ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌లో ఎన్డీఏకు పట్టం

21 Jan, 2022 11:45 IST|Sakshi

ప్రధాని మోదీకి తగ్గని ప్రజాదరణ

సీట్లు కొద్దిగా తగ్గినా సొంతంగానే అధికారంలోకి బీజేపీ 

ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఇదీ పరిస్థితి

సీ ఓటర్‌– ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వే వెల్లడి

ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో సీఎంలకు మాత్రం మోదీ స్థాయిలో అనుకూలత లేదు

సంతృప్తకర పాలన అంశంలో సగం మార్కైన 50 శాతాన్ని దాటని ఏ ఒక్క సీఎం

అనుకూల– వ్యతిరేక ఓటు... రెండింటిలోనూ యోగియే టాప్‌

దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మరోసారి బీజేపీయే అధికారంలోకి వస్తుందని, ప్రధానిగా వరుసగా మూడోసారి కూడా ప్రజలు నరేంద్ర మోదీనే కోరుకుంటున్నారని సీ ఓటర్‌– ఇండియా టుడే సంయుక్త సర్వే తేల్చింది. నేషనల్‌ డెమొక్రాటిక్‌ అలయన్స్‌ (ఎన్డీయే) సీట్ల సంఖ్య 350 నుంచి 296కు పడిపోతుందని చెప్పింది. ఎంపీల సంఖ్య 303 నుంచి 271 సీట్లతో సొంతంగా అధికారంలోకి వచ్చే స్థితిలోనే ఉందని తేల్చింది.

అయితే జాతీయ స్థాయిలో మోదీకి, బీజేపీకి ఆదరణ చెక్కుచెదరకున్నా... రాష్ట్రాలకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ ఏ ఒక్క సీఎంకు పూర్తిస్థాయి ప్రజాదరణ కనిపించడం లేదు. ఈ రాష్ట్రాల్లో ఏ ఒక్క సీఎం కూడా సంతృప్తకర పాలన అంశంలో సగం మార్కు అయిన 50 శాతాన్ని దాటలేకపోవడం గమనార్హం. అలాగే ఐదు రాష్ట్రాల సీఎంలపైనా 34 శాతం మంది ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉండటం గమనార్హం.

ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతలుగా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో పంజాబ్‌ మినహా మిగతా నాలుగింటిలో బీజేపీ సీఎంలే ఉన్నారు. పాలన సంతృప్తకర స్థాయిలో ఉందనే అంశంలో ఐదు రాష్ట్రాల్లో పోల్చినపుడు 49 శాతం అనుకూల ఓట్లతో అందరికంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌యే ఆధిక్యంలో ఉన్నారు. విశేషమేమిటంటే వ్యతిరేకతలోనూ ఆయనే టాప్‌. దేశంలో అన్నింటికంటే పెద్ద రాష్ట్రమైన యూపీ, 2.13 కోట్ల ఓటర్లున్న పంజాబ్‌లతో కలిపి మొత్తం ఐదు రాష్ట్రాల్లో 18.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ సర్వే దేశ జనాభాలో మొత్తం 12.8 శాతం మంది అభిప్రాయాలను ప్రతిఫలిస్తుందనుకోవచ్చు.  

► ఎవరు చేశారు: (మైక్, రిసీవర్‌ ఫోటోస్‌) సీ ఓటర్‌– ఇండియా టుడే టీవీ సంయుక్త సర్వే
► ఎక్కడ చేశారు: ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో.
► సర్వే శాంపిల్‌ (ఎంతమందిని ఇంటర్వ్యూ చేశారో చెప్పే సంఖ్య): 60,141
► తొలిదశలో: 20,566 (ఆగస్టు 16, 2021– జనవరి 10– 2022 మధ్య)
► మలిదశలో: 39,575 (గత మూడు వారాల్లో)
ఎలా చేశారు: కరోనా నేపథ్యంలో ప్రత్యక్షంగా చేయకుండా టెలి ఫోన్‌ ద్వారా ఇంటర్వ్యూ చేశారు.

ప్రేమించు లేదా ద్వేషించు
ఐదు రాష్ట్రాల సీఎంలతో పోల్చిచూసినపుడు అనుకూలత– వ్యతిరేకతల్లో యూపీ సీఎం యోగియే టాప్‌లో ఉన్నారు. అంటే కరడుగట్టిన హిందూత్వ వాదిగా పేరుపడ్డ యోగిని ప్రేమించే వాళ్లు ఎంత అధికంగా ఉన్నారో... ద్వేషించే వాళ్లూ అధికాంగానే ఉన్నట్లు లెక్కని ఇండియా టుడే ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రాజ్‌ చెంగప్ప, ఇతరు నిపుణులు అభిప్రాయపడ్డారు.

సామర్థ్యాన్ని శంకించే వారు సొంత పార్టీలోనే ఎక్కువ
కాంగ్రెస్‌కు ఈ వైల్డ్‌కార్డ్‌ బాగానే పనిచేస్తోంది. అయితే పంజాబ్‌ సీఎంగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ సామర్థ్యాన్ని శంకించే వారిలో బయటివారికంటే సొంత పార్టీలోనే ఎక్కువగా ఉన్నారు.

మరిన్ని వార్తలు