కారు పార్టీలో చిచ్చు.. రచ్చకెక్కిన విభేదాలు

17 Feb, 2021 13:55 IST|Sakshi

జెడ్పీ చైర్మన్‌ విఠల్‌రావు వర్సెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

పలు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి

సాక్షి, నిజామాబాద్ ‌: అధికార పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు బట్టబయలవుతోంది. సోమవారం నందిపేట్‌ మండలం లక్కంపల్లి సెజ్‌లో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఓ ప్రైవేట్‌ బయో ప్లాస్టిక్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ విఠల్‌రావు, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదంతో ఆధిపత్య పోరు తెరపైకి వచ్చింది. కార్యక్రమానికి రాకుండా తనను పోలీసులతో అడ్డగించారని ఎమ్మెల్యేపై విఠల్‌రావు మండిపడ్డారు. దీంతో మంత్రి ప్రశాంత్‌రెడ్డి కలగజేసుకుని ఇరువురిని సముదాయించాల్సి వచ్చింది. ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్సీ కవిత, జిల్లా ముఖ్యనేతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ఆర్మూర్‌ నియోజకవర్గంలో ఈ ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుతోంది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, పల్లె ప్రగతి కార్యక్రమాల నిర్వహణలో ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. గతంలోనూ మాక్లూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఈ పంచాయితీ సీఎం కేసీఆర్‌ దృష్టికి కూడా వెళ్లినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా సోమవారం జరిగిన ఘటన పార్టీలో అంతర్గత పోరును బయట పెట్టింది.

  • నిజామాబాద్‌ అర్బన్‌ నియోజక వర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. టీఆర్‌ఎస్‌ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, సీనియర్‌ నాయకుడు ఏఎస్‌ పోశెట్టి గత ఎన్నికల వేళ ఏకంగా ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తాపై విమర్శనాస్త్రాలు సంధించారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు గుప్పించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.  
  • 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మధ్య ఉప్పు.. నిప్పు.. అన్న చందంగా పోరు నడిచిన సంగతి తెలిసిందే. భూపతిరెడ్డి టీఆర్‌ఎస్‌ను వీడటంతో ఇక్కడ ఆధిపత్య పోరుకు తెరపడినట్లయింది.  
  • మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న బాల్కొండలో అంతర్గత పోరు ఇప్పటి వరకు బట్టబయలు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఇక్కడ ఇద్దరు అగ్రనేతల మధ్య కొంత ఆధిపత్య పోరు తలెత్తే అవకాశాలున్నట్లు అప్పట్లో ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ ఇప్పటి వరకు అలాంటి ఘటనలేవీ బయటకు రాలేదు.  

మిగతా నియోజకవర్గాల్లోనూ..
అధికార పార్టీలో అంతర్గత పోరు ఒక్క ఆర్మూర్‌ నియోజకవర్గానికే పరిమితం కాలేదు. ఇతర నియోజకవర్గాల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. బోధన్‌లోనూ స్థానిక ఎమ్మెల్యే షకీల్‌ అమేర్, స్థానిక మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ భర్త శరత్‌రెడ్డి మధ్య కూడా ఆధిపత్య పోరు నడుస్తోంది. వీరి మధ్య విభేదాలు ఇప్పటి వరకు ఇలా బహిర్గతం కాకపోయినప్పటికీ, బోధన్‌ మున్సిపాలిటీ వ్యవహారాల్లో ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల జోక్యంపై శరత్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు