జనసేనలో విభేదాలు.. పార్టీ నేత నాదెండ్ల ఎదుటే రచ్చ రచ్చ

30 Nov, 2021 13:15 IST|Sakshi
రచ్చ చేస్తున్న ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు

ఇరు వర్గాల మధ్య రచ్చ

పార్టీ నేత నాదెండ్ల ఎదుటే అరుపులు, కేకలు  

సాక్షి, అమలాపురం టౌన్‌: నియోజకవర్గ జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. సాక్షాత్తూ ఆ పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్న సమావేశంలోనే ఈ విభేదాలు బయట పడటం గమనార్హం. ఇందుపల్లి ఎ కన్వెన్షన్‌ హాలులో సోమవారం ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి శెట్టిబత్తుల రాజబాబు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో నాదెండ్ల పాల్గొన్నారు. సమావేశం ముగిశాక ఆయన వెళుతున్న సమయంలో హాలు బయట ఒక్కసారిగా రెండు వర్గాల మధ్య విభేదాలు బయట పడ్డాయి. సమావేశం జరుగుతున్న సమయంలో సమనస, ఈదరపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇది తీవ్రమై, సమావేశం ముగిసిన అనంతరం ఇరువర్గాలు బాహాబాహీకి దిగే స్థాయికి చేరింది.

చదవండి: (తక్షణ వరద సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వండి: విజయసాయిరెడ్డి)

కేకలు, అరుపులతో ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు రచ్చరచ్చ చేశారు. రాజబాబుకు, నియోజకవర్గంలోని కొంత మంది మధ్య ఇటీవల దూరం పెరిగింది. పార్టీ రెండు వర్గాలుగా మారింది. మాజీ మున్సిపల్‌ చైర్మన్, టీడీపీ నాయకుడు యాళ్ల నాగ సతీష్‌ ఆ పార్టీకి రాజీనామా చేసి, జనసేనలో చేరేందుకు కొన్ని నెలల కిందటే రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన చేరికను రాజబాబు అడ్డుకుంటున్నారని సతీష్‌తో పాటు పార్టీలోని కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాదెండ్ల అమలాపురం రావడంతో పార్టీ ఇన్‌చార్జి రాజబాబు ప్రమేయం లేకుండానే మరో వర్గంగా ఉంటున్న పార్టీ నాయకులతో కలిసి సతీష్‌ జనసేనలో చేరే ఏర్పాట్లు చేసుకున్నారు. ఇలా అప్పటికే నియోజకవర్గ పార్టీలో నాయకులు రెండుగా చీలిపోవడంతో ఇన్నాళ్లూ చాప కింద నీరులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమనడం చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు