‘ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే.. అవమానించినట్టే’

28 Sep, 2020 20:55 IST|Sakshi

ముంబై: స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన బిహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే  ఆదివారం అధికార జేడీయూ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో జరగబోయే బిహార్‌ ఎన్నికల్లో ఆయన పోటీచేస్తారని వార్తలు వెలువడుతున్నాయి. ఈనేపథ్యంలో మహారాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో మహారాష్ట్ర పోలీసులను అవమానించిన గుప్తేశ్వర్‌ పాండేకు జేడీయూ టికెట్‌ గనుక కేటాయిస్తే అది తమను మరింత బాధిస్తుందని తెలిపింది.

బిహార్‌ ఎన్నికల బీజేపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఫడ్నవీస్‌ ఆయనకు జేడీయూ టికెట్‌ ఇవ్వకుండా అడ్డుకోవాలని సూచించింది. లేదంటే మహారాష్ట్ర ప్రజల మనోభావాలను కించపరిచినట్టు అవుతుందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సచిన్‌ సావంత్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, బిహార్‌లో వచ్చే నెలాఖరు నుంచి అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభవుతున్నాయి. మూడు విడతల్లో.. అక్టోబర్‌ 28 న తొలి విడత, నవంబర్‌ 3 న రెండో విడత, నవంబర్‌ 7 న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. సీఎం నితీష్‌ కుమార్‌ మరోసారి మిత్రపక్షం బీజేపీతో జట్టుకట్టారు.
(చదవండి: సీఎం అభ్యర్థిపై పోటాపోటీ.. కూటమికి బీటలు)

టగ్‌ ఆఫ్‌ వార్‌
యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (34) ముంబైలోని తన నివాసంలో జూన్‌ 14న ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కుమారుడి మృతి పట్ల సుశాంత్‌ తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు. సుశాంత్‌ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిపై ఫిర్యాదు చేయడంతో బిహార్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ముంబై పోలీసులు దీనికి అభ్యంతరం తెలిపారు. కేసు దర్యాప్తును తామే చేస్తామని స్పష్టం చేశారు. దీంతో తమకు ముంబై పోలీసుల విచారణపై నమ్మకం లేదని డీజీపీగా విధులు నిర్వర్తిస్తున్న గుప్తేశ్వర్‌ పాండే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం నితీష్‌ని ఒప్పించి సీబీఐ విచారణకు ఆదేశాలు ఇప్పించారు.
(చదవండి: నితీష్‌ సమక్షంలో జేడీ(యూ)లో చేరిక)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు