పట్టాభి చేసింది తప్పే; టీడీపీలో సీనియర్ల అసహనం

21 Oct, 2021 04:11 IST|Sakshi

చంద్రబాబు తీరుపైనా నాయకుల్లో అసంతృప్తి 

అందుకే బంద్‌కి ఎక్కువమంది నేతలు దూరం 

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌పై తమ పార్టీ నేత పట్టాభి చేసిన దూషణలపై తెలుగుదేశం పార్టీలోనే అసహనం వ్యక్తమవుతోంది. అసభ్య పదజాలంతో సీఎంను తిట్టడం సరికాదని పలువురు సీనియర్‌ నాయకులు అంతర్గత సంభాషణల్లో అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేయకుండా పార్టీ ఆఫీసులో కూర్చుని రాజకీయాలు మాట్లాడే వారిని ఎక్కువగా ప్రోత్సహించడం వల్ల గతంలో నష్టం జరిగిందని పలువురు నేతలు చెబుతున్నారు. ఆ విషయం తెలిసి కూడా చంద్రబాబు అలాంటి వారిని పట్టుకుని వేళ్లాడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు వ్యూహాలతో చంద్రబాబు కోటరీలోని కొందరు వ్యక్తులు ఇలాంటి వ్యవహారాలు చేయిస్తున్నారని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు సైతం వారి ట్రాప్‌లో పడి వాస్తవాలు గ్రహించడంలేదంటున్నారు.

రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూసిన వ్యూహాలేవీ ఇప్పటివరకు పనిచేయలేదని చెబుతున్నారు. ఇప్పుడు జరిగింది కూడా అదేనని వాపోతున్నారు. పట్టాభి వ్యాఖ్యలను సమర్థించేలా చంద్రబాబు మాట్లాడడంపై పలువురు సీనియర్లు అభ్యంతరాలు లేవనెత్తినట్లు తెలిసింది. వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల ప్రజల్లో పార్టీ పట్ల సానుకూలత రాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనల వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని స్పష్టం చేస్తున్నారు. అప్పటికప్పుడు మీడియాలో కొద్దిరోజులు నానడం తప్ప అంతిమంగా దీనివల్ల పార్టీకి ప్రయోజనం రాకపోగా ప్రజల్లో చులకనయ్యే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇచ్చిన బంద్‌ పిలుపునకు పార్టీ నుంచే పూర్తిస్థాయి మద్దతు రాలేదని చెబుతున్నారు. బంద్‌ ద్వారా పార్టీ శ్రేణులను ఉత్తేజపరచాలని చంద్రబాబు ప్రయత్నించారు. కానీ వారినుంచి ఆశించిన స్పందన రాలేదు. బంద్‌తో రాష్ట్రం మొత్తం అలజడి సృష్టించాలని చూసినా అదేమీ జరగలేదు. చంద్రబాబు ఆలోచనలకు భిన్నంగా పార్టీ నాయకులు, శ్రేణుల ఆలోచనలు ఉన్నాయనడానికి ఈ బంద్‌ ఉదాహరణని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

టీడీపీ నేతలు ఎక్కువమంది బంద్‌కు దూరంగా ఉన్నారు. సాధారణంగా ఎప్పుడూ కనిపించే నాయకులు సైతం బంద్‌లో కనిపించలేదు. పార్టీలోనే చంద్రబాబు పిలుపునకు స్పందన లేనప్పుడు ప్రజల నుంచి ఎలా ఉంటుందని టీడీపీలోనే కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. పట్టాభి వ్యాఖ్యల తర్వాత జరిగిన పరిణామాల ద్వారా లబ్ధిపొందడానికి బంద్‌కు పిలుపిచ్చినా ప్రజలు అసలు పట్టించుకోకపోవడానికి ఇదే కారణమని చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు