అయ్యా పవనూ.. ఊహించలే.. మరీ ఇంత ఘోరంగా దిగజారాలా?

12 Aug, 2023 14:08 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శవ రాజకీయానికి తెరలేపారు. మొన్నటికి మొన్న వలంటీర్‌ వ్యవస్థపై విషాన్ని కక్కిన పవన్‌.. ఇప్పుడు విశాఖలో హత్యకు గురైన వృద్ధురాలి కుటుంబాన్ని పరామర్శించిన వంకతో శవ రాజకీయాలు మొదలు పెట్టారు.

వరలక్ష్మీ అనే వృద్ధురాలిని వాలంటీర్‌ చంపేశాడంటూ అసత్య ప్రచారం చేస్తున్న పవన్‌.. రాజకీయ లబ్ది కోసం  ఇప్పుడు ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లడం చూసి అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్‌ మైలేజ్‌ కోసమే పవన్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కుత్తుకలు కోసే దండుపాళ్యం బ్యాచ్‌’ అంటూ వాలంటీర్లను అభివర్ణించడం.. పవన్‌లో నిండుకుపోయిన విషానికి నిదర్శనమంటున్నారు. 

కాగా వరలక్ష్మిని చంపడానికి వారం రోజులు ముందే వెంకటేష్ అనే యువకున్ని వాలంటీర్‌గా తొలగించారు. విధులు సరిగా నిర్వహించడం లేదని జులై మూడో తేదీన వెంకటేట్‌పై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జులై 24వ తేదీన వెంకటేష్ వాలంటీరుగా తొలగించారు. వాలంటీరుగా తొలగించిన తరువాత వరలక్ష్మికి చెందిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో సర్వర్‌గా వెంకటేష్ చేరాడు.

ఈ క్రమంలో జులై 30వ తేదీ అర్ధరాత్రి నగల కోసం వరలక్ష్మిని వెంకటేశ్‌ హత్య చేశాడు. అయితే రాజకీయ లబ్ధి కోసం వాలంటీర్ హత్య చేశాడంటూ పవన్ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే వాలంటరీ వ్యవస్థ వల్ల 30 వేల మహిళలు అదృశ్యం అయ్యారని పవన్ దుష్ప్రచారం చేశారు. ఇంట్లో పని చేసే వ్యక్తి చంపేస్తే వలంటీర్ చంపేశారంటూ పవన్‌ విష ప్రచారం చేశారు. ఎంత చంద్రబాబు డైరెక్ట్‌ చేయించినా.. మరీ ఇంత ఘోరంగా దిగజారాలా? అని పవన్‌ తీరును ప్రశ్నిస్తున్నారు పలువురు. 

వ్యవస్థలో ఒకరో, ఇద్దరో చేసిన తప్పుకు మొత్తం అందరిపై నిందలు వేయడం, విషం జిమ్మడం సరికాదని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  తమను సంఘ విద్రోహశక్తులుగా చిత్రీకరించడం సరికాదని, చుట్టున్న ప్రజల సమస్యల పరిష్కారానికి పాటు పడుతున్నామని అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్నది పూర్తిగా దుష్ప్రచారమని, ఇటీవల కేంద్రం కూడా పార్లమెంటులో ఈ ఆరోపణలను తిప్పికొడుతూ ప్రకటన చేసిందని గుర్తు చేస్తున్నారు,
చదవండి: బాలికపై చిరుత దాడి ఘటన.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి అత్యవసర సమావేశం 

మరిన్ని వార్తలు