బీజేపీ సర్కార్‌కు మద్దతు ఉపసంహరించుకుంటాం.. అయినా ఫరక్‌ పడదు!

30 Aug, 2022 15:05 IST|Sakshi

ఇంఫాల్‌: వరుసగా పలు రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభాలు తలెత్తడం.. ప్రధాన పార్టీల పొత్తులు మారిపోయి ప్రభుత్వాలే తలకిందులు కావడం చూస్తున్నాం. తాజాగా బీహార్‌లోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గుడ్‌బై చెప్పేసింది జనతాదల్‌ యునైటెడ్‌(జేడీ(యూ)) పార్టీ. దీంతో పూర్తి సంబంధాలు తెగిపోయినట్లేనని అంతా భావించారు. కానీ.. ఆశ్చర్యకర రీతిలో మణిపూర్‌లో మాత్రం బీజేపీ సర్కార్‌కు ఇంకా మద్దతు కొనసాగిస్తోంది ఆ పార్టీ. అయితే..

మణిపూర్‌లో నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ నుంచి బయటకు రాబోతున్నట్లు ప్రకటించింది ఆ రాష్ట్రానికి చెందిన జేడీయూ యూనిట్‌. అంతేకాదు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు సైతం ఉపసంహరించుకోబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జేడీ(యూ) మణిపూర్‌ యూనిట్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌హెచ్‌ బీరెన్‌ సింగ్‌ ప్రకటన చేశారు.

‘‘మద్దతు ఉపసంహరించుకునే ప్రయత్నాల్లో ఉన్నాం. కానీ, కొన్ని ఫార్మాలిటీస్‌ పూర్తి కావాల్సి ఉంది’’ అని బీరెన్‌ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. అంతేకాదు సెప్టెంబర్‌ 3-4 తేదీల మధ్య పాట్నాలో జరగబోయే ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో ఈ మేరకు అగ్రనేతలతో సమావేశమై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని, ఈ భేటీకి మణిపూర్‌ జేడీయూ ఎమ్మెల్యేలు సైతం హాజరవుతారని, సమావేశం అనంతరం అధికారికంగా ఒక ప్రకటన చేస్తామని తెలిపారు.

క్లియరెన్స్‌ లేకనే..
ఇదిలా ఉంటే.. బీహార్‌ రాజకీయాల్లో భాగంగా జేడీ(యూ) ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత కేంద్రం నుంచి కూడా సంబంధాలు తెంచేసుకుంది. అయితే.. మణిపూర్‌లో ఎన్‌ బీరెన్‌ సింగ్‌ నేతృత్వంలోని బీజేపీ కూటమి ప్రభుత్వానికి మాత్రం మద్దతు కొనసాగుతూనే వస్తోంది. వాస్తవానికి ఆగస్టు 10వ తేదీనే మణిపూర్‌ జేడీయూ యూనిట్‌ తెగదెంపులపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి క్లియరెన్స్‌ రాకపోవడంతో ప్రకటన జాప్యం అవుతూ వస్తోంది. 

మణిపూర్‌ అసెంబ్లీలో 60 స్థానాలు ఉండగా.. బీజేపీ ప్రభుత్వం 55 మంది ఎమ్మెల్యేలతో కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. అందులో బీజేపీ ఎమ్మెల్యేలు 32 మంది కాగా, ఏడుగురు నేషనల్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన వాళ్లు. ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు, మిగతా వాళ్లు ప్రాంతీయ పార్టీల వాళ్లు  ఉన్నారు. జేడీయూ మద్దతు ఉపసంహరించుకున్నా ప్రభుత్వం కుప్పకూలే అవకాశం లేదు. అయితే ప్రాంతీయ పార్టీల్లో తాము బీజేపీ-బీ టీంలం కాదనే అసంతృప్తి బాగా పేరుకుపోయింది ఉంది. ఒకవేళ జేడీయూ గనుక వాళ్లను ప్రభావితం చేయగలిగితే మాత్రం ప్రభుత్వం సంక్షోభంలో పడే అవకాశాలు ఉన్నాయి.!   

మరోవైపు.. మణిపూర్‌ బీజేపీలో నేతల మధ్య అసంతృప్తి పెరిగిపోతోంది. ఈ క్రమంలో.. కీలక నేత నిమాయ్‌చంద్‌ లువాంగ్‌ తన మద్దతుదారులతో కలిసి సోమవారం ఇంఫాల్‌లో జేడీయూ పార్టీ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం. 

ఇదీ చదవండి: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి రేసులో ఆయన!

మరిన్ని వార్తలు