ఎన్నికల బరిలో జానకీపురం సర్పంచ్‌ నవ్య.. నామినేషన్‌ దాఖలు

10 Nov, 2023 19:12 IST|Sakshi

సాక్షి, జనగామ: జానకీపురం సర్పంచ్‌ నవ్య గుర్తున్నారా? స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్యపై వేధింపుల ఆరోపణలు.. యూట్యూబ్‌ ఇంటర్వ్యూలతో సోషల్‌ మీడియాలో వైరల్‌ కంటెంట్‌గా మారిపోయారామె. ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆమె ఇవాళ నామినేషన్‌ వేశారు. 

కుర్చపల్లి నవ్య స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా నామినేషన్ దాఖలు చేశారు. భర్తతో కలిసి నామినేషన్‌ దాఖలు చేయడానికి వెళ్లిన ఆమె.. రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. 

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో నవ్య సర్పంచ్‌ ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తొలి ఉప ముఖ్యమంత్రిగా పని చేసి రాజయ్యపై తీవ్ర విమర్శలే చేశారామె. అయితే.. నవ్య చేసిన ఆరోపణల వల్లే తాటికొండ రాజయ్యకు టికెట్ రాలేదన్న వాదన కూడా ఉంది.

కేసీఆర్‌ తనకు అవకాశం ఇస్తే.. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే‌గా నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఆ మధ్య మీడియాతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సర్పంచ్ నవ్య.. ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు