కరోనా : సెప్టెంబరు చివరి నాటికి 65 లక్షల కేసులు

5 Sep, 2020 14:51 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

లాక్‌డౌన్ ఉపయోగించుకోలేని ఏకైక దేశం మనదే : చిదంబరం

సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో కరోనావైరస్ కేసుల ఉధృతి పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.  లాక్‌డౌన్ వ్యూహం నుంచి  ప్రయోజనాన్ని పొందలేని ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశమేనని వ్యాఖ్యానించారు.  లాక్‌డౌన్ ద్వారా అన్ని దేశాలు కరోనా మహమ్మారిని అదుపు చేస్తే భారత్‌లో మాత్రం కరోనా విజృంభిస్తోందన్నారు. ఈమేరకు శనివారం ఆయన వరుస ట్వీట్లలో  నరేంద్ర మోదీ ప్రభుత్వంపై దాడి చేశారు.

సెప్టెంబర్ 30 నాటికి మొత్తం సంఖ్య 55 లక్షలకు చేరుకుంటుందని మొదట ఊహించాను... కానీ ఈ విషయంలో తనది  తప్పు అంచనా  అని పేర్కొన్నారు, సెప్టెంబర్ 20 నాటికి భారతదేశం ఆ సంఖ్యకు(55 లక్షలు) చేరుకోనుందని వ్యాఖ్యానించారు.  అంతేకాదు సెప్టెంబర్ చివరి నాటికి కేసులసంఖ్య 65 లక్షలకు చేరవచ‍్చని  అంచనావేశారు.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ 21 రోజుల్లో కరోనా వైరస్‌ను అంత చేస్తామంటూ మొదట్లో హామీలు గుప్పించారని, కానీ ఐదు నెలలు గడిచినా కరోనాను ఎందుకు కట్టడి చేయలేకపోయారో ప్రధాని వివరణ ఇవ్వాలని  ఆయన డిమాండ్ చేశారు. ఇతర దేశాలు విజయవంతం అయినప్పుడు భారతదేశం ఎందుకు విఫలమైందో వివరించాలన్నారు.  వి షేప్‌ రికవరీ అంటూ ప్రజలను తప్పు దారి పట్టింస్తోందని మండిపడ్డారు  అలాగే  2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆర్థికమందగమనం, ప్రతికూల వృద్ధిపై ఆర్థికమంత్రిత్వ శాఖ వద్ద సమాధానం లేదని మరో ట్వీట్‌లో మాజీ ఆర్థిక మంత్రి  చిదంబరం  ఆరోపించారు.

కాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40,23,179కి చేరింది. అందులో 8,46,395 యాక్టివ్ కేసులు ఉండగా, 31,07,223 మంది ఇప్పటికే వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.  మరణాలు 69,561గా ఉ న్నాయి.

మరిన్ని వార్తలు