రసాభాసగా టీఆర్‌ఎస్‌ సమావేశం

13 Feb, 2021 14:30 IST|Sakshi
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సమక్షంలో వాగ్వాదం చేసుకుంటున్న నాయకులు 

పార్టీ సభ్యత్వ నమోదులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయుల వాగ్వాదం  

ప్రారంభ ఉపన్యాసం విషయంలో గొడవ 

తీవ్ర పదజాలంతో దూషించుకున్న నాయకులు 

సర్దిచెప్పిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి

సాక్షి, వికారాబాద్‌(యాలాల): టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాసగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి.. తాండూరు పట్టణ శివారులోని ఎస్‌వీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం టీఆర్‌ఎస్‌ యాలాల మండల కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు సభ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఇక్కడకు చేరుకున్నారు. ఎంపీపీ బాలేశ్వర్‌గుప్త సమావేశాన్ని ప్రారంభిస్తూ మాట్లాడారు. ఆతర్వాత ఏఎంసీ చైర్మన్‌ విఠల్‌ నాయక్‌కు మైక్‌ అందిస్తుండగా.. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సిద్రాల శ్రీనివాస్‌ అడ్డుకున్నారు. ఇది పార్టీకి సంబంధించిన సమావేశమని, ముందుగా పార్టీ అధ్యక్షుడికి మాట్లాడే అవకాశం ఇవ్వరా..? అని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పార్టీ మండల అధ్యక్షుడికి మొదట మాట్లాడే అవకాశం ఇవ్వాలని మైక్‌ అప్పగించారు.

ఇదే సమయంలో తాను రెండు నిమిషాల్లో ప్రసంగం ముగిస్తానని విఠల్‌ నాయక్‌ చెప్పడంతో సిద్రాల శ్రీనివాస్‌ ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై మధ్యలో కల్పించుకున్న మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డిపై సిద్రాల శ్రీనివాస్‌ మండిపడ్డారు. ‘ఇది యాలాల మండల పార్టీ సమావేశం.. తాండూరు మండలానికి చెందిన వాడివి, నీకు ఇక్కడ ఎలాంటి పని లేదు’ అని గద్దించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పార్టీ కార్యక్రమంలో మండల అధ్యక్షుడికే అవమానం జరిగితే ఎలా అని అసహనం వ్యక్తంచేస్తూ కొంతమంది సర్పంచ్‌లు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాయకులకు నచ్చజెప్పడంతో సిద్రాల శ్రీనివాస్‌ ప్రసంగం ప్రారంభించారు.

 ఆయన మాట్లాడుతూ.. ‘ఇటీవల పార్టీకి కొందరు కొత్తబిచ్చగాళ్లు వచ్చారు’అనడంతో.. ఎంపీపీ బాలేశ్వర్‌గుప్త అడ్డుకున్నారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో స్టేజీపై ఇలా మాట్లాడటం తగదన్నారు. రెండు రోజులుగా సమావేశ ఏర్పాట్లు జరుగుతున్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా సమయానికి వచ్చి గొడవ చేయడం ఏమిటని నిలదీశారు. ఇలా కార్యక్రమం ముగిసే వరకూ నాయకుల మధ్య వాగ్వాదం కొనసాగింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో రోహిత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి కలి్పంచుకుని పరిస్థితిని మరింత ఉద్రిక్తం కాకుండా చక్కదిద్దారు.

మరిన్ని వార్తలు