హేమంత్‌ సోరెన్‌పై వేటు పడితే.. సీఎం పీఠంపై మరో సోరెన్‌?

29 Aug, 2022 17:55 IST|Sakshi

రాంచీ: జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ శాసనసభ్యత్వం రద్దుపై నెలకొన్న సస్పెన్స్‌ అలాగే కొనసాగుతోంది. ఏ క్షణంలోనైనా గవర్నర్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ హేమంత్‌ సోరెన్‌ శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్‌ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి పదవి ఎవరు చేపడతారు? అనే చర్చ మొదలైంది. అయితే.. మరో సోరెన్‌ ముఖ్యమంత్రి అవుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. సోరెన్‌ కుటుంబం నుంచి సీఎం పీఠం మరొకరికి వెళ్లదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం పదవి చేపట్టే అర్హత కలిగిన మరో సోరెన్‌ ఎవరు? ఓసారి పరిశీలిద్దాం.

సీఎం హేమంత్‌ సోరెన్‌పై అనర్హత వేటు వేస్తే.. ఆయన ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోతారు. దీంతో ముఖ్యమంత్రి పదవి ఎవరికనే అంశం కీలకంగా మారింది. సోరెన్స్‌ కుటుంబం సైతం ఇతర ప్రాంతీయ పార్టీలకు అతీతం కాదు. రాజకీయ సంక్షోభం తెలత్తినప్పుడు అదే కుటుంబం నుంచి మరొకరు ఆ పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉంటారు.

కుటుంబ నేపథ్యం..
బిహార్‌ నుంచి జార్ఖండ్‌ ఏర్పాటు కోసం జార్ఖండ్‌ ముక్తి మోర్చాను ఏర్పాటు చేశారు శిబు సోరెన్‌. ఆయన రెండో కుమారుడే హేమంత్‌ సోరెన్‌. సీనియర్‌ సోరెన్‌.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. సీఎంకు రాజకీయ గురువుగా ముందుండి దారిచూపుతున్నారు. అయితే.. జేఎంఎం స్థాపించిన తర్వాత శిబు సోరెన్‌ పెద్ద కుమారుడు దుర్గా సోరెన్‌ ఆయన వారసుడిగా ఎదిగారు. మరోవైపు.. పార్టీ స్థాపించినప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న హేమంత్‌ సోరెన్‌ దూరంగానే ఉండాల్సి వచ్చింది. అయితే.. 2009లో దుర్గా సోరెన్‌ బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మరణించారు. ఆయన తర్వాత శిబు సోరెన్‌ వారసురాలిగా కుమార్తె అంజలీ పేరు తెరపైకి వచ్చినా ఆమె అంతగా ఆసక్తి చూపలేదు. ఒడిశాకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుని వెళ్లిపోయారు. దీంతో హేమంత్‌ సోరెన్‌ కీలకంగా మారారు. ఆయనే.. పార్టీని చేపట్టారు. 38 ఏళ్లకే 2013లో తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కానీ, ఏడాది కాలంలోనే ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత 2019లో మళ్లీ అధికారంలోకి వచ్చారు సోరెన్‌. తాజాగా వచ్చిన ఆరోపణలతో మరోమారు చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో సోరెన్‌ కుటుంబంలోని కొన్ని పేర్లు పరిశీలిద్దాం. 

ఇదీ చదవండి: రిసార్ట్‌కు ఎమ్మెల్యేలు..జార్ఖండ్‌ సీఎం అనర్హతపై అదే సస్పెన్స్‌

శిబు సోరెన్‌: 78 ఏళ్ల శిబు సోరెన్‌.. ప్రస్తుతం జేఎంఎం అధ్యక్షుడిగా, ఎంపీగా క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. ఆయనపై కోర్టుల్లో చాలా కేసులు ఉండటం సహా.. వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు వేధిస్తుండటం వల్ల సీఎం పదవి చేపట్టేందుకు విముఖత చూపించే అవకాశాలు ఉన్నాయి. 

► రూపి సోరెన్‌:   పార్టీ అధినేత శిబు సోరెన్‌ భార్య రూపి సోరెన్‌. ఆమెకు రాజకీయాల్లో అంతగా అనుభవం లేనప్పటికీ ఒకవేళ కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తితే ఆమె పేరు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలోనే ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేశారు. 

► కల్పనా సోరెన్‌:   హేమంత్‌ సోరెన్‌ తన భార్య కల్పనా సోరెన్‌ను ఇప్పటికే క్రియాశీల రాజకీయాల్లో భాగస్వామ్యం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అనిశ్చితి నెలకొంటే ఆమెను తెరపైకి తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. అయితే, ఆమె ఒడిశాకు చెందిన వ్యక్తి కావటం అడ్డంకిగా మారనుంది. 

► సీతా సోరెన్‌: దుర్గా సోరెన్‌ మరణం తర్వాత శిబు సోరెన్‌.. తన  కోడలు సీతా సోరెన్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. జామా నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, ఆమె సైతం ఒడిశా నుంచి రావటం అడ్డంకిగానే మారనుంది. 

► బసంత్‌ సోరెన్‌:   శిబు సోరెన్‌ చిన్న కుమారుడు, హేమంత్‌ సోరెన్‌ తమ్ముడు, దుమ్కా ఎమ్మెల్యే బసంత్‌ సోరెన్‌ పేరు వినిపిస్తోంది. అయితే.. ఆయన కూడా హేమంత్‌ లాగే ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సంఘం వద్ద పెండింగ్‌లో ఉంది. అనర్హత వేటు ఎదుర్కునే అవకాశం ఉంది. 

► అంజలీ సోరెన్‌:  శిబు సోరెన్‌ కుమార్తె అంజలీ సోరెన్‌ వివాహం తర్వాత ఒడిశా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. దీంతో సీఎం పదవి రేసు నుంచి ఆమె లేనట్లే. 

మరోవైపు.. జేఎంఎం, హేమంత్‌ సోరెన్‌.. కుటుంబేతర వ్యక్తివైపు చూస్తే.. అప్పుడు పార్టీ సీనియర్‌ లీడర్‌, సెరైకేలా ఎమ్మెల్యే చంపాయ్‌ సోరెన్‌ ముందంజలో ఉంటారు. ఇంటిపేరు ఒకే విధంగా ఉండటమే కాకుండా.. పార్టీకి అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు.

ఇదీ చదవండి: చిక్కుల్లో జార్ఖండ్‌ సీఎం సోరెన్‌

మరిన్ని వార్తలు