వైఎస్సార్‌సీపీ జైత్రయాత్ర

3 Nov, 2021 04:38 IST|Sakshi

సంక్షేమ ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన ప్రజలు

సీఎం జగన్‌ పాలన పట్ల నానాటికీ పెరుగుతున్న మద్దతు

సాక్షి, అమరావతి: ఎన్నికలు ఏవైనప్పటికీ వైఎస్సార్‌సీపీ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. అన్ని వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు మనసారా ఆశీర్వదిస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలో సాగుతున్న కుట్రలను ‘ఓట్లే’ అస్త్రాలుగా ఎప్పటికప్పుడు ఛేదిస్తున్నారు. తాజాగా బద్వేల్‌ ఉప ఎన్నికలోనూ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధను అఖండ మెజార్టీతో గెలిపించారు. ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకటసుబ్బయ్య అకాల మరణంతో బద్వేల్‌ స్థానానికి ఉప ఎన్నికను ఎన్నికల సంఘం నిర్వహించింది.

ఉపఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడక ముందే 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఓబుళాపురం రాజశేఖర్‌నే తాము మరోసారి బరిలోకి దించుతున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. అయితే ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత సాంప్రదాయాన్ని పాటిస్తూ తమ అభ్యర్థిని పోటీకి దించడం లేదని చంద్రబాబు ప్రకటించారు. పరిషత్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను బరిలోకి దించి ప్రచారం కూడా చేసి చివరకు ఓటమి భయంతో ఎన్నికలను బహిష్కరించినట్లు డ్రామా ఆడిన తరహాలోనే ఈ ఉప ఎన్నికలోనూ చంద్రబాబు సరికొత్త ఎత్తుగడ వేశారు.

బీజేపీ–జనసేన కూటమి తరఫున బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి సురేష్‌ తరఫున చంద్రబాబు, ఆ పార్టీ నేతలు అన్నీ తామై వ్యవహరించారు. ప్రచారం దగ్గర నుంచి పోలింగ్‌ వరకూ టీడీపీ నేతలే పర్యవేక్షించారు. పోలింగ్‌ ఏజెంట్లుగానూ టీడీపీ నేతలే కూర్చున్నారు. అంటే బీజేపీ–జనసేన–టీడీపీ లోపాయికారీగా జట్టు కట్టినట్లు స్పష్టమవుతోంది. మూడు పార్టీలు లోపాయికారీగా జట్టుకట్టి బరిలోకి దిగినా సరే వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. మంగళవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్‌ నుంచి చివరి వరకూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి 90,533 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు.

బద్వేల్‌ ఎన్నికల చరిత్రలో ఇదే భారీ మెజార్టీ కావడం గమనార్హం. పోస్టల్‌ బ్యాలెట్లతో కలిపి 1,47,166 ఓట్లు పోల్‌ కాగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 1,12,211 (76.25 శాతం) ఓట్లు వచ్చాయి. టీడీపీ లోపాయికారీగా మద్దతు ప్రకటించిన బీజేపీ–జనసేన కూటమి అభ్యర్థి సురేష్‌కు 21,678 (14.73 శాతం) ఓట్లు వచ్చాయి. మూడు పార్టీలూ సహకారం అందించినా సురేష్‌ డిపాజిట్‌ కోల్పోయారు. కాంగ్రెస్‌ పార్టీ 6,235 ఓట్లకు పరిమితమైంది.

సుపరిపాలనకు ప్రజల మద్దతు..
2019 సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు సాధించి 151 శాసనసభ స్థానాలు (86.26 శాతం), 22 ఎంపీ సీట్లతో (88 శాతం) వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి ఏడాదిలోనే 95 శాతానికిపైగా హామీలను అమలు చేశారు. 

తద్వారా దేశంలో సరికొత్త రాజకీయాలకు తెరతీశారని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలతోపాటు దేశంలో ఎక్కడా లేని రీతిలో విప్లవాత్మక సంస్కరణల ద్వారా సుపరిపాలన అందిస్తున్నారు. ఇది చూసి ఓర్చుకోలేని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిత్యం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు కుట్రలు చేస్తూ వస్తున్నారు. వాటిని ప్రజలు ఎప్పటికప్పుడు తమ తీర్పు ద్వారా తుత్తునియలు చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌కు అండగా నిలుస్తున్నారు.

► రాష్ట్రంలో 13,081 గ్రామ పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికల్లో 81 శాతం అంటే 10,536 పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులనే గెలిపించడం ద్వారా ప్రజలు తమ మనోగతాన్ని స్పష్టంగా వెల్లడించారు. 
► 75 పురపాలక (మున్సిపాలిటీలు), 12 నగరపాలక(కార్పొరేషన్‌) సంస్థలకు, మండల, జిల్లా పరిషత్‌ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేయగా ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను బరిలోకి దించుతూ చంద్రబాబే బీ–ఫారాలు జారీ చేశారు. పురపాలక, నగరపాలక ఎన్నికల్లో చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేష్‌ కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేశారు. అప్పటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను అడ్డుపెట్టుకుని రోజుకో డ్రామా ఆడుతూ సీఎం వైఎస్‌ జగన్‌పై బురద చల్లేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత చంద్రబాబు ఓటమి భయంతో ఎన్నికలను బహిష్కరించినట్లు ప్రకటించి డ్రామాను తుది అంకానికి చేర్చినా ఘోర పరాజయం తప్పలేదు. 
► తిరుపతి లోక్‌సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికలో టీడీపీ, బీజేపీ–జనసేన, కాంగ్రెస్‌ సర్వశక్తులూ ఒడ్డినా ప్రజలు తగినరీతిలో బుద్ధి చెప్పారు. 2019 సాధారణ ఎన్నికలతో పోల్చితే టీడీపీకి 5.57 శాతం ఓట్లు తక్కువగా వచ్చాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తికి 56.67 శాతం ఓట్లు, 2,71,592 ఓట్ల ఆధిక్యంతో ప్రజలు అపూర్వ విజయాన్ని అందించి సీఎం జగన్‌ పాలనకు మద్దతు పలికారు.

పరిషత్‌ ఎన్నికల్లో చారిత్రక విజయం..
రాష్ట్రంలో 9,583 ఎంపీటీసీ స్థానాలు, 638 జడ్పీటీసీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లోనూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేయని కుట్ర లేదు. వాటిని అడ్డుకున్న ప్రజలు ఏకంగా 8,249 ఎంపీటీసీ స్థానాల్లో (86 శాతం) వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించారు. 638 జడ్పీటీసీ స్థానాల్లో 630 చోట్ల (98.75 శాతం) వైఎస్సార్‌సీపీ అభ్యర్థులనే గెలిపించడం ద్వారా చారిత్రక విజయాన్ని అందించారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో అన్ని జిల్లా పరిషత్‌ల్లోనూ (13 జిల్లా పరిషత్‌లకునూగా 13) వైఎస్సార్‌సీపీని గెలిపించడం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ సుపరిపాలనను దీవించారు.

సంక్షేమ, అభివృద్ధి పాలనకు జేజేలు..
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95 శాతానికిపైగా తొలి ఏడాదిలోనే అమలు చేసిన చరిత్ర ఇప్పటిదాకా లేదు. సీఎం జగన్‌ గ్రామ సచివాలయాల ద్వారా పరిపాలనలో సంస్కరణలు తెచ్చి వలంటీర్ల ద్వారా ప్రజల ఇంటి వద్దకే పాలనను తీసుకెళ్లారు. కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారు. సమతుల అభివృద్ధే లక్ష్యంగా మూడు రాజధానులను ఏర్పాటు చేశారు.

నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు కల్పిస్తూ చట్టం చేసి అమలు చేయడం ద్వారా సామాజిక, రాజకీయ విప్లవానికి నాంది పలికారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ.. పేదలకు ఏమాత్రం కష్టం కలగనివ్వకుండా సంక్షేమ పథకాలను అమలు చేసి ఆదుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి నిరంతరం తపిస్తూ దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్‌కు ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.  

మరిన్ని వార్తలు