టీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న వర్గపోరు.. కన్నీటి పర్యంతమైన కార్పొరేటర్‌

29 Nov, 2022 09:17 IST|Sakshi
మాట్లాడుతున్న కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: కుషాయిగూడ ధోబీఘాట్‌ వేదికగా టీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. ప్రొటోకాల్‌ అంశంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మాజీ మేయర్‌ బొంతు రాంమోహన్‌ వర్గాల నడుమ ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నియోజకవర్గంలో రెండు వర్గాలు విడిపోయి తమ కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నాయి.

సమయం వచ్చినప్పుడల్లా బలాలను ప్రదర్శించుకుంటూ ఎవరి ఆధిపత్యాన్ని వారు చాటుతున్నారు. ఈ క్రమంలో ఎవరితో ఉండాలో తేల్చుకోలేక నాయకులు, కార్యకర్తలు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. సోమవారం కుషాయిగూడలో ఆధునిక యాంత్రిక ధోబీఘాట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా తనకు అవమానం జరిగిందని స్థానిక కార్పొరేటర్‌ మీడియా ముందుకు వచ్చి గోడు వెళ్లబోసుకోగా.. ప్రొటోకాల్‌ తనకు  సంబంధించిన అంశం కాదని అది అధికారుల చూసుకుంటారంటూ ఎమ్మెల్యే చెప్పారు. 


ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి

కన్నీటి పర్యంతమైన కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి 
మహిళా కార్పొరేటర్‌నైన తనను ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అడుగడుగునా అవమానపరుస్తున్నారని చర్లపల్లి కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి ఆరోపించారు. ఒక మహిళనని చూడకుండా గడిచిన మూడేళ్లుగా అనేక అవమానాలకు గురిచేస్తూ వస్తున్నారని ఆవేదన చెందుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఉప్పల్‌ నియోజకవర్గంలో ఏ డివిజన్‌లో లేని విధంగా ఎమ్మెల్యే  చర్లపల్లి డివిజన్‌లో కార్పొరేటర్‌ ప్రమేయం లేకుండానే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 
చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు: ‘బండి సంజయ్‌ పేరు చెప్పాలని వేధిస్తున్నారు ’

ఈ క్రమంలో అధికారులపై ఒత్తిడి చేస్తూ ప్రొటోకాల్‌ సమస్యకు తెరలేపుతూ తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అంతటితో ఆగకుండా తనను కులం పేరుతో దూషిస్తూ అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  బీసీ మహిళనైన తనను అంతటా అవమానపరుస్తూనే ఉన్నారని ఆవేదన చెందారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలను అధిష్టానానికి అందజేస్తానన్నారు. 

తాజాగా కుషాయిగూడ ధోబీఘాట్‌ ప్రారంభోత్సవం సందర్భంగానూ తనను అగౌరవపరిచినట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి 10:30 గంటల వరకు ధోబీఘాట్‌ వద్దే తాను ఉన్నానని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి రావడం మరో అరగంట సమయం ఉందని నిర్వాహకులు చెప్పడంతో పూలే వర్ధంతి సభలో పాల్గొనేందుకు వెళ్లి వచ్చేలోపు మంత్రి, ఎమ్మెల్యే ధోబీఘాట్‌ యంత్రాన్ని ప్రారంభించి వెళ్లిపోయారని ఆమె చెప్పారు. స్థానిక కార్పొరేటర్‌ ప్రస్తావన లేకుండా నిమిషాల వ్యవధిలో ప్రారంభించి వెళ్లి తనను అవమానపరిచారని ఆవేదన చెందారు. ఈ విషయంపై ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని వివరణ కోరగా.. కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి  తనపై చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. అవి పూర్తి అసత్యాలని కొట్టి పడేశారు. 

మరిన్ని వార్తలు