టీడీపీలో సస్పెన్షన్ల కలకలం..

19 Apr, 2021 07:49 IST|Sakshi

ఎచ్చెర్లలో తీవ్రస్థాయిలో విభేదాలు

కళాకు పెరుగుతున్న వ్యతిరేకత

అసమ్మతినేతలను టార్గెట్‌ చేసిన కళా

ఒక్కొక్కరిపై సస్పెన్షన్‌ వేటు  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల టీడీపీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఇప్పుడు రాజుకుంటున్నాయి. భవిష్యత్‌లో తనకు ప్రతిబంధకంగా త యారవుతున్న నాయకులను సాగనంపే పనిలో టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు ఉన్నారు. తనకు పోటీగా తయారవుతున్న నాయకులపై సస్పెన్షన్‌ వేటు వేస్తున్నారు. మొన్నటికి మొన్న జి.సిగడాం మండలం సీనియర్‌ టీడీపీ నేత బాలగుమ్మి వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేయగా, నేడు టీడీపీ ఉత్తరాంధ్ర కార్యకర్తల శిక్షణ శిబిరం డైరెక్టర్‌ కలిశెట్టి అప్పలనాయుడును సస్పెండ్‌ చేస్తున్న ట్టు కళా వెంకటరావు ప్రకటించారు.

2019 ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గరి నుంచి కళా వెంకటరావుకు నియోజకవర్గంలో అసమ్మతి పోరు ఎక్కువైంది. ముఖ్యంగా కళా కుమారుడు రామ్‌ మల్లిక్‌ నాయుడును నియోజకవర్గంపై వదలడం, రాష్ట్ర స్థాయి పదవి అప్పగించడంతో కళాపై కినుకు ఎక్కువైంది. అసలే వలస నేత, ఆపై ఆయన కుటుంబ సభ్యులు తమపై పెత్తనం చేయడమేంటని ఆ నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగింది. దీంతో కళా అలెర్ట్‌ అయ్యారు. వ్యతిరేకంగా గళం విప్పుతున్న నేతలు, పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాయకులపై దృష్టి సారించారు. మొన్నటికి మొన్న జి.సిగడాం మండలం సీనియర్‌ నేత బాలగుమ్మి వెంకటేశ్వరరావును ఏకపక్షంగా సస్పెండ్‌ చేయగా, నేడు నియోజకవర్గంలో కీలకమైన కలిశెట్టి అప్పలనాయుడుపైనా అదే వేటు పడింది. షోకాజ్‌ నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్‌ చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అసలు కళాకు ఆ అధికారం ఎక్కడిదని, ఏ ఆదేశాలైనా పార్టీ నుంచి రావాలని ఆయన్ని వ్యతిరేకిస్తున్న నాయకులంతా ప్రశ్నిస్తున్నారు.

బీజేపీతో దోస్తీ..  
ఒక వైపు కళా వెంకటరావు సోదరుడు కుటుంబీకులంతా ఇప్పటికే బీజేపీతో టచ్‌లో ఉన్నారు. సోము వీర్రాజు తదితర నేతలతో మంతనాలు జరిపారు. మే నెలలో బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఇదంతా ఎప్పటికప్పుడు కళా వ్యతిరేక వర్గీయులు బయటపెడుతున్నారు. ఏ రోజుకైనా కళా వెంకటరావు బీజేపీలో చేరడం ఖాయమని కూడా చెప్పుకొస్తున్నారు. ఇలాంటి సమయంలో తనకు వ్యతిరేకంగా నడుస్తున్న నాయకులపై వరుసగా సస్పెన్షన్‌ వేటు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో ఉండాలంటే అసమ్మతి నేతలందరినీ బయటికి పంపించాలనే షరతుతో అధిష్టానాన్ని బ్లాక్‌ మెయిల్‌ చేసి తమపై వేటు వేస్తున్నారని అసమ్మతి నేతలు వాపోతున్నారు. అధికారంలో ఉన్నంతకాలం అక్రమాలకు పాల్పడి, పార్టీని అప్రతిష్ట పాలుజేసి, ఇప్పుడు కష్టపడ్డ సీనియర్లను పార్టీ నుంచి దూరం చేయడం వెనక కుట్ర దాగి ఉందని ఆ పార్టీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
చదవండి:
ఆ ఇద్దరికీ పదవీ గండం?    
ఆధ్యాత్మిక స్థలంపై టీడీపీ నేత కన్ను

మరిన్ని వార్తలు