భారత రాజకీయాల్లో లైలా, మజ్నూ..

30 Nov, 2020 10:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కీలకమైన ప్రచార పర్వం ముగిసింది. గ్రేటర్‌ పీఠమే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు ఆదివారం వరకు పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. విపక్షాలకు ఏమాత్రం సమయం ఇవ్వని సీఎం కేసీఆర్‌ కేవలం పదిరోజుల్లోనే ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. ప్రచారంలో అభివృద్ధి మాట కన్నా.. ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధమే ఎక్కువగా సాగింది. గల్లీ  ఎన్నికలే అయినప్పటికీ దాని వేడి ఢిల్లీ వరకు పాకింది. అధికార టీఆర్‌ఎస్‌పై బీజేపీ నేతలు విమర్శలతో రాజధానిలో రాజకీయ వేడి సెగలు పుట్టించింది. మరోవైపు ఎంఐఎం-బీజేపీ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రకటనలు భాగ్యనగరంలో ప్రకంపనలు రేపాయి. గ్రేటర్‌ ఎ‍న్నికల్లో తాము గెలిస్తే పాతబస్తీలో సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించగా.. నగర నడిబొడ్డున ఉన్న మాజీ ప్రధాని పీవీ, ఎన్టీఆర్‌ ఘాట్స్‌ను కూల్చివేస్తామని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. (గ్రేటర్‌ ప్రచారం: ట్రంప్‌ ఒక్కరే మిగిలిపోయారు)

మరోవైపు ప్రచారం చివరిరోజైన ఆదివారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటన కాషాయదళంలో మరింత  ఉత్తేజాన్ని నింపగా.. రాజధానిలో పొలిటికల్‌ హీట్‌ను మరింత పెంచింది. ఇక బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. ఆదివారం నాడు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఇంటర్య్వూలో ఒవైసీ పలు వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాల్లో తాను లైలా పాత్ర పోషిస్తుంటే.. మిగత పక్షాలన్నీ మజ్నూలా తన చుట్టే తిరుగుతున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (పిచ్చోళ్ల చేతిలో హైదరాబాద్‌ను పెట్టడమే)

‘పాత బస్తీలో రొహింగ్యాలు, పాకిస్తానీ ఓటర్లు, అక్రమ వలసదారులు ఉన్నారని కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు హ్యాస్యాస్పదం. కేవలం పాతబస్తీపైనే ఆ పార్టీ నేతలంతా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ వలసదారులు ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఏం చేస్తున్నారు. పాత బస్తీలో ఉన్న వారంతా కేంద్ర హోంమంత్రి శాఖ అనుమతితోనే ఉంటున్నారు. బీజేపీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలంతా నాపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. బిహార్‌లో బీజేపీ విజయం వెనుక తన పాత్ర ఉందని అంటున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాత్రం అన్ని పార్టీల నేతలంతా నన్నే టార్గెట్‌గా చేసుకున్నారు. దేశ రాజకీయాల్లో నేను లైలా లాంటి వాడిని, మిగతా వారంతా మజ్నూలా నా వెంట పడుతున్నారు.’ అంటూ వ్యాఖ్యానించారు. 
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు