చేతకాకే కాపాడుకోలేకపోయాం 

22 Aug, 2022 04:44 IST|Sakshi

‘చిరు’ ప్రజారాజ్యంపై పవన్‌ వ్యాఖ్యలు

సీమ ప్రజల్లో చైతన్యం పెరగాలి 

మోదీపైనే అభిమానం...టీడీపీపై కాదు  

తిరుపతి రూరల్‌: దేశంలో, రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం ఉండాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీకి  కొమ్ము కాయటానికి తాము సిద్ధంగా లేమన్నారు. రెండిటికీ సమదూరం పాటిస్తామన్నారు. నాడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని చేతకానితనం, కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చిన కోవర్టుల వల్లే కాపాడుకోలేకపోయామని వ్యాఖ్యానించారు. తన అన్న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినా, తాను మాత్రం అటువైపు వెళ్లలేదన్నారు.

ప్రధాని మోదీ మీద అభిమానంతోనే 2014లో టీడీపీకి మద్దతు తెలిపామని, అంతేకానీ ఆ పార్టీపై ప్రేమతో కాదన్నారు. గౌరవం ఇవ్వని పార్టీలకు ఎప్పుడూ దూరంగా ఉంటామన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని, శత్రువులతో కలిసిపోవటమే రాజకీయం అన్నారు.

తిరుపతిలో ఆదివారం జరిగిన ‘జనవాణి–జనసేన భరోసా’ కార్యక్రమంలో 415 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. అనంతరం పవన్‌  మీడియాతో మాట్లాడుతూ కోస్తాంధ్రలో దళితులకు సమస్య వస్తే సంఘటితంగా పోరాడతారని, సీమలో  ఆ పరిస్థితుల్లేవన్నారు. ఒకటి రెండు కులాల చేతుల్లోనే అధికారం వల్ల అసమానతలు పెరుగుతున్నాయన్నారు.  

మునుగోడులో జనసేనకు వందో, వెయ్యో ఓట్లు
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలని అడుగుతున్నారని, అక్కడ పోటీచేస్తే జనసేనకు వందో, వెయ్యో, రెండువేలో ఓట్లు రావొచ్చు.. దానివల్ల సాధించేదేమీ లేదు.. అని పవన్‌ వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు