Nandyal TDP: టీడీపీలో వర్గ పోరు

7 Jun, 2022 08:08 IST|Sakshi

క్లస్టర్‌ సమావేశం సాక్షిగా బయటపడిన విభేదాలు 

సమావేశానికి పిలుపే లేదన్న ఎన్‌ఎండీ ఫిరోజ్‌ 

గైర్హాజరైన ఏవీ సుబ్బారెడ్డి  

సమావేశానికి దూరంగా ఫరూక్‌ వర్గీయులు 

నంద్యాల: వచ్చే ఎన్నికల్లో టికెట్‌ లక్ష్యంగా నంద్యాల టీడీపీ నేతల మధ్య అప్పుడే మూడు ముక్కలాట మొదలైంది. నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నేతలు వర్గ పోరు బాట పట్టారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఎన్‌ఎండీ ఫరూక్, సీడ్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి లోలోపల ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్‌ తమదంటే తమదేనని అనుచరులకు చెప్పుకుంటూ వర్గ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి ప్రజల నుంచి మద్దతు లేక విలవిలలాడుతుంటే నాయకుల వర్గపోరు టీడీపీ అధినాయకత్వానికి తలనొప్పి తెప్పిస్తోంది.

సోమవారం పట్టణంలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ లాడ్జ్‌లో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి క్లస్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఎన్‌ఎండీ ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుల్లయ్య, కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాయకులు హాజరయ్యారు.

చదవండి: ('ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదు.. కాసింత బువ్వ పెట్టండ్రా')

ఈ సమావేశంలో పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఎన్‌ఎండీ ఫరూక్‌ తనయుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ మాట్లాడుతూ.. ‘క్లస్టర్‌ సమావేశానికి తనను ఏ కారణం చేత పిలువలేదో అర్థం కావడం లేదు. జిల్లా ప్రధాన కార్యదర్శినే పిలువక పోతే ఎలా? మన మధ్య ఐక్యత లేకుంటే రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది’ అని  వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ సమావేశానికి తాను ఎవరినీ పిలువలేదని, టీడీపీ కార్యాలయం నుంచే ఫోన్లు చేశారని, ఒకరిని దూరంగా ఉంచాల్సిన అవసరం తనకు లేదన్నారు. అయితే సమావేశానికి ఫరూక్, ఆయన తనయుడు ఫిరోజ్‌ హాజరైనా వారి అనుచరులను మాత్రం సమావేశానికి దూరంగా ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సందర్భంగా సమావేశంలోనే ఫిరోజ్‌ తన అసమ్మతిని బహిరంగంగా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  

ఏవీ జాడ ఏదీ..   
క్లస్టర్‌ సమావేశానికి సీడ్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి గైర్హాజరై, తన వర్గాన్ని కూడా దూరంగా ఉంచడంతో చర్చనీయాంశంగా మారింది. అంతర్గత విభేదాలే కారణమని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ఆశీస్సులు తనకే ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి, ఫరూక్‌కు టికెట్‌ వచ్చే పరిస్థితి లేదని, గతంలో వారికి అవకాశం ఇచ్చారని, ఈ సారి కొత్త నాయకుల వైపు అధిష్టానం చూస్తుందని, వచ్చే ఎన్నికల్లో తనకే నంద్యాల అసెంబ్లీ టికెట్‌ వస్తుందని అనుచరులతో చెబుతున్నట్లు సమాచారం. 

ముఖ్యనాయకులు దూరం 
నంద్యాల క్లస్టర్‌ సమావేశానికి తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు డుమ్మా కొట్టారు. టీడీపీ ముస్లిం, మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాక్‌ మౌలానా, మాజీ రాష్ట్ర ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఇంతియాజ్‌ అహమ్మద్, మాజీ కౌన్సిలర్‌ మిద్దె హుసేనితో పాటు ప్రముఖ టీడీపీ నాయకులు సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. నాయకుల మధ్య విభేదాలు ఉండటం, ఒకరినొకరు విమర్శించుకోవడం, పార్టీ పదవుల్లో కష్టపడిన వారికి కాకుండా నాయకుల అనుచరులకే పదవులు దక్కడంతో అసంతృప్తికి లోనైన పలువురు నేతలు సమావేశానికి గైర్హాజరయ్యారని తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు