సువేందు అధికారి ద్రోహి

22 Mar, 2021 05:46 IST|Sakshi

అతడి అసలు రంగును గుర్తించలేకపోయా

ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీ

కాంతి దక్షిణ్‌: తానొక పెద్ద గాడిదనని(అమీ ఏక్తా బోరో గధా), అందుకే సువేందు అధికారి అసలు రంగును గుర్తించలేకపోయానని పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నియోజకర్గం నుంచి ఆమెపై బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మమతకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సువేందు అధికారి అభిప్రాయభేదాల వల్ల దూరమయ్యారు. మమతా బెనర్జీ ఆదివారం పూర్బ మేదినీపూర్‌ జిల్లా కాంతి దక్షిణ్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. సువేందు కుటుంబం రూ.5వేల కోట్ల ఆస్తులు కూడగట్టినట్లు తాను విన్నానని చెప్పారు. ఆ డబ్బుతో ఓట్లు కొనేయాలని సువేందు ప్రయత్నిస్తున్నాడని, అతడికి ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే అతడి అవినీతిపై విచారణ జరిస్తానన్నారు.

బీజేపీని తరిమికొట్టాలి
సువేందు అధికారి కుటుంబాన్ని ద్రోహుల(మీర్‌ జాఫర్‌) కుటుంబంగా మమతా బెనర్జీ అభివర్ణించారు.  అతడికి ఓటేయవద్దని ప్రజలను కోరారు. బీజేపీ వంచకులు, గూండాల పార్టీ అని మండిపడ్డారు. బెంగాల్‌లో శాంతి భద్రతలను కాపాడాలన్నా, అభివృద్ధిని కొనసాగించాలన్నా బీజేపీని తరిమికొట్టాలని సూచించారు.

మరిన్ని వార్తలు