యూపీలో రోజూ నేరాలే.. రామ రాజ్యమంటే అదేనా? అఘాయిత్యం జరిగితే సీఎం చేసినట్టా?

15 Sep, 2022 18:58 IST|Sakshi

పాట్నా: బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఇటీవల బెగూసరాయ్‌లో జరిగిన కాల్పుల ఘటనకు సీఎం నితీశ్ కుమారే బాధ్యత వహించాలని బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా సీఎంనే నిదించడం సరికాదన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రోజూ ఎన్నో నేరాలు జరుగుతున్నాయని వాటికి బాధ్యత ఆయా సీఎంలదేనా? అని తేజస్వీ ప్రశ్నించారు. ఒకవేళ అక్కడ రేప్ జరిగితే అది వాళ్ల సీఎం చేసినట్లా? అని అడిగారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్‌ప్రేదశ్‌లో ప్రతి రోజు నేరాలు జరుగుతూనే ఉన్నాయని, రామరాజ్యమంటే అదేనా అని తేజస్వీ ధ్వజమెత్తారు.

'బెగూసరాయ్ కాల్పుల ఘటనకు కొత్త కోణం ఇవ్వాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. బీహార్‌లో ఉంది ప్రజా ప్రభుత్వం. 
బీజేపీ అంటేనే అతిపెద్ద అబద్దాల పార్టీ. వారు ఎప్పుడూ చెప్పింది చేయరు. ప్రజలను విభజించి సమాజంలో విషం నింపాలని చూస్తారు' అని తేజస్వీ తీవ్ర విమర్శలు చేశారు.

బెగూసరాయ్‌లో మంగళవారం కాల్పుల ఘటన జరిగింది. ఇద్దరు నిందుతులు బైక్‌పై ప్రయాణించి పలు చోట్లు అరగంటపాటు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. దీనిపై స్పందిస్తూ బీజేపీ నేత గిరిరాజ్ సింగ్.. నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బిహార్‌లో మహాఘట్‌బంధన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన ప్రతిసారి ఆటవిక రాజ్యమే వస్తుందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపైనే స్పందిస్తూ తేజస్వీ బీజేపీపై మండిపడ్డారు.
చదవండి: ఆటోలో ప్రయాణించి కేజ్రీవాల్‌ హల్‌చల్‌.. ఊహించని గిప్ట్‌ ఇచ్చిన బీజేపీ

మరిన్ని వార్తలు