ప్రియాంకపై కాంగ్రెస్‌ ప్రశంసలు

4 Oct, 2020 11:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో ఇటీవల చోటుచేసుకున్న అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. కేంద్రలోని బీజేపీ, యూపీలో యోగి ఆదిత్యానాథ్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా విపక్షాలతో సహా ప్రజాసంఘాలు నిరసన గళాలను వినిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ ఈ ఘటనపై ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. బీజేపీ పాలనలో మహిళలకు కనీస రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దేశ రాజధాని నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిరసన కార్యక్రమాలను భుజానికెత్తుకుంది. ఈ క్రమంలోనే హథ్రాస్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీలను అడ్డుకుని వారితో యూపీ పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే తాము వారిని అడ్డుకున్నామని పోలీస్‌ విభాగం చెబుతున్నా.. ప్రియాంకపై ఖాకీల తీరు సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.

హథ్రాస్‌లో అత్యాచారానికి గురై, మృతిచెందిన దళిత యువతి కుటుంబ సభ్యులను కలిసేందుకు రాహుల్‌తో కలిసి వెళ్లిన ప్రియాంకను ఢిల్లీ–నోయిడా మధ్య ఉన్న యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై పోలీసుల బృందం నిలువరించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో పలువురు నేతలు వారితో వాగ్వాదానికి దిగగా.. పోలీసులు వారిని తోసివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. ఈక్రమంలోనే కారులోంచి దిగిన ప్రియాంక బారికేడ్లను దాటుకుని వచ్చి కార్యకర్తలకు అండగా నిలిచారు. అయితే, ఓ కానిస్టేబుల్‌ ఆమె భుజంపై చేయి వేసి లాగేందుకు ప్రయత్నించగా.. ప్రియాంక పక్కకు తోసేశారు. అంతేకాకుండా రోడ్డుపై అడ్డుగా ఉన్న కార్లను ఎక్కి దాటుకుంటూ వెళ్లి మరికొందమంది కార్యకర్తలను కలిసి మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలతో పాటు ఆ పార్టీ మహిళా విభాగం, నేతలు వీటిని షేర్‌ చేస్తూ కామెంట్స్‌ పెడుతున్నారు.

మరిన్ని వార్తలు