రాజధానిపై కౌంటర్‌ దాఖలుకు జనసేన నిర్ణయం 

30 Aug, 2020 06:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని తరలింపునకు సంబంధించి హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేయాలని జనసేన పార్టీ నిర్ణయించినట్లు ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ అంశంపై పవన్‌కల్యాణ్‌ శనివారం పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ పేర్కొంది. పార్టీ నేతలతో జరిగిన చర్చలో.. ‘భూములు ఇచ్చిన రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదు. అలాగే అక్కడి భూముల్లో ఇప్పటికే నిర్మాణాలు చేపట్టారు. మరికొన్ని నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అంటే ప్రజాధనాన్ని ఇప్పటికే రాజధాని కోసం వెచ్చించారు. ఈ కేసులో తుది వరకు బాధ్యతగా నిలబడతాం. న్యాయ నిపుణుల సలహాలు, వారి సహకారంతో కౌంటర్‌ వేస్తాం’ అని పవన్‌ వ్యాఖ్యానించారు.  

నిందితుడు పవన్‌కల్యాణ్‌ అభిమానే 
విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో శిరోముండనం కేసులో ప్రధాన నిందితుడు పవన్‌ కల్యాణ్‌ అభిమాని మాత్రమేనని జనసేన పార్టీ మరో ప్రకటనలో పేర్కొంది. ఆయన జనసేన పార్టీ నేతగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొంది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనలో పవన్‌ కల్యాణ్‌ పేరును తీసుకురావడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. ఈ కేసులో తగిన విచారణ జరిపి దోషులను చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నట్టు పేర్కొంది.

>
మరిన్ని వార్తలు