ముసుగు తీసిన చంద్రసేనాని 

15 Sep, 2023 04:40 IST|Sakshi

ఇన్నేళ్లూ చంద్రబాబు చాటున ఒదిగిన పవన్‌ కళ్యాణ్‌ 

బాబు అరెస్టుతో పాత బంధానికి కొత్త రంగు  

2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తంటూ కొత్తపాట 

2014 నుంచి గెస్ట్‌ రాజకీయ నేతగా బాబు చెంతనే.. 

ఏనాడూ చంద్రబాబు తప్పులను ప్రశ్నించని పవన్‌ 

2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు బయటకొచ్చి నాటకం.. వైఎస్సార్‌సీపీ చేతిలో చావుదెబ్బ తినడంతో మళ్లీ లోపాయికారి బంధం 

ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తే వైఎస్సార్‌సీపీని ఆపలేమని బెంబేలు.. బీజేపీ కూడా తమ వెంట వస్తుందని ఆశిస్తున్నామంటూ సన్నాయి నొక్కులు   

తాము అధికారంలోకి వస్తే ఎవ్వరినీ వదలమని హెచ్చరిక  

రాజమండ్రి జైల్లో బాబుతో 40 నిమిషాలపాటు ములాఖత్‌  

సాక్షి, రాజమహేంద్రవరం : తెలుగుదేశం–జనసేన మధ్య బంధానికి ఉన్న ముసుగు తొలగిపోయింది. కొత్తగా పొత్తు పొడుస్తున్నట్లు పవన్‌కళ్యాణ్‌ పాతపాటనే కొత్తగా పాడారు. చంద్రబాబు చాటుగా ఇన్నేళ్లు ఒదిగి ఉన్న  జనసేన అధ్యక్షుడు తాజాగా పొత్తు ప్రకటనతో పాత పాటకు కొత్త పల్లవి అందుకున్నారు. పాత బంధాన్నే కొత్త పొత్తుల రాగంగా ఆలపించేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పొత్తుల ప్రకటన వరకు చంద్రబాబు చెంతనే పవన్‌ అతిథి రాజకీయ నాయకుడి పాత్ర పోషించారన్నది జగమెరిగిన సత్యం.

2014 ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చి.. చంద్రబాబు రాసిన స్క్రీన్‌ ప్లేను పక్కాగా రక్తి కట్టించారు. ప్రశ్నించేందుకే జనసేన అంటూ డబ్బాలు కొట్టుకుని.. చంద్రబాబు ప్రభుత్వంలో మహిళా అధికారులపై దాడులు, ప్రకృతి వనరుల దోపిడీ, ఇచ్చిన వందల హామీలను నెరవేర్చకపోయినా ఎన్నడూ ప్రశ్నించిన పాపాన పోలేదు. పైగా నాలుగేళ్లు పత్తా లేకుండా.. 2019 ఎన్నికలు సమీపిస్తుండగా చంద్రబాబుకు మేలు చేసేందుకు మళ్లీ తెరపైకి వచ్చారు.

అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే కుయుక్తిలో భాగంగానే కూటమి నుంచి బయటకు వచ్చినట్టు నాటకమాడారు. చివరికి ప్రజా క్షేత్రంలో చావు దెబ్బ తినడంతో మళ్లీ టీడీపీతో అంటకాగుతున్న విషయం తెలిసిందే. తెలుగుదేశంతో బంధాన్ని కొనసాగిస్తూనే తన పార్టీ కార్యకర్తలను, ప్రజలను మోసగించారు. గతంలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ భారీ అవినీతికి పాల్పడ్డారని విమర్శించిన నోటితోనే ఇప్పుడు వారితోనే కలిసి రాజకీయ పయనం చేస్తానంటూ ప్రకటించడం పవన్‌ రాజకీయ వ్యక్తిత్వాన్ని చాటి చెబుతోంది.  

సమష్టిపోరు అవసరమట! 
స్కిల్‌ స్కామ్‌లో అరెస్టై, జైలు జీవితం గడుపుతున్న చంద్రబాబును పరామర్శించిన కొద్ది క్షణాల్లోనే టీడీపీ, జనసేన పొత్తు ఉందంటూ పవన్‌ చెప్పడం చూస్తుంటే.. జైలు నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు అవగతమవుతోంది. ఈ క్రమంలోనే రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు వద్ద పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పని చేస్తాయని.. బీజేపీ కూడా మా వెంట వస్తుందని ఆశిస్తున్నామన్నారు. తమ కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసమంటూ కలరింగ్‌ ఇచ్చారు.

చంద్రబాబుతో విభేదించి గతంలో ప్రత్యేకంగా పోటీ చేశానని, వైఎస్సార్‌సీపీని ఎదుర్కోవాలంటే సమష్టిపోరు అవసరం అంటూ తమ బంధాన్ని బయటపెట్టారు. చంద్రబాబుతో పవన్, లోకేశ్, సినీ నటుడు బాలకృష్ణ గురువారం ఉదయం ములాఖత్‌ అయ్యారు. ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న పవన్‌ అక్కడి నుంచి నేరుగా సెంట్రల్‌ జైల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పవన్, లోకేశ్, బాలకృష్ణ 40 నిమిషాలపాటు బాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన సాగుతోందని, అందులో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు పంపారని విమర్శించారు.  

మోదీ పిలిస్తేనే వెళ్లాను.. 
‘జనసేన ఆవిర్భావ సభలో సగటు మనిషి ఆవేదన గురించి మాట్లాడాను. మా నాన్న ఆస్థికలు కాశీలో కలిపేందుకు వెళ్లిన సమయంలో ముంబయిలో తాజ్‌ హోటల్‌పై ఉగ్రవాదుల దాడి జరిగింది. అంతకు ముందు పార్లమెంట్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలను చూసి దేశానికి సమర్థుడైన నాయకుడు కావాలని మోదీకి మద్దతు తెలిపిన విషయంలో నన్ను అందరూ తిట్టారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కు తగ్గనని వెల్లడించా. ఏ రోజైనా నరేంద్ర మోదీ నన్ను పిలిస్తే వెళ్లానే తప్ప.. నేనంతకు నేనే ఎప్పుడూ వెళ్లలేదు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు అనుభవం ఉన్న నాయకుడు కావాలని 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. బాబుకు నాకు మధ్య పాలన, విధానపరమైన అభిప్రాయ బేధాలు ఉన్నాయి. కానీ, ఆయన అనుభవం, సమర్థతపై పూర్తి విశ్వాసం ఉంది’ అని పవన్‌ స్పష్టం చేశారు. సైబరా­బాద్‌ నిర్మిచిన వ్యక్తికి రూ.300 కోట్ల స్కామ్‌ను అంటగడతారా? అని ప్రశ్నించారు.

‘బాబును ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) విచారించాల్సింది.. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విచారిస్తోంది? అభియోగాలు అంటగట్టిన వ్యక్తి ఏమైనా­మహానుభావుడా? వాజ్‌పేయా? లాల్‌ బహదూర్‌శాస్త్రినా? కేసులు, రాజ్యాంగ ఉల్లంఘన, విదేశా­ల­కు వెళ్లా­లంటే కోర్టు పర్మిషన్‌ తీసుకునే వ్యక్తి మద్య­పాన నిషేధం చేస్తాడా?’ అని దుయ్యబట్టారు.
 
అడ్డగోలు హామీలిచ్చి నేటికీ అమలు చేయలేదు 
రాష్ట్రంలో అడ్డగోలు హామీలిచ్చి నేటికీ అమలు చేయలేదని పవన్‌ మండిపడ్డారు. గుజరాత్‌లోని ముంద్రా పోర్టు వద్ద మూడు వేల కిలోల హెరాయిన్‌ దొరికితే దాని మూలాలు విజయవాడలో తేలాయని.. వీటిపై మీడియాలో వార్తలే రాకుండా చేశారని చెప్పారు. ‘అడ్డగోలు దోపిడీ చేస్తే ఎవరూ ప్రశ్నించకూడదా? నన్ను ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో ఆపేస్తానంటావు, ఆ హక్కు నీకు ఉందా?’ అని ప్రశ్నించారు.

ఆర్థిక నేరస్తుడైన సీఎం వైఎస్‌ జగన్‌.. తాను కోనసీమ పర్యటనకు వెళ్తే 2 వేల మంది క్రిమినల్స్‌ను దాడికి దించారన్నారు. బాబు అరెస్టును సంపూర్ణంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో పట్టు విడుపులు ఉండాలని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇలా ఎన్నడూ వ్యవహరించలేదన్నారు. చంద్రబాబు అరెస్టయితే వైఎస్సార్‌సీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారని చెప్పారు.   

విడివిడిగా ఎదుర్కోవడం కష్టం 
సార్వత్రిక ఎన్నికల్లో విడివిడిగా పోటీచేస్తే వైఎస్సార్‌సీపీని ఎదుర్కోవడం కష్టమని.. జనసేన, టీడీపీ కలిసి సమష్టిగా పోటీ చేస్తామని పవన్‌ ప్రకటించారు. 2019లో వేర్వేరుగా పోటీ చేసి నష్టపోయామని, రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామన్నారు. జనసేన, టీడీపీ ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సీట్ల విషయం తర్వాత మాట్లాడతానని చెప్పారు. జనసేన ఒంటరిగా పోటీ చేయాలని చెప్పేందుకు మీరెవరని ప్రశ్నించారు. జైల్లో చంద్రబాబు భద్రత విషయమై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్తానన్నారు.  

మేం అధికారంలోకి వస్తే ఎవ్వరినీ వదలం  
‘వైఎస్సార్‌సీపీ నేతలు మాపై రాళ్లు వేసేముందు ఆలోచించుకోవాలి. మేం అధికారంలోకి వస్తే మాపై రాళ్లు వేసిన వారెవరినీ వదలం. పోలీసు వ్యవస్థ ఇంత బానిసత్వంగా ఉంటే ఎవరూ ఏం చేయలేరు. డీజీపీ, సీఎస్‌తో సహా ఎవరిపైనైనా పాత కేసులు తిరగతోడే అవకాశం ఉంది. చట్టాలను అధిగమించే అధికారులు ఒక్కసారి ఆలోచించుకోవాలి. సొంత చెల్లిని, తల్లిని వదిలేసిన వ్యక్తి, బాబాయిని చంపించిన వ్యక్తిని అధికారులు నమ్ముకుంటున్నారు.

మీకు రేపు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ఆలోచించుకోండి. జగన్‌ను నమ్ముకుంటే కుక్కతోకను పట్టుకుని గోదావరి ఈదినట్లే’ అని పవన్‌ అధికారులు, పోలీసులను హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు తప్పులు సరిదిద్దుకునేందుకు ఆరు నెలల సమయం మాత్రమే ఉందన్నారు. యుద్ధం కావాలంటే సిద్ధంగా ఉంటామని ఆవేశంతో ఊగిపోయారు. 

మరిన్ని వార్తలు