ఇవి పార్టీల ఎన్నికలు కావు.. మన బతుకుదెరువు ఎన్నికలు

21 Aug, 2022 02:37 IST|Sakshi

మునుగోడు ‘ప్రజాదీవెన’ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌

బీజేపీ గెలిస్తే సంక్షేమ పథకాలు బంద్‌ అవుతాయి

ఏడాదిలోనే ఎన్నికలుండగా.. ఇప్పుడెందుకు ఉప ఎన్నిక వచ్చింది?

దీని వెనక ఉన్న మాయ గుర్తించకుంటే నష్టపోతాం

కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా ఎందుకు తేల్చడం లేదో అమిత్‌ షా చెప్పాలి

దెబ్బకు దిమ్మతిరిగేలా టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని పిలుపు

మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలుస్తుంది: పల్లా వెంకట్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘‘రైతు బంధు, రైతు బీమా తదితర సంక్షేమ పథకాలు అంతగా ఎందుకు ఇస్తున్నారని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. గుజరాత్‌లో రూ.600 పెన్షన్‌ ఇస్తుంటే.. ఇక్కడ రూ.2 వేలు ఎందుకు ఇస్తున్నారని అడుగుతోంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి తెస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు పడిందంటే మోటార్లకు మీటర్లు పడ్డట్టే. ప్రజలు ఆగం కావొద్దు. మోసపోతే గోస పడతాం. మోటార్ల వద్ద కాదు.. అందరం ఒక్కటై బీజేపీకే మీటర్‌ పెట్టాలి..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే సంక్షేమ పథకాలన్నీ బంద్‌ అవుతాయని.. ఇవి పార్టీల ఎన్నికలు కావని.. రైతులు, కార్మికుల ప్రజల బతుకుదెరువు ఎన్నికలని పేర్కొన్నారు. శనివారం మునుగోడులో టీఆర్‌ఎస్‌ నిర్వహించిన ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ప్రసంగం కేసీఆర్‌ మాటల్లోనే.. 

అమిత్‌షా సమాధానం చెప్పాలి.. 
‘‘రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లయినా కృష్ణా నదిలో తెలంగాణ వాటా ఎందుకు తేల్చడం లేదు. అవసరమైన చోటికి నీళ్లు తెచ్చుకుందామనుకుంటే మా వాటా తేల్చడం లేదు. ఇందుకోసమే అమిత్‌షా మునుగోడుకు వస్తున్నారా.. ఇదే గడ్డపై సమాధానం చెప్పాలి. పెద్ద మాటలు మాట్లాడే రాజగోపాల్‌రెడ్డి, ఇక్కడి నుంచి ఉన్న కేంద్రమంత్రి ఢిల్లీకి వెళ్లి కృష్ణా జాలాల వాటా సంగతేమిటని అడగలేరా. అలా కాకుండా డోలు బాజా తీసుకొని అమిత్‌షాను ఇక్కడికి తీసుకువస్తారా? çకృష్ణా జలాల్లో వాటా ఎందుకు తేల్చడం లేదో, మీ చేతగానితనం ఏంటో అమిత్‌షా చెప్పాలి. 

ఒక్క మంచి పని అయినా చేశారా? 
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లయింది. ఒక్క మంచి పని అయినా చేశారా? దళితులు, గిరిజనులు, మహిళలు, కార్మికులు, రైతులు ఏ వర్గానికీ మేలు జరిగిందీ లేదు. పైగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారు. ఎయిర్‌పోర్టులు, విమానాలు, రైళ్లు, బ్యాంకులు, గ్యాస్‌ కంపెనీలు, పోర్టులు అన్నీ పోయాయి. ఇప్పుడు రైతులు, భూములు, వ్యవసాయ పంటల మీద పడుతున్నారు. రైతులు, రైతు కూలీ నోట్లో మట్టి పోసే ప్రయత్నం జరుగుతోంది. బావుల వద్ద మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. నేనైతే ప్రాణం పోయినా మీటర్లు పెట్టబోనని అసెంబ్లీలోనే చెప్పిన. ఈ మీటర్ల వ్యవహారం వెనుక చాలా మోసం ఉంది. విద్యుత్‌ చార్జీలు, ఎరువుల ధరలు పెంచడం, పండిన పంటను కొనకపోవడం వంటివి చేసి.. రైతులు వ్యవసాయం చేయలేమనేలా చేస్తున్నారు. మోదీ దోస్తులు సూట్‌ కేసులు పట్టుకొని తిరుగుతున్నారు. మీ భూములు ఇచ్చేయండి, మేం వ్యవసాయం చేస్తం. మీరు కూలీ పనులు చేయండి అంటారు. వ్యవసాయాన్ని కార్పోరేట్ల పరం చేసే కుట్ర జరుగుతోంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. మునుగోడు నియోజకవర్గంలో 1.01 లక్షల మందికి రైతు బంధు వస్తోంది. నేరుగా బ్యాంకు అకౌంట్లలో పడుతోంది. ఇప్పుడు దానిని బంద్‌ చేయాలని చూస్తున్నారు. 

రైతు బీమాను బంద్‌ చేయాలట.. 
ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, మేం ఢిల్లీకి పొయి ధర్నా చేశాం. అంత పెద్ద ఎఫ్‌సీఐని చేతిలో పెట్టుకొని కూడా ధాన్యం తీసుకోబోమన్నారు. పైగా మీడియా వాళ్లు లేనిది చూసి.. మీరు అంతంత పెన్షన్లు ఎందుకిస్తున్నారు? రైతులకు డబ్బులు ఎందుకిస్తున్నారు అని అడిగారు. వికలాంగులకు, గీత కార్మికులకు, ముసలోళ్లకు పింఛన్‌ ఇవ్వొద్దట. ఈ నియోజకవర్గంలో 1,100 మందికి రైతు బీమా వచ్చింది. ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబం బజారున పడకుండా 15 రోజుల్లో రూ.5 లక్షలు బ్యాంకులో జమ అవుతోంది. ఇలాంటిది దేశంలో ఎక్కడైనా ఉందా? ఇది కూడా ఇవ్వకూడదంట. దీన్ని బంద్‌ పెట్టాలంటారు మోదీ. మరి ఏం చేయాలి? దేశంలో ఏం జరుగుతోందో ఆలోచించండి. 

బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లే.. 
మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదు. మన జీవితాల ఎన్నిక. బీజేపీకి ఓటేస్తే నష్టపోతాం. నువ్వు మీటర్లు పెట్టుమంటే పెట్టలేదు. అయినా ప్రజలు మాకే ఓటేశారని, నువ్వు తప్పుకో మేమే మీటర్లు పెడతామని మోదీ అంటారు. మీటర్లు పెట్టే నరేంద్ర మోదీ, బీజేపీ కావాలా..? మీటర్లు వద్దనే టీఆర్‌ఎస్, కేసీఆర్‌ కావాలా.. తేల్చుకోండి. గ్రామాల్లో అందరితో చర్చించండి. నేను ప్రధాన మంత్రితో కొట్లాడుతున్నా.. నా బలం, ధైర్యం మీరే. అలాంటి మీరు బీజేపీకి ఓటు వేసి బలహీనపరచొద్దు. మునుగోడులో ఎన్నడూ బీజేపీకి డిపాజిట్‌ రాలేదు. ఇప్పుడు వస్తదా.. వచ్చిందంటే మీటర్‌ వస్తది. బీజేపీకి ఓటు పడ్డది అంటే మన బాయికాడ మీటర్‌ పడ్డట్టే. అప్రమత్తంగా ఉండండి. మోటార్ల వద్ద కాదు.. అందరం ఒక్కటై బీజేపీకే మీటర్‌ పెట్టాలి. ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్‌ అయి పోరాటం చేయాలి. 

కాంగ్రెస్‌కు ఓటేస్తే వృథానే.. 
కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే వృధానే తప్ప ఉపయోగం ఉండదు. ఈ ఎన్నికతో తెలంగాణ ఏమంటోందన్న మెసేజీ దేశవ్యాప్తంగా Ðవెళ్లాలి. బొమ్మలు చూసో, గోల్‌మాల్, గ్యారడీ విద్యలు చూసో మోసపోతే గోసపడతాం. ఉన్న సౌకర్యాలు, ఉన్న పెన్షన్లు, ఉన్న వసతులు, ఉన్న కరెంటు ఊడగొట్టుకుందామా ఆలోచన చేయాలి. మునుగోడు రైతులు ఓటేసే ముందు పొలం కాడికి పోయి బోరుకు దండంపెట్టి ఓటేయండి. అక్క చెల్లెళ్లు ఓటేసేటప్పుడు గ్యాస్‌ సిలిండర్‌ ధర ఏడికిపోయిందో ఆలోచించి ఓటు వేయండి. బీజేపీని తరిమి కొట్టండి. మళ్లీ వస్తా. చండూరులో సమావేశం అవుదాం. 

దేశవ్యాప్తంగా క్రియాశీల పోరాటాలు 
దేశవ్యాప్తంగా ప్రగతిశీల, క్రియశీల శక్తులు ఏకం కావాలని, ఈ దుర్మర్గులను పంపేస్తేనే ప్రజలు, దేశం బాగుపడుతుందని సీపీఐ, సీపీఎం నాయకులతో చెప్పా. బీజేపీతో దేశ ప్రజల జీవితాలు దెబ్బతినే ప్రమాదం ఉందనే సీపీఐ టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించింది. సీపీఎం కూడా రేపోమాపో కలిసి వస్తుంది. ఈ పోరాటం ఒక్కరోజుతో ఆగేది కాదు. మునుగోడు నుంచి ఢిల్లీ దాకా ఐక్యత ఇలాగే కొనసాగాలి. పేదలు, రైతులు బాగుపడేదాకా పోరాటం కొనసాగిస్తాం. 

టీఆర్‌ఎస్‌తోనే నల్లగొండ అభివృద్ధి 
ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతం. నేను రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభించినప్పుడే ఈ సమస్యను అందరి దృష్టికి తీసుకువెళ్లాం. ఢిల్లీలో ప్రధాని ముందుకు బాధితులను తీసుకెళ్లి గోస చూపించాం. ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమికొట్టకపోతే నల్లగొండ నో మ్యాన్‌ జోన్‌ అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. అయినా రాష్ట్ర పాలకులుగానీ, దేశ పాలకులు గానీ పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చాక మిషన్‌ భగీరథ పథకంతో సురక్షిత తాగునీరు ఇచ్చి ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమికొట్టాం. కృష్ణా బేసిన్‌ నుంచి డిండి ద్వారా శివన్నగూడెం ప్రాజెక్టుకు నీరు తెచ్చుకోవాల్సి ఉంది. ఆ ప్రయత్నంలో ఉన్నాం. తెలివిగా ఆలోచించి టీఆర్‌ఎస్‌ అభ్యర్థినే గెలిపించుకోవాలి. 

ఇది గోల్‌ మాల్‌ ఎన్నిక 
ఇది ఆషామాషీ ఎన్నిక కాదు.. ఆగం కావద్దు.. మన చేతుల్లో ఉన్న అధికారాన్ని ఎవరికో అప్పజెప్పుకోవద్దు. ప్రజల చేతుల్లో ఉండే ఒకే ఒక్క ఆయుధం ఓటు. ఆలోచించి ఓటేయాలి. ఇది గోల్‌మాల్‌ ఎన్నిక. ఇంకో ఏడాదైతే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. మరి ఈ ఉప ఎన్నిక ఎందుకొచ్చింది, దీని వెనక ఉన్న మాయ ఏమిటో గుర్తించాలి. లేకపోతే దెబ్బతింటాం. మనదాంట్లో కూడా కొందరు సన్నాసులు ఉంటారు. పక్క నాయకులు మందుపెట్టి, దూది పెట్టగానే వాళ్ల వెంట వెళ్లిపోతారు. దానికి ఆశపడొద్దు. నేను ఒకటే చెబుతున్నా. ఇది పార్టీల ఎన్నిక కాదు.. రైతులు, కార్మికుల బతుకుదెరువు ఎన్నిక. తెలంగాణ మన జీవితం. దీన్ని పోగొట్టుకోవద్దు. ఎవరు పెద్ద మెజారిటీతో గెలుస్తారో వాళ్ల మెసేజ్‌ దేశానికి పోతుంది. కాబట్టి ఆలోచించాలి.

ఉన్నది మూడు తోకలు.. ఇంత అహంకారమా? 
తెలంగాణ అసెంబ్లీలో 119 ఎమ్మెల్యేలుంటే టీఆర్‌ఎస్‌కు 103 మంది. బీజేపీకి ఉన్నది 3 తోకలు. వాళ్లు మమ్మల్ని పడగొట్టి ఏక్‌నాథ్‌ షిండేలను తెస్తారట. ఇది అహంకారమా.. బలుపా.. ఎవరు పడితే వాళ్లు సీఎంను విమర్శిస్తారు. ఈడీ కేసు పెడతాం అంటారు. ఈడీ వస్తే ఏంటి? నాకే చాయ్‌ తాగించి పోవాలి. దొంగలైతే భయపడతారు. ఈడీ కాకపోతే బోడీ పెట్టుకో.. ఏం పీక్కుంటావో పీక్కో.. ప్రజల కోసం నిలబడేవాళ్లు మీకు భయపడరని మోడీ గుర్తుంచుకోవాలి. నువ్వు నన్ను గోకినా గోకకున్నా.. నేను నిన్ను గోకుతా. నీ దుర్మార్గం, నీ మోసకారి విషయాలు ప్రజలకు తెలుసు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో ప్రభుత్వాలను పడగొడతా అంటావ్‌. నిన్ను పడగొట్టే వారు లేరనుకుంటున్నావా? నిన్ను పడగొట్టడానికి వేరే శక్తులు అవసరం లేదు. అహంకారం, నీ గర్వమే నీ శత్రువులు.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధానాలే మీకు శత్రువులు అవుతాయి. 

రోడ్డు మార్గంలో చేరుకుని.. 
హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు రోడ్డు మార్గంలో బయలుదేరిన సీఎం కేసీఆర్‌.. 3.45 గంటలకు మునుగోడు సభావేదిక వద్దకు చేరుకున్నారు. మొదట అక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అంజలి ఘటించారు. తర్వాత తెలంగాణ అమర వీరులకు నివాళి అర్పించి.. టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత సభా వేదికపై ప్రసంగించారు. సభలో సీఎం కన్నా ముందు సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగించారు. 

మునుగోడులో బీజేపీ గెలిచే ప్రసక్తే లేదు: పల్లా వెంకటరెడ్డి 
ఉప ఎన్నికలో తాము టీఆర్‌ఎస్‌కు బేషరతుగా మద్దతిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌తో కలిసి వచ్చిన ఆయన సభలో మాట్లాడారు. ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్న కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడుతున్నారని.. దేశంలో మేధావులు, అభివృద్ధి కాముకులకు మొదటి శత్రువు మతోన్మాద బీజేపీనేనని పల్లా వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. మోదీ వచ్చినా మునుగోడు ఎన్నికల్లో బీజేపీ గెలిచే ప్రసక్తే లేదన్నారు. రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. 

ఫ్లోరైడ్‌ రక్కసిని రూపుమాపిన కేసీఆర్‌: మంత్రి జగదీశ్‌రెడ్డి
మునుగోడును పట్టి పీడించిన ఫ్లోరైడ్‌ రక్కసిని సీఎం కేసీఆర్‌ రూపుమాపారని మంత్రి జి.జగదీశ్‌రెడ్డి మునుగోడు సభలో పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందునాటి మునుగోడు, నల్లగొండ బాధలు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఆవేదన కలుగుతోందన్నారు. అది దేవుడిచ్చిన శాపం కాదని.. పాలకులు చేసిన మోసమని మండిపడ్డారు. కేసీఆర్‌ ఉద్యమ సమయంలో ఏ జిల్లాకు వెళ్లినా నల్లగొండ బాధలు చెప్పేవారరని.. ప్రజల బాధను రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలియజేశారని వివరించారు. తెలంగాణ వచ్చి, కేసీఆర్‌ సీఎం అయిన ఏడాదిలోనే మునుగోడుకు రక్షిత తాగునీటిని తీసుకు వచ్చారని చెప్పారు. మిషన్‌ భగీరథతో ఏ ఒక్కరూ ఫ్లోరోసిస్‌ వ్యాధికి గురికాకుండా కాపాడారన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ మునుగోడులో దాదాపు 15 శాతం వికలాంగులు ఉన్నారని పేర్కొన్నారు.
చదవండి: 24 గంటలు టైమ్‌ ఇస్తున్నా.. కేజ్రీవాల్‌కు కేంద్ర మంత్రి ఠాకూర్‌ సవాల్‌

మరిన్ని వార్తలు