చంద్రబాబు చేసింది కీడా? మేలా?.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!

9 Mar, 2023 18:52 IST|Sakshi

తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గం అది. అభ్యర్ధి ఎవరైనా సరే క్యాడర్ అంతా కలిసి గెలిపించుకునేవారు. కాని గత ఎన్నికల్లో పరిస్థితి తిరగబడింది. సైకిల్‌ను ముక్కలు చేసి మూలకు విసిరేశారు అక్కడి ప్రజలు. ఇప్పుడు ఆ ముక్కల్ని అతికించుకోవడానికి సైకిల్‌ పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. అధినేత అభ్యర్థిని ప్రకటించినా.. ఓ కమ్మ నేత టిక్కెట్‌ మాకే ఇవ్వాలంటూ పార్టీకి అల్టిమేటమ్ ఇచ్చారట. జగ్గయ్యపేట తమ్ముళ్ల క్యాస్ట్‌ పాలిటిక్స్‌ మీరే చదవండి.

కులం చుట్టూ రాజకీయం
ఎన్‌టీఆర్ జిల్లా జగయ్యపేట నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పెట్టనికోటలా ఉండేది. టీడీపీ కేడర్‌ గతంలో కులం చూడకుండా అభ్యర్థి ఎవరైనా కలిసికట్టుగా పనిచేసేవారు. కాని నాలుగేళ్ళుగా అక్కడ క్యాస్ట్‌ పాలిటిక్స్‌ పీక్స్‌కు చేరాయంటున్నారు. ప్రస్తుతం జగ్గయ్యపేటకు మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ టీడీపీ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. నాలుగేళ్లుగా పార్టీ కార్యక్రమాలన్నింటినీ తన భుజాన వేసుకుని నిర్వహిస్తున్నారు.

అయితే ఏడాది క్రితం చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన బొల్లా రామకృష్ణ జగ్గయ్యపేట పాలిటిక్స్‌లోకి ఎంటరయ్యారట. అప్పట్నుంచి అక్కడి టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయిందట. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు కీలకం కాబట్టి టిక్కెట్ తనకే వస్తుందని బొల్లా రామకృష్ణ ప్రచారం చేసుకుంటున్నారు. ఈయన లోకేష్‌కు సన్నిహితుడు కావడం, ఆర్ధికంగా బలమైన వ్యక్తి కావడంతో బొల్లా ఏడాది నుంచి సెపరేటుగా కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. ఆ మధ్య చంద్రబాబు జగ్గయ్యపేట వచ్చినపుడు బొల్లా, శ్రీరాం రాజగోపాల్ వేరువేరుగా ఏర్పాటు చేసుకున్న బ్యానర్లు పార్టీలో పెద్ద రచ్చ రాజేశాయట.

జగ్గయ్యపేట సీటు తనదంటే తనదని ఇద్దరూ కొట్టుకుంటున్న సమయంలో.. శ్రీరాం రాజగోపాల్‌ను ఆశీర్వదించాలంటూ తన పర్యటనలో చంద్రబాబు బహిరంగంగానే ప్రకటించేశారు. చంద్రబాబు ప్రకటనతో తన లైన్ క్లియర్ అయ్యిందని శ్రీరాం రాజగోపాల్ సంతోష పడుతున్నప్పటికీ అసలు ముసలం ఇక్కడ్నుంచే మొదలైందట. జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన నెట్టెం రఘురామ్ ప్రస్తుతం టీడీపీ విజయవాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

నను చంద్రబాబు ఒక్క మాటైనా అడగకుండానే శ్రీరాం రాజగోపాల్ ను జగ్గయ్యపేట అభ్యర్ధిగా ప్రకటించడంపై మూడు నెలలుగా నెట్టెం రగిలిపోతున్నాడట. మొన్నటి వరకూ శ్రీరాం రాజగోపాల్‌కు అండగా ఉన్న నెట్టెం ఇప్పుడు తన సామాజికవర్గానికి చెందిన బొల్లాకు మద్దతుగా నిలుస్తున్నారట. ఈసారి కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతకు టిక్కెట్టు ఇప్పించాలనుకుంటున్న తరుణంలో చంద్రబాబు తమ ఆశల పై నీళ్లు చల్లడాన్ని తట్టుకోలేకపోతున్నారట . అధిష్టానం నిర్ణయం మార్చుకుంటే సరేసరి లేకపోతే యుద్ధమే అంటున్నారట. మరోవైపు శ్రీరాం రాజగోపాల్ ను ఒంటిరిని చేసి... బొల్లా రామకృష్ణతో నెట్టెం చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారట. 

పాతాళానికి ప్రతిష్ట
కమ్మ సామాజికవర్గ నేతకు కాకుండా శ్రీరాం రాజగోపాల్ కు సీటు ఇస్తే ఒప్పుకునేదే లేదని..అతనికి సహకరించేదే లేదని నెట్టెం  రఘురాం తేల్చేశారట. ఇదే సమయంలో బొల్లా రామకృష్ణ పార్టీలో ఉన్న ముఖ్యనేతలను, క్యాడర్ ను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారట.

కుల బలంతో పాటు క్యాడర్ అండ కూడా ఉందని అధిష్టానం ముందు బలప్రదర్శన చేయాలనే ఆలోచనలో ఉన్నారట బొల్లా. ఐతే టీడీపీ పెట్టిన నాటి నుంచి నియోజకవర్గంలో లేని క్యాస్ట్ పాలిట్రిక్స్ ను ఇప్పుడు చూసి జగ్గయ్యపేట తమ్ముళ్లు తల బాదుకుంటున్నారట. ఓవైపు చంద్రబాబేమో గెలిచేది మనమే ... వచ్చేది మనమే అని డబ్బా కొడుతుంటే ... జగ్గయ్యపేట నేతలేమో ఇలా కులం పేరుతో కొట్టుకోవడం పట్ల పార్టీలోనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.
-పొలిటికల్‌ ఎడిటర్‌, సాక్షి డిజిటల్‌

మరిన్ని వార్తలు