బాబు కోసం పవన్‌ ‘ఆరాటం’

14 Sep, 2023 02:07 IST|Sakshi
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జగ్గయ్యపేట వద్ద జాతీయ రహదారిపై పడుకున్న పవన్‌ (ఫైల్‌)

వారం రోజుల్లోనే రాష్ట్రానికి రెండోసారి వస్తున్న పవన్‌

జైలులో ఉన్న చంద్రబాబుతో నేడు భేటీ

ముద్రగడను, మహిళలను బాబు, లోకేశ్‌ దూషించి,వేధించినా మాట్లాడని పవన్‌

చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఎక్కడా లేని హడావుడి

సాక్షి, అమరావతి: స్కిల్‌ కుంభకోణం కేసులో జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీంఎ చంద్రబాబునాయుడి కోసం దత్తపుత్రుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పడుతున్న ఆరాటం చూసి సొంత పార్టీ నేతలే విస్తుపోతున్నారు. ఒక అవినీతి కేసులో జైలుకు వెళ్లిన వ్యక్తి కోసం ఇంత హడావుడిగా హైదరాబాద్‌ నుంచి రావాలా అని ప్రశ్నిస్తున్నారు. పవన్‌ వారం రోజుల్లో రెండో సారి రాష్ట్రానికి రావడమే వారి ప్రశ్నకు ఒక కారణం. పవన్‌ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంత స్వల్ప వ్యవధిలో రాష్ట్రానికి వచ్చిన దాఖలాలు లేవని పార్టీ నేతలే చెబుతున్నారు.

ఒకసారి రాష్ట్రంలో పర్యటించి (అదీ.. కొద్ది రోజులే) హైదరాబాద్‌ వెళ్లాక మళ్లీ నెలకో రెండు నెలలకో.. ఎప్పుడో వీలు కుదిరినప్పుడు వచ్చి పోయే వారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కాపు ఉద్యమం తీవ్ర స్థాయిలో జరిగినప్పుడు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని, ఆయన కుటుంబాన్ని, మహిళలను చంద్రబాబు, లోకేశ్‌ దుర్భాషలాడి, వేధించి, కేసులు పెట్టినా పవన్‌ ఒక్క మాట మాట్లాడలేదు. కానీ, పవన్‌ ఇప్పుడు చంద్రబాబు అరెస్టు తర్వాత మాత్రం వారంలో రెండోసారి వస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

చంద్రబాబు అరెస్టయిన రోజున (శనివారం) హడావుడిగా రాష్ట్రానికి వచ్చిన పవన్‌.. జైలులో ఉన్న చంద్రబాబుతో ములాఖత్‌ అయ్యేందుకు గురువారం రాజమండ్రి వెళ్లనున్నట్లు ఆయన రాజకీయ కార్యదర్శి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పవన్‌ హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి వస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లో నివాసం ఉండే పవన్‌ 2014లో జనసేన పార్టీ ఏర్పాటు చేశారు. గత పదేళ్లలో అప్పుడప్పుడు మాత్రమే ఏపీకి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా రాజకీయం చేసే పార్టీకి అధ్యక్షుడు అయి ఉండి కూడా పవన్‌ ఏపీలో ఎప్పుడూ కొద్దిరోజులు స్థిరంగా లేరు.

2014 తర్వాత మొదటి మూడున్నరేళ్లలో ఏడాదికి రెండుసార్లో మూడుసార్లో వచ్చారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అప్పట్లో రాజధాని రైతుల నుంచి చంద్రబాబు భూములు బలవంతంగా తీసుకున్న సమయంలో అమరావతి ప్రాంతానికి వచ్చారు. రైతులకు మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, చంద్రబాబుపై పోరాడిందీ లేదు, రైతుల కోసం పోరాటం చేసిందీ లేదు. ఆ తర్వాత కూడా మొక్కుబడిగా రాష్ట్రానికి వచ్చి వెళ్తుండేవారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం తీవ్రస్థాయిలో కొనసాగిన సందర్భంలోనూ రాష్ట్రానికి రాలేదు. ఆ ఉద్యమాన్నీ పట్టించుకోలేదు.

2019 ఎన్నికల అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక రెండు నెలలకు ఒక మారు రాష్ట్రానికి వస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో చంద్రబాబును సీఐడీ పోలీసులు శనివారం అరెస్టు చేసిన వెంటనే పవన్‌ ప్రత్యేక విమానంలో విజయవాడకు బయల్దేరారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన ఆగమేఘాల మీద రోడ్డు మార్గంలో విజయవాడకు బయల్దేరారు.

రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే పడుకొని నిరసన తెలిపారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. నాలుగు రోజులు కూడా గడవక ముందే మళ్లీ రాష్ట్రానికి వస్తుండటంతో జనసేన వర్గాలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నాయి. జైలులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు పవన్‌కు ఇంత తాపత్రయం ఎందుకన్న ప్రశ్న పార్టీలో ఉత్పన్నమవుతోంది. కాపు రిజర్వేషన్ల ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడే రాష్ట్రానికి రాని పవన్‌.. చంద్రబాబుకు ఇంత ప్రాధాన్యత ఎందుకిస్తున్నారని పార్టీ నేతలు, అభిమానులు ప్రశ్నిస్తున్నారు.  

మరిన్ని వార్తలు