ఇప్పుడు కాకుంటే ఎప్పటికీ కాదు: దేవేంద్ర ఫడ్నవిష్‌

6 Sep, 2022 10:36 IST|Sakshi

ముంబై లాల్‌ బాగ్‌ చా రాజాను దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి

సాక్షి ముంబై: శివసేన బీజేపీని వెన్నుపోటు పొడిచిందని, వారికి శిక్ష తప్పదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హెచ్చరించారు. ముంబై పర్యటనపై ఉన్న ఆయన మేఘదూత్‌ బంగ్లాలో జరిగిన బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు, ఆఫీసు బేరర్లకు మార్గనిర్దేశం చేస్తూ శివసేనపై తనదైన శైలిలో మండిపడ్డారు. రాజకీయాల్లో మోసం చేసేవారిని మళ్లీ నేలపైకి తీసుకువచ్చే సమయం ఆసన్నమైందన్నారు.

రాజకీయాల్లో అన్ని సహించవచ్చు కానీ నమ్మకద్రోహం, వెన్నుపోటును సహించవద్దని అమిత్‌ షా బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఎంసీలో ఎలాగైనా పట్టు సాధించాలన్న లక్ష్యంతో కార్యకర్తలు ముందుకువెళ్లాలని అమిత్‌ షా పిలుపునిచ్చారు. ముఖ్యంగా బీఎంసీలో 150 స్థానాలు గెలుస్తామని ఇందుకోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. 

అభి నహీ తో కభీ నహీ:  ఫడ్నవీస్‌ 
రాబోయే ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల అనంతరం ముంబై మేయర్‌ పదవిని బీజేపీ చేపడుతుందని ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల మార్గదర్శన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ‘అభీ నహీ తో కభీ నహీ’ (ఇప్పుడు కాకుంటే ఎప్పటికీ కాదు) అనే నినాదం చేస్తూ అందరూ ఈసారి ఎలాగైనా విజయం మాదేనన్న ధీమాతో ఎన్నికల బరిలోకి దిగాలన్నారు.

ఇప్పుడు మన దృష్టంతా రాబోయే ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై ఉంచాలన్నారు. ముఖ్యంగా బీఎంసీపై బీజేపీ జెండా ఎగురుతుందుని, ఎందుకంటే అసలైన శివసేన మనతోనే ఉందన్నారు. ఇవి చివరి ఎన్నికలుగా భావించి అందరూ గెలుపుకోసం కృషి చేయాలని ఇప్పుడు కాకుంటే ఎప్పటికీ కాదంటూ తన ప్రసంగంతో అందరిలో ఉత్తేజం నింపారు.  

లాల్‌ బాగ్‌చా రాజాను దర్శించుకున్న అమిత్‌ షా... 
కోరికలు తీర్చేదైవంగా ప్రసిద్ధిగాంచిన ముంబైలోని లాల్‌ బాగ్‌ చా రాజా గణపతిని హోంశాఖ మంత్రి అమిత్‌ షా దర్శించుకున్నారు. ముంబై పర్యటనకు వచ్చిన ఆయన ముందుగా లాల్‌బాగ్‌ చా రాజాను దర్శించుకున్నారు. ఆయనతోపాటు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లతోపాటు ఇతర బీజేపీ నేతలు కూడా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమిత్‌ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు.   

మరిన్ని వార్తలు