నితీశ్‌కు ‘చిరాక్‌’

12 Nov, 2020 04:26 IST|Sakshi

బిహార్‌లో చిరాగ్‌ పాశ్వాన్‌ పార్టీ వల్ల జేడీ(యూ)కు తీవ్ర నష్టం,ఎన్డీయేకు లాభం

పట్నా: ‘‘బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మరింత బలోపేతం చేయడమే నా ప్రధాన ఉద్దేశం. ఈ ఎన్నికల్లో నేను చూపించిన ప్రభావం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను’’.. ఎన్నికల ఫలితాల అనంతరం లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) నేత చిరాగ్‌ పాశ్వాన్‌ వ్యాఖ్యలివీ. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ బిహార్‌ ఎన్నికల్లో ఎన్డీయే మళ్లీ అధికారం దక్కించుకుంది. ఈ కూటమిలోని బీజేపీ అనూహ్యంగా తన బలం పెంచుకుంది. మరో పార్టీ జేడీ(యూ) దారుణంగా చతికిలపడింది. ఇందుకు ప్రధాన కారణం ఎల్‌జేపీ పోటీలో ఉండడమే అని విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ మిత్రపక్షమైన ఎల్‌జేపీ బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌తో విభేదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసింది.

రాష్ట్రంలో 243 శాసనసభ స్థానాలుండగా, 120 స్థానాల్లో చిన్నాచితక పార్టీలు ఓట్లను చీల్చి ప్రధాన పార్టీల విజయావకాశాలను దెబ్బతీశాయి. ఇందులో 54 సీట్లలో ఎల్‌జేపీ బలమైన ప్రభావం చూపింది. వీటిలో 25 సీట్లలో జేడీ(యూ) రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఎల్‌జేపీ పోటీ చేయడం వల్ల జేడీ(యూ) ఓడిపోయింది. మొత్తం 54 స్థానాల్లో ఎల్‌జేపీ మూడో స్థానంలో నిలిచింది. ఆయా స్థానాల్లో గెలిచిన, ఓడిన ప్రధాన పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం కంటే ఎల్‌జేపీకి దక్కిన ఓట్లే అధికం కావడం విశేషం. ఈ ఓట్లన్నీ ఓడిపోయిన ప్రధాన పార్టీకి పడి ఉంటే కచ్చితంగా గెలిచేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎల్‌జేపీ మతీహన్‌ అనే స్థానంలో మాత్రమే గెలిచింది. మిగిలిన అన్ని చోట్లా పరాజయం పాలైంది.

మహాకూటమికీ గట్టి దెబ్బ
ఎన్డీయే మిత్రపక్షమైన వికాశీల్‌ ఇన్సాన్‌ పార్టీ కూడా ఎల్‌జేపీ వల్ల 4 స్థానాల్లో ఓడిపోవాల్సి వచ్చింది. బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్న చాలాచోట్ల ఎల్‌జేపీ అభ్యర్థులను నిలపలేదు. కొన్నిచోట్ల ఎల్‌జేపీ అభ్యర్థులు పోటీ చేశారు. ఎల్‌జేపీ వల్ల ఒక స్థానంలో మాత్రమే బీజేపీ ఓటమి మూటకట్టుకుంది.  ఎల్‌జేపీ అభ్యర్థులు పోటీలో ఉండడం వల్ల మహాకూటమిలోని ఆర్జేడీ 12 సీట్లు, కాంగ్రెస్‌ 10, సీపీఐ(ఎంఎల్‌) రెండు సీట్లలో ఓడిపోయాయి. మొత్తంగా చూస్తే చిరాగ్‌ పాశ్వాన్‌ వల్ల ఎన్డీయే 30, మహాకూటమి 24 సీట్లను కోల్పోవాల్సి వచ్చింది.

లాభమెంత? నష్టమెంత?
ఎల్‌జేపీ వల్ల ప్రధాన పార్టీలకు నష్టమే కాదు, లాభం కూడా దక్కింది. ఆయా పార్టీలు ఓడిపోవాల్సిన చోట గెలిచాయి. ఓట్లను ఎల్‌జేపీ చీల్చడంతో ఇది సాధ్యమైంది. ఎల్‌జేపీ పోటీ కారణంగా ఆర్జేడీ 24, కాంగ్రెస్‌ 6, జేడీ(యూ) 20, హిందూస్తాన్‌ ఆవామ్‌ మోర్చా 2, బీజేపీ ఒకటి, వీఐపీ పార్టీ ఒక సీటు గెలుచుకున్నాయి. స్థూలంగా చెప్పాలంటే.. చిరాగ్‌ పాశ్వాన్‌ కారణంగా బిహార్‌లో ఎన్డీయేకు లాభం 24, నష్టం 30. మహాకూటమికి లాభం 30, నష్టం 24.

చిరాగ్‌ ఆత్మాహుతి దళంలా పని చేశారు
ప్రధాని మోదీకి తాను హనుమంతుడి లాంటి భక్తుడినని చెప్పుకుంటున్న చిరాగ్‌ పాశ్వాన్‌ జేడీ(యూ)ను దెబ్బకొట్టడంపైనే దృష్టి పెట్టారు. ఆయన అనుకున్నది నెరవేరింది. ఈ ఎన్నికల్లో చిరాగ్, ఆయన బృందం ఆత్మాహుతి దళంలా పని చేసిందని జేడీ(యూ)  నేత రాజీవ్‌ రంజన్‌ విమర్శించారు.

మరిన్ని వార్తలు