నేను స్వతహాగా చంద్రబాబు ద్వేషిని..

17 Mar, 2021 04:05 IST|Sakshi

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాదు

2024 తర్వాత రాష్ట్రంలో ఉండదు

రాజధాని విశాఖలో అయితే బాగుండేదని చెప్పా..

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో జేసీ దివాకర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో హల్‌చల్‌ చేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మేం ముఖ్యమంత్రి అవుతామంటే, మేం ముఖ్యమంత్రి అవుతామని పోటీ పడి, మొత్తం మీద అందరు కలసి కాంగ్రెస్‌ను నాశనం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి బాధాకరం.. మా ఉన్నతికి కారణం కాంగ్రెస్‌ పార్టీ.. మన పార్టీ గురించి బాధపడుతున్నా. త్వరలో ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మూతపడుతుంది. కాంగ్రెస్‌కు కాలం చెల్లింది. రాహుల్‌ విదేశాలకు వెళ్తాడు. సోనియా జపం చేసుకుంటుంది. సీతారామ ప్రాజెక్టు కింద భట్టి సాగు చేసుకుంటారు’అని జేసీ వ్యాఖ్యానించారు.

మంగళవారం తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన జేసీ అక్కడే ఉన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పిచ్చాపాటీగా గంటకుపైగా సంభాషించారు. ‘పందెం కాస్తా.. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాలేదు. కేసీఆర్‌ వీపు పగలగొడతారు. 2023–24 తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ ఉండదు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి సొంతంగా గెలవాల్సిందే. పోటీ చేసేందుకు ఆయన కుమారుడు రఘువీర్‌ ముందుకు రావాలి. ప్రతిదానికీ కొంతకాలం జీవకళ ఉంటుంది. మేం పుట్టి పెరిగిన పార్టీకి కాలం చెల్లిపోయింది. టీడీపీ లో ఉన్నా కాంగ్రెస్‌ నాకు మాతృపార్టీ. దానిని నేను మరచిపోలేను. కానీ, కాంగ్రెస్‌ను తిడితే ద్రోహులం అవుతాం. అక్కడ మేం బతికే చాన్స్‌ లేదు. గతి లేక టీడీపీలో కొనసాగుతున్నా’అని అన్నారు.

రాజధాని విశాఖలో అయితే బాగుండేది..
‘రాజధాని విశాఖలో బాగుంటుందని అప్పట్లో చంద్రబాబుకు చెప్పాం. లేదంటే నాగార్జునసాగర్‌ (ఏపీ సరిహద్దువైపు ప్రాంతం) గానీ, దొనకొండగానీ అయితే బాగుంటుందనుకున్నాం. దొనకొండలో 35 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. నాగార్జున సాగర్‌లో కొండలు, తుప్పలతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ తరహాలో ఉంటుంది. త్వరగా అభి వృద్ధి జరుగుతుందన్నాం’అని వ్యాఖ్యానించారు. నిజానికి నాకు దివంగత వైఎస్‌ కుటుంబానికి అత్యంత సాన్నిహిత్యం ఉండేది. ఒకరి కుటుంబ విషయాలు ఇంకొకరం చెప్పుకునేవాళ్లం. స్వతహాగా నేను చంద్రబాబు ద్వేషిని’అని వ్యాఖ్యానించారు. 

కేసీఆర్‌ను గద్దెదించే వరకు నిద్రపోం.. 
‘56 ఏండ్ల ఉమ్మడి ఏపీలో 50 ఏండ్లు మీరే పాలించారు. చెన్నారెడ్డి, అంజయ్య.. ఇలా ఎవరినీ సీఎంలుగా పూర్తికాలం పనిచేయకుండా దించేశారు. తెలంగాణలో మహిళలను మంత్రులుగా చేసి ఇక్కడి బలమైన నాయకత్వాన్ని అణచివేశారు. అందుకే తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మీద ప్రజలకు నమ్మకం పోయింది. తెలంగాణ రావడం కేసీఆర్‌ గొప్పతనం కాదు. వైఎస్‌ జగన్‌ను సీఎం చేస్తే తెలంగాణ వచ్చి ఉండేది కాదు. జైపాల్‌రెడ్డి లేదా జానారెడ్డిలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయమని అడిగాం. జగన్‌ను రాజకీయంగా అణగదొక్కేందుకు ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ కిరణ్‌ కుమార్‌రెడ్డిని సీఎం చేసింది. ఇప్పుడు కేసీఆర్‌ తెలంగాణను అప్పుల పాలు చేశారు.

రాష్ట్రంలో కేసీఆర్‌ను గద్దె దించే వరకు నిద్రపోం’అని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జేసీ కాంగ్రెస్‌ వీడటం గురించి మాట్లాడుతూ ‘మీరు రెక్కలు వచ్చి ఎగిరిపోయారు. మేం తల్లిపాల మీద ఆధారపడ్డామ’ని జీవన్‌రెడ్డి.. ‘మిమ్ములను పంపకపోతే మా ఇల్లు లాక్కునే వాళ్లు’అని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 2023–24లో టీఆర్‌ఎస్‌ను ఓడించి అధికారంలోకి వస్తాం’అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించగా.. ఆల్‌ ది బెస్ట్‌ అంటూ జేసీ అక్కడ నుంచి కదిలారు.   

>
మరిన్ని వార్తలు