు. తాను తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తన వయసు ప్రస్తుతం 60 ఏళ్లేనని అన్నారు. పరిణామాలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. అవకాశం వస్తే సీఎంగా రాష్ట్రానికి సేవ చేస్తానని, చక్కటి పరిపాలన అందిస్తానని చెప్పారు.

పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న సీఎం యడియూరప్ప ప్రకటనను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.ఎస్‌.ఈశ్వరప్ప స్వాగతించారు. ముఖ్యమంత్రి మార్పు విషయంలో బీజేపీ పెద్దల నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌.అశోక్, హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మై పేర్కొన్నారు. కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న విషయంలో బీజేపీ అధిష్టానానికి తాను ఎలాంటి సూచనలు ఇవ్వలేదని యడియూరప్ప చెప్పారు. ఎవరి పేరునూ తాను సూచించలేదన్నారు. ఒకవేళ పార్టీ నాయకత్వం తనను కోరినా తదుపరి సీఎం పేరును ప్రతిపాదించలేనని స్పష్టం చేశారు. తాను పదవి నుంచి తప్పుకోవడం తథ్యమని యడియూరప్ప సంకేతాలిచ్చిన నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది.

మరిన్ని వార్తలు