రంగు మారిన పవన్‌ రాజకీయం

17 Sep, 2020 07:49 IST|Sakshi

సినీ, రాజకీయం ఈ రెండు రంగాల్లో ఏదో ఒకదాంట్లో విజయం సాధిస్తే దేశ చరిత్ర పుటల్లో శాస్వతంగా నిలిచిపోతారనేది నిమ్మదగిన సత్యం. చిత్రపరిశ్రమలో తారాజువ్వలా వెలిగి రాజకీయ పటంలో తమదైన ముద్రవేసుకున్న ఎంతోమంది ఘనాపాటీలు ఉన్న చరిత్ర మనది. విజయం ఎవడి సొత్తూ కాదంటూ వెండితెరపై నుంచి నేరుగా రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి పీఠాలందుకున్న ఘనత అతికొద్ది మందికే దక్కింది. వెండితెరపై రారాజులా వెలుగొంది కోట్లాది అభిమానుల గుండెల్లో చోటుదక్కించుకున్న ఎంజీ రామ్‌చంద్రన్‌తో పాటు తెలుగునాట చరిత్ర సృష్టించిన నందమూరి తారాకరామారావు అలియాస్‌ ఎన్టీఆర్‌ను చరిత్ర మరువలేనిది. అయితే ఆ జాబితాలో చేరాలని ఆతృతపడి తొలి అడుగుల్లోనే బొక్కబోర్లాపడ్డ నటులు కోకొల్లలు. వీరిలో ఒకరు టాలీవుడ్‌ టాప్‌ హీరో, జనసేన అధినేతి పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.

వెబ్‌‌ స్పెషల్‌ : వెండితెరపై కొట్లాది అభిమానులను సొంతంచేసుకున్న పవన్‌.. అనతికాలంలోనే టాలీవుడ్‌లో టాప్‌ హీరోస్థాయికి చేరుకున్నాడు. 1996లో సినీ ప్రయాణాన్ని ప్రారంభించి.. దాదాపు రెండు దశాద్ధాల పాటు ఆ రంగాన్ని ఓ ఊపుఊపారు. ఈ క్రమంలోనే 2014 రాష్ట్ర విభజనతో రాజకీయ పటంలో అనేక మార్పులు చేసుకున్నాయి. దీనిలో భాగంగానే రాజకీయాల్లో మార్పు అనే నినాదంతో పుట్టుకొచ్చిన పార్టీ జనసేన. రాష్ట్రాన్ని విభజించిన తీరుకు కాంగ్రెస్‌ పార్టీని దోషిగా నిందిస్తూ 2014 మార్చి 14న హైదరాబాద్‌ వేదికగా పవన్‌ కళ్యాణ్‌ జనసేన రాజకీయ పార్టీని నెలకొల్పాడు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పవన్‌ గంభీర స్వరంతో ప్రకటించాడు. అయితే నాటి ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించి.. కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవకుండా పోరాడాలని అభిమానులకు పిలుపునిచ్చాడు. అలా మార్చి 14న మొదలైన పవన్‌ రాజకీయ ప్రస్థానం ఆరేళ్లలో అనేక మలుపులు తిరిగింది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించిన వవన్‌.. నరేంద్ర మోదీ తరఫున జాతీయ స్థాయిలోనూ ప్రచారం చేశాడు.

అపఖ్యాతిని మూటగట్టుకు పవన్‌
ఆంధ్ర రాష్ట్రంలో సుమారు ఐదేళ్ల పాటు టీడీపీతో దోస్తీ చేసి.. చంద్రబాబు నాయడు టీంలో కీలక సభ్యుడిగా మొలిగారు. బాబు వర్గానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన పవన్‌.. ఏనాడు ప్రభుత్వ వైఫల్యాలను, పాలన తప్పిదాలను ప్రశ్నించిన దాఖలాలు కనిపించలేదు. ఇక ఈ క్రమంలోనే 2019 అసెంబ్లీ ఎన్నికల సమయం ఆసన్నమైంది. అప్పటికే ప్రజలంతా టీడీపీ పాలనపై విసుగెత్తి.. ఇక ముగింపు పలకాలని ఓ నిర్ణయించారు. ఈ విషయాన్ని ముందే గమనించిన పవన్‌.. ఇక టీడీపీతో ఉంటే తనకు రాజకీయ భవిష్యత్‌ కష్టమని పసిగట్టి చంద్రబాబుతో బంధానికి గుడ్‌బై చెప్పాడు. అనంతరం తాను నాస్తికుడినని ప్రకటించుకుని వామపక్షాలు (సీపీఎం, సీపీఐ)తో జట్టుకట్టి  తన భావాలకు దగ్గరగా ఉన్న ఎర్ర జెండాను భుజనాకెత్తుకున్నాడు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి రెండు స్థానాల్లో పోటీచేశాడు. రంగుమారిన రాత మారలే అన్నట్లు పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి చెంది అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. అంతేకాకుండా అన్ని స్థానాల్లోనూ పోటీచేసి కేవలం ఒకేఒక్క సీటుతో సరిపెట్టుకుంది జనసేనాని. అయితే  ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చరిత్రను తిరగరాస్తూ ఏకంగా 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. 

ఓటమితో ప్లేటు ఫిరాయింపు..
ఆ నాటి ఫలితాలు పవన్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో టీడీపీ-బీజేపీకి మధ్య వైరుధ్యం మరింత పెరగడంతో బీజేపీతో తనకున్న పాతస్నేహాన్ని మరోసారి గుర్తుచేసుకున్నాడు. పార్టీ మనుగడ కొనసాగాలంటే ఆర్థిక బలంతో పాటు అండబలం కూడా ఉండాలని ఆలోచనకు పదునుపెట్టాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బీజేపీతో జట్టుకట్టాడు. నాడు నాస్తికుడిని అని ప్రకటించుకున్న పవన్‌ ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించడంతో అభిమానులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. శ్రామికుడిని చిహ్నంగా తాను మెడలో ఎర్ర తువాలును ధరిస్తానని ప్రగల్భాలు పలికి.. నేడు మారిన పరిస్థితులకు అనుగుణంగా కాషాయం ధరించకగా తప్పదని ప్రకటించాడు. ఇక బీజేపీతో చేతులు కలిశాక పవన్‌ రాజకీయమే మారిపోయింది. కుల, మత రహిత సమాజమే ధ్వేయమని నాడు ప్రకటించిన మాటలన్నీ కొంతకాలమే అని చెప్పకనే చెప్పాడు. కరుడుగట్టిన హిందుత్వ ఏజెండాతో కలిగిన సిద్ధాంతాలను అనుసరించే బీజేపీవాదులతో పవన్‌ స్నేహం కొద్దికాలంలోనే వికసించింది. బీజేపీ సిద్ధాంతాలను అనుసరిస్తూ అసలైన జనసేన సిద్ధాంతాలను గోదాట్లో కలిపేశాడు.

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు
మోదీ మొప్పు కోసం తన పునాదులను సైతం పక్కనబెట్టి మరీ మతతత్వ రాజకీయాలకు దిగాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న అంతర్వేది ఘటనపై పవన్‌ స్పందించిన తీరే దీనికి నిదర్శనం. దశాబ్దాల చరిత్ర కలిగిన అంతర్వేది రథాన్ని సెప్టెంబర్‌ 6న గుర్తుతెలియని దుండుగులు తలగబెట్టారు. దీనిపై వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పవన్‌ స్పందించిన తీరు మరింత హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రంలో ఓ వర్గం దాడులు జరుగుతున్నాయని ఏకంగా ధర్మపోరాట దీక్షకే కూర్చుకున్నాడు. ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫారస్సు చేసినా దీపాలు ముట్టించుకుని తన నూతన ఏజెండాను ప్రదర్శించాడు. ఇదంతా బీజేపీ మెప్పు కోసమే అని సొంత పార్టీ నేతలే చెబుతున్నా.. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని కూర్చుండిపోయారు. బీజేపీతో జట్టుకట్టిన తరువాత పవన్‌ ఆలోచన విధానమే మారిపోయిందని, రాజకీయంగా నిలదొక్కుకోవడం కోసం జనసేనాని ఏకంగా మతం రంగులద్దుతున్నారన్న విమర్శలూ వినిపించాయి.

రాజకీయ రంగు మార్చుకుని హిందుత్వ ఏజెండా
అయోధ్య రామమందిరం కోసం బీజేపీ అలపెరగని పోరాటం నిర్వహించినా.. దశాబ్దా కాలంలో పవన్‌ మద్దతు ప్రకటించిన దాఖలు లేవని చెప్పకతప్పదు. నాడు కనీసం ఒక్క ప్రకటన కూడా చేయని పవన్‌కు నేడు ఒక్కసారే హిందువులపై ప్రేమ పుట్టుకొచ్చిందంటే అంతా సామాన్యంగా ఎవరూ నమ్మరు. అంతేకాదు ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో హిందూధర్మంపై దాడులు జరిగితే కనీసం ప్రశ్నించిన పాపాన పోలేదు పవన్‌ కళ్యాన్‌. ప్రభుత్వంతో కుమ్మకై బలహీన వర్గాలపై దాడులను సైతం ప్రోత్సహించిన జనసేనాని నేడు రాజకీయ రంగు మార్చుకుని రాజకీయ అస్థిత్వం కోసం పోరాడుతూ. ఉనికి కోసం పడరాని పాట్లుపడుతున్నారు. కొత్త పొత్తుల ప్రభావం కావచ్చు.. ఉన్నత పదవుల్లో మహిళలను నియమించినా పవన్‌కు గిట్టడంలేదు. విజయనగరంలోని మన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా దివంగత ఆనందగజపతి రాజు కుమార్తెను నియమిస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. మొదట్లో మౌనంగానే ఉన్న పవన్‌ ఆ తరువాత రూట్‌ మార్చుకున్నారు. మాన్సాస్ ట్రస్ట్‌ ఒక హిందూయేతర వ్యక్తి నేతృత్వంలో ఉందంటూ సంచయితపై బురదజల్లె ప్రయత్నం చేశారు. దీనిపై జనసేనాని పెద్ద ఎత్తున విమర్శలే ఎదుర్కొన్నారు. 

ఆరేళ్ల కాలంలోనే ఊసరవెళ్లిలా రంగులు మార్చిన పవన్‌ తీర్పుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రసంగాల్లో భగత్‌సింగ్‌, చెగువేరా, అల్లూరి, శ్రీశ్రీ గురించి ఊదరగొట్టే పవన్‌ నిత్య జీవితంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం అభిమానులకు మింగుడుపడటంలేదు. ముఖ్యంగా హిందుత్వ పార్టీగా ముద్రపడ్డ బీజేపీతో చేతులు కలిపి ప్రశ్నించే తత్వాన్ని కాస్తా ధర్మదీక్షగా మార్చడం చారిత్రాత్మక తప్పిదంగా భావిస్తున్నారు. ఇక పవన్‌ తాపత్రయం అంత రానున్న ఎన్నికల్లో పార్టీని నెలబెట్టుకోవడం కోసమే అని విశ్లేషకుల భావన. బీజేపీ మద్దతులో రాష్ట్రంలో ఎదగాలని కనీసం ఎమ్మెల్యేగా అయినా గెలవాలని పవన్‌ ప్రయత్నం కావచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.

వ్యక్తిగత జీవితం..
మహిళలపై తనకు అపారమైన గౌరవం ఉందని ఊదరగొట్టే పవన్‌ వైవాహిక జీవితం మాత్రం అందుకు భిన్నంగా సాగుతోంది. తొలుత మే 1997లో నందినితో పవన్‌కు వివాహం జరిగింది. మరోనటి రేణూ దేశాయ్‌తో పవన్ అక్రమ సంబంధం నెరపుతున్నాడని వారిద్దరికీ అప్పటికే ఒక కుమారుడు కూడా జన్మించి ఉన్నాడనీ 2007 జూలైలో నందిని కోర్టులో కేసు వేసింది. 2008 ఆగస్టు 12లో విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టు వీరిద్దరకి విడాకులు మంజూరు చేసింది. నటిగా మారిన మోడల్ రేణూ దేశాయ్‌ను 2009 జనవరి 28న పవన్‌ వివాహం చేసుకున్నాడు. వీరికి కలిగిన కుమారుని పేరు అకీరా నందన్. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకీరా కురొసావాపై అభిమానంతో వారు తమ కొడుకుకు ఆ పేరు పెట్టుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికే రేణుకు కూడా పవన్‌ విడాకులు ఇచ్చాడు. అనంతరం ముచ్చటగా మూడో వివాహానికి సిద్ధమయ్యాడు. 2013 సెప్టెంబరు 30న రష్యా నటి అన్నా లెజ్‌నేవాతో జరిగింది. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి కలిగిన కుమారుని పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. ప్రస్తుతం వీరిద్దరూ కలిసే ఉంటున్నారు.

మరిన్ని వార్తలు