‘ప్రభ’ తొలగి.. పన్నాగాలు.. ఉనికి కాపాడుకునేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి పాట్లు 

3 Oct, 2022 07:34 IST|Sakshi

ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్న అనుచరులు

నిక్కచ్చిగా పనిచేసే అధికారులకు బెదిరింపులు 

ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా వారిపై నిరాధార ఆరోపణలు

దారికి తెచ్చుకునేలా కుటిల యత్నాలు 

టీడీపీ హయాంలో జిల్లాలో పనిచేసిన మైనింగ్‌ ఏడీ నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తుండేవారు. తమ గ్రానైట్‌ దోపిడీకి ఏడీ అడ్డు తగులుతున్నారని జేసీ సోదరుల (దివాకర్‌రెడ్డి – ప్రభాకర్‌రెడ్డి) ప్రధాన అనుచరుడు ఎస్‌.వి.రవీంద్రారెడ్డితో ఏడీని తీవ్రస్థాయిలో బెదిరించారు. లారీలతో గుద్ది చంపుతామని బెదిరించడమే కాకుండా అవినీతి మరకలంటించారు.
చదవండి: సైకోలా అయ్యన్న తీరు 

ఇటీవల బదిలీపై వెళ్లిన తాడిపత్రి మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డిని కూడా ప్రభాకర్‌రెడ్డి టార్గెట్‌ చేశారు. చీటికిమాటికి.. అయినదానికి కానిదానికి బ్లాక్‌మెయిల్‌ చేశారు. మున్సిపల్‌ కార్యాలయ పరిపాలనా విభాగాల సిబ్బందిపైనా నోరు పారేసుకున్నారు.

తాజాగా డీఎస్పీ వీఎన్‌కే చైతన్య శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డికి మింగుడు పడటం లేదు. సోషల్‌ మీడియా వేదికగా డీఎస్పీపై విమర్శలు గుప్పిస్తూ అవినీతి మరక అంటించేందుకు సిద్ధమయ్యారు.

అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా తన పనులు సజావుగా, సాఫీగా చేసుకునేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి కుట్రలకు తెరలేపుతున్నారు. మాట వినని అధికారులను, పోలీసులను బెదిరించడం, వారి బంధువులకు వార్నింగ్‌ ఇవ్వడం చేస్తున్నారు.

తాడిపత్రి అర్బన్‌: కళ్లు పెద్దవి చేస్తూ.. ఆవేశంతో ఊగిపోతూ.. నోటి దురుసుతో రాజకీయ నాయకులను రెచ్చగొట్టడం.. అధికారులు, ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతీయడం మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి నైజం. ఆయన వ్యవహార శైలి నచ్చక అనుచరులు ఒక్కొక్కరుగా టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. దీంతో నిరాశానిస్పృహలకు లోనైన ప్రభాకర్‌రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. తాడిపత్రిలో తన ప్రాభవం కనుమరుగైపోతుండటంతో తిరిగి పట్టు సాధించుకునేందుకు బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారు. తాను చైర్మన్‌ అని, మున్సిపల్‌ పరిధిలోని వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని, అధికారులందరూ తాను చెప్పినట్లే వినాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఈయన అహంకార ధోరణితో అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

కుదిరితే బేరం..  లేకుంటే బ్లాక్‌మెయిల్‌
జేసీ ప్రభాకర్‌రెడ్డి తాను చెప్పిన పనులు చేయించుకోవడం కోసం అధికారులతో మొదట బేరానికి వెళ్లడం.. కుదరకపోతే బ్లాక్‌మెయిల్‌ చేయడం సర్వసాధారణం. ముందుగా తన అనుచరులతో అధికారులకు ఫోన్‌ చేయించి, వారి ద్వారా నజరానాలు పంపి బేరం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. అధికారులు వాటిని తిరస్కరిస్తే ఇక తనదైన శైలిలో బెదిరింపులకు దిగుతారు. దీంతో నిక్కచ్చిగా పనిచేసే అధికారులు జేసీ తీరుతో ఇబ్బంది పడుతున్నారు.

అధికారుల బంధువులకు  బెదిరింపులు!
అధికారుల వద్ద తన ఆటలు సాగవని తెలుసుకున్న ప్రభాకర్‌రెడ్డి.. అధికారుల బంధువులు ఎవరున్నారు.. వారు ఎక్కడ ఉంటున్నారన్న సమాచారం సేకరించి వారిని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. తాడిపత్రి సబ్‌డివిజన్‌లో పని చేస్తున్న ఓ ఎస్‌ఐ సమీప బంధువు వైఎస్సార్‌ జిల్లా సింహాద్రిపురం మండలం నక్కలపల్లిలో ఉంటున్నారు. మూడ్రోజుల క్రితం ఆ ఎస్‌ఐ   బంధువుకు జేసీ అనుచరుడు మల్లికార్జునరెడ్డి ఫోన్‌ చేసి ‘మీవాడు హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడు.. జాగ్రత్తగా ఉండమ’ని హెచ్చరించినట్లు సమాచారం.     ఇందుకు ఆ ఎస్‌ఐ బంధువు భయపడకుండా దీటుగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.

సబ్‌ డివిజన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐలు, వారి బంధువుల వివరాలను సేకరిస్తున్నారు. ఆ తర్వాత వారు సివిల్‌ పంచాయితీలు చేసి       లంచాలు తీసుకుంటున్నారని సోషల్‌ మీడియా వేదికగా నిరాధార ఆరోపణలు చేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు.  
ఇటీవల ఓ సీఐని బెదిరించినట్లు తెలిసింది. ‘నా అనుచరులపై దాడి చేస్తే మేం కూడా వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై దాడి చేస్తాం...మీరేమి చేస్తారో చూస్తాం’ అని ఆ సీఐని ఫోన్లో బెదిరించినట్లు సమాచారం. 
గన్నెవారిపల్లి కాలనీలో ఇటీవల ప్రభుత్వ అనుమతులు లేకుండానే జేసీ అనుచరులు భూగర్భ డ్రెయినేజీ మరమ్మతు పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి అడ్డుకోవడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి  ఆగ్రహించారు. వారికి ఫోన్‌ చేసి ‘నా మనుషులు చేసే కాంట్రాక్టు పనులను అడ్డుకుంటారా!’    అంటూ బూతులు తిట్టినట్లు తెలిసింది. దీంతో అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
మున్సిపల్‌ ఎన్నికల్లో మొసలి కన్నీరు కార్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డికి అధికారం కట్టబెడితే ఇలా అధికారులపై బెదిరింపులకు దిగడమేంటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు