Huzurabad Bypoll: ఉప ఎన్నిక బరిలో ప్రవీణ్‌కుమార్‌?!

20 Jul, 2021 10:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎస్‌ పదవికి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ తరఫున ఆయన బరిలో దిగుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు కంచుకోటగా ఉన్న హుజురాబాద్‌లో గెలుపునకై టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ముద్దసాని పురుషోత్తంరెడ్డి, కడియం శ్రీహరి తదితర పేర్లు తెరమీదకు వచ్చినా ఎటువంటి ముందడుగు పడలేదు. మరోవైపు.. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరతారన్న వార్తలు వినిపిస్తున్నా.. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.

ఈ నేపథ్యంలో వాలంటరీ రిటైర్మెంట్‌ కోరుతూ ప్రవీణ్‌కుమార్‌ ప్రభుత్వానికి సోమవారం లేఖ రాయడం, ఉప ఎన్నిక బాధ్యతలు భుజాన వేసుకున్న మంత్రి గంగుల కమలాకర్‌ నేడు మాట్లాడుతూ.. ఉప ఎన్నిక అభ్యర్థి అంశం ఖరారైందన్నట్లు సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. కాగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌కు చెందిన ప్రవీణ్​కుమార్..  అడిషనల్‌ డీజీపీ హోదాలో సోషల్‌ వెల్ఫేర్‌ సెక్రటరీగా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కరీంనగర్‌లో ఎస్పీగా పనిచేసిన ఆయనకు జిల్లాతో మంచి అనుబంధం ఉంది. ఇందుకుతోడు ప్రవీణ్‌కుమార్‌కు రాజకీయాలు అంటే ఆసక్తి అనే ప్రచారం కూడా సాగుతోంది.

ఇక నేడు రాజీనామా సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘కుట్రపూరితంగా నన్ను ఒక వర్గానికి పరిమితం చేసే ప్రయత్నం జరిగింది. వ్యక్తిగత కారణాల వల్ల ఆరేళ్లకు ముందే తప్పుకుంటున్నా. ఎక్కువ మందికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేశా. హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో పోటీ చేస్తానో? లేదో? ఇప్పుడే చెప్పలేను’’ అని వ్యాఖ్యానించడం ఈ ఊహాగానాలకు మరింత ఊతం ఇస్తోంది.

మరోవైపు.. ఇప్పటికే హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో.. ఇప్పటికే ఉద్యోగాల భర్తీ, దళిత బంధు పథకం(హుజురాబాద్‌ పైలట్‌ ప్రాజెక్టు) ప్రకటన వంటి అంశాలతో అధికార పార్టీ ఓటర్లకు గాలం వేస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోటీలో దింపేందుకే ప్రవీణ్‌కుమార్‌తో రాజీనామా చేయించారనే ప్రచారం సాగుతోంది. ఏదేమైనా సోమవారం నాటి పరిణామాలు హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో హాట్‌టాపిక్‌గా మారాయి.

మరిన్ని వార్తలు