టీడీపీలో అంతర్గత పోరు.. మహానాడు సాక్షిగా బీసీ నేతకు అవమానం 

28 May, 2022 20:02 IST|Sakshi
శుక్రవారం రాత్రి జనం లేక వెలవెలబోతున్న టీడీపీ జిల్లా కార్యాలయం

టీడీపీలో అంతర్గత పోరు తారస్థాయికి చేరుకుంది. ఆ పార్టీ మహానాడు సాక్షిగా ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి. నిన్నటి వరకూ ఫ్లెక్సీల వివాదం నడిస్తే.. నేడు నగరంలోని పార్టీ కార్యాలయాల అంశంలోనూ వర్గ విభేదాలు వెలుగు చూస్తున్నాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన జిల్లా అధ్యక్షుడి కార్యాలయాన్ని మహానాడుకు వచ్చిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు కన్నెత్తి చూడకపోవడంతో వెలవెలబోతోంది. గుంటూరు రోడ్డులోని దామచర్ల కార్యాలయం మాత్రం ఎప్పుడూ నాయకులు, ముఖ్య నేతలతో కళకళలాడుతోంది. ఇదేమి సామాజిక న్యాయం అంటూ సొంత పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీకి మహానాడు అనేది ఒక పండుగలాంటిది. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తొలిసారిగా ఇక్కడ జరుగుతోంది. దాదాపు రెండు వారాలుగా పార్టీ ముఖ్య నాయకుల హడావిడి ఎక్కువగా ఉంది. అయితే ప్రకాశం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఈ హడావిడి ఇసుమంతైనా కనపడలేదు. దీంతో భాగ్యనగర్‌లోని ఆ కార్యాలయం వెలవెలబోతోంది. ఈ వైపు టీడీపీకి చెందిన ముఖ్య నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా కన్నెత్తి చూడలేదు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటమే టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం వెలవెలబోవటానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పాత గుంటూరు రోడ్డులోని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ కార్యాలయం మాత్రం కళకళలాడుతోంది.
చదవండి: చంద్రబాబు, బాలకృష్ణకు విజయసాయిరెడ్డి సవాల్‌

బీసీలకు టీడీపీ గుండెకాయ వంటిది అని చంద్రబాబు నిత్యం చెబుతుంటారు. టీడీపీకి బీసీలు వెన్నుపూసలాంటి వారు అని కూడా ఆయనే వల్లెవేస్తుంటారు. కానీ బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకే పదవులు ఎరవేయడం, ఆ తర్వాత వారిని అవమానించడం టీడీపీలో కొత్తేమీ కాదు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నూకసాని బాలాజీకి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టారు. అయితే పార్టీ అధిష్టానం జిల్లా పార్టీ కార్యాలయానికి, జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఇవ్వాల్సిన గౌరవ, మర్యాదలు మాత్రం నేతి బీరకాయలో నేతి చందంగా తయారయ్యాయి. ఆ పార్టీ పండుగలా మహానాడును నిర్వహిస్తున్న సమయంలోనూ భాగ్యనగర్‌ మూడోలైన్‌లో జిల్లా పార్టీ కార్యాలయం ఓ అనాథలా వెలవెలబోవడం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. పది, పదిహేను రోజుల నుంచి రాష్ట్ర పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు అందరూ నగరానికి వచ్చి వెళ్తున్నారు. బాలాజీ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఒక్కసారి వచ్చి వెళ్లారు.

జనార్దన్‌ ఆఫీసు కళకళ:  
ఒంగోల మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు చెందిన పాత గుంటూరు రోడ్డులోని కార్యాలయం మాత్రం ఎప్పుడూ నాయకులతో, ముఖ్య నేతలతో కళకళలాడుతోంది. మహానాడుకు వచ్చిన ముఖ్య నేతలు కూడా అక్కడికే వచ్చి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు సామాజికవర్గానికి చెందిన నేత దామచర్ల జనార్దన్‌ కావటమే ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. మరి జిల్లా పార్టీ కార్యాలయం ఎందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారంటూ ఆ పార్టీలోని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. జనార్దన్‌ అసలు జిల్లా పార్టీ కార్యాలయంలో అడుగు కూడా పెట్టలేదు.

జనార్దన్‌ ఆయన పార్టీ కార్యాలయం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకుంటూ వెళ్తున్నారు. టీడీపీలో బీసీలకు పేరుకే పదవులు..అధికారం మాత్రం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారిదేనన్న వాదనలు అటు ప్రజల్లోనూ, ఇటు పార్టీ కేడర్‌లోనూ బలంగా వినిపిస్తోంది. మరి జిల్లా అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వటం ఎందుకు, నూకసాని బాలాజీని ఈ విధంగా అగౌరవ పరచటం ఎందుకని బీసీలకు చెందిన కొందరు నేతలు నేరుగానే ప్రశి్నస్తున్నారు. ఏదిఏమైనా మహానాడు వేదికగా బీసీ నేతకు తీవ్ర అవమానం జరిగిందనే చెప్పాలి.

ఫ్లెక్సీల్లో కూడా..  
మహానాడు సందర్భంగా ఒంగోలు నగరం మొత్తం టీడీపీ ముఖ్య నేతలతోపాటు ఇతర నాయకుల ఫొటోలతో ఇబ్బడిముబ్బడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీల ఏర్పాటులో కూడా బీసీ నేత, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీకి తీవ్ర అవమానం జరిగింది. ఏ పదవులు లేని వారి ఫొటోలను సైతం తాటికాయంతా సైజుల్లో వేసుకున్న ఫ్లెక్సీలో ఏ ఒక్కచోట కూడా బాలాజీ ఫొటోలు ఆ సైజులో లేకపోవడం గమనార్హం. కొన్నింటిలో అయితే బాలాజీ ఫొటోలే లేవు.  

మరిన్ని వార్తలు