వైఎస్సార్‌సీపీలో ఫుల్‌ జోష్‌

23 Jan, 2024 06:06 IST|Sakshi
ఏలూరులో జరిగిన సమావేశంలో సునీల్‌కుమార్‌ను నేతలు, కార్యకర్తలకు పరిచయం చేస్తున్న ఆళ్ల నాని (ఫైల్‌)

ఎన్నికల సమరానికి రెడీ

ఏలూరులో కొత్త అభ్యర్థుల పరిచయ సభ గ్రాండ్‌ సక్సెస్‌

టీడీపీలో ఇంకా కొనసాగుతున్న సీట్ల గందరగోళం

పొత్తులపై అయోమయం, అభ్యర్థుల అన్వేషణలో జాప్యం

ప్రజాక్షేత్రంలో కలియదిరుగుతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు

నియోజకవర్గాలవారీగా పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: అధికార వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లాలో ఫుల్‌జోష్‌తో కనిపిస్తోంది. ఎన్ని­కల నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా స్థానిక పరిస్థితులు, సమీకరణలకు అనుగుణంగా జిల్లాలో అభ్యర్థుల మార్పులు, చేర్పుల ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో ఆదివారం జరిగిన పార్టీ ఏలూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశం, నూతన అభ్యర్థుల పరిచయ సభ గ్రాండ్‌ సక్సెస్‌ కావడం పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నింపింది. ఏలూరు పార్లమెంట్‌ అభ్యర్థి కారుమూరి సునీల్‌ కుమార్‌­యాదవ్, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి కంభం విజయరాజు, పోలవరం అసెంబ్లీ అభ్యర్థిగా తెల్లం రాజ్యలక్ష్మిలను జిల్లా నాయకులు కార్యకర్తలకు పరిచయం చేశారు. ఎన్నికల శంఖారావం పూరించారు. దీంతో పార్టీ శ్రేణుల్లో నవోత్సాహం కదంతొక్కుతోంది.

ఇప్పటికే ప్రజల్లోకి.. 
ఏలూరు పార్లమెంట్‌ పరిధిలో రెండు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానంలో వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జులను మార్చింది. మిగిలిన చోట్ల ఇప్పటికే ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తున్నారు. పాదయాత్రలు చేస్తూ.. క్షేత్ర­స్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరి­స్తున్నారు. ఐదేళ్లలో తాము చేసిన పనులను వివరి­స్తు­న్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా గడప­గడపకూ చేకూరిన లబ్ధిని చెబుతున్నారు.

ఏలూరు పార్లమెంట్‌ పరిధిలో ఈనెల 30వ తేదీకల్లా నియోజకవర్గ స్థాయి సమావేశాలు ముగిసేలా షెడ్యూల్‌ ఖరారు చేసుకున్నారు. బాధ్యతలు తీసు­కున్న చింతలపూడి ఇన్‌చార్జి కంభం విజయరాజు, పోలవరం ఇన్‌చార్జి తెల్లం రాజ్యలక్ష్మి ఇప్పటికే వారం రోజులుగా నియోజకవర్గంలో విస్తతంగా పర్యటిస్తున్నారు. ఇక ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌ ఆదివారం నుంచి పార్లమెంట్‌ పరిధిలో పర్యటనకు శ్రీకారం చుట్టారు.

టీడీపీలో అనిశ్చితి
ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో రాజకీయ అని­శ్చితి తారాస్థాయికి చేరింది. పొత్తుల గందరగోళం ఒక వైపు, టీడీపీ, జనసేన నేతల మధ్య సమన్వయ లోపం మరోవైపు ఆ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏలూరు ఎంపీ టికెట్‌ను ముగ్గురు, నలుగురు అభ్యర్థులు ఆశిస్తున్నా స్పష్టత లేకపోవడం పొత్తుల్లో జనసేనకు ఇచ్చే స్థానాలు తేల్చకపోవడంతో రెండు పార్టీల నేతల్లో రాజకీయ నైరాశ్యం నెలకొంది. ఇక దెందులూరు నియోజకవ­ర్గంలో టీడీపీ సమ­న్వయకర్త చింతమనేని ప్రభాకర్‌ యథావిధిగా హల్‌చల్‌ చేస్తున్నారు.

టీడీపీ, జనసేన నేతలు చింతమనేని వద్దు–ఎవరైనా ముద్దు అనే పేరుతో నిరసన సమావేశం నిర్వహించినప్పటి నుంచి ఆయన తీవ్ర ఆందోళనకు గురై టికెట్‌ ఆశిస్తున్న ఇతర నేతలపై నోరుపారేసుకుంటున్నట్లు సమాచా­రం. కైకలూరు, నూజివీడు, పోలవరంలలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్లమెంట్‌ స్థానానికో సభ నిర్వహిస్తున్నా అభ్యర్థిత్వాలపై స్పష్టత ఇవ్వడం లేదు.  ఫలితంగా ముఖ్య­నేతలు ఖర్చుకు ముందు­కు­రాని పరిస్థితి. అయితే జనసేన, టీడీపీ శ్రేణులు మాత్రం సోషల్‌ మీడియా వార్‌ కొనసాగిస్తున్నాయి. ఏ పార్టీ ఏ స్థానాల్లో పోటీ చేస్తాయో పోస్టులు షేర్‌ చేస్తూ గందరగోళాన్ని మరింత పెంచుతున్నాయి.

whatsapp channel

మరిన్ని వార్తలు