Bihar Politics: నితీశ్‌ చాణక్యం.. కలహాల కాపురానికి ఫుల్‌స్టాప్‌

10 Aug, 2022 02:47 IST|Sakshi

జేడీ(యూ) నేత నితీశ్‌కుమార్‌ (71) దేశ రాజకీయాల్లో మరోసారి కలకలం సృష్టించారు. ఎన్డీఏతో కలహాల కాపురానికి ఫుల్‌స్టాప్‌ పెట్టడమే గాక బిహార్‌లో రెండేళ్ల క్రితం బీజేపీతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలువునా కూల్చేసి ఆ పార్టీకి గట్టి షాకే ఇచ్చారు. అదే వేగంతో ఆర్జేడీ సారథ్యంలోని మహా ఘట్‌బంధన్‌ కూటమిలో చేరి సీఎం పీఠాన్ని కాపాడుకున్నారు. రాజకీయ భాగస్వాములను, తద్వారా ప్రభుత్వాలను మంచినీళ్లప్రాయంగా మార్చడంలో తనకు తానే సాటి అని మరోసారి రుజువు చేసుకున్నారు. ఒకవైపు ఒక్కో రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను బీజేపీ పథకం ప్రకారం వరుసబెట్టి కూలుస్తూ వస్తుంటే, బిహార్‌లో ఆ పార్టీనే అధికారానికి దూరం చేసి ఔరా అన్పించారు. అంతటితో ఆగలేదు.

మహారాష్ట్రలో మాదిరిగా జేడీ(యూ) అసమ్మతి నేత ఆర్సీపీ సింగ్‌ సాయంతో పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని గట్టి ఆరోపణలు చేసి కాషాయ పార్టీని ఒకవిధంగా ఆత్మరక్షణలో పడేశారు. అందుకే ఎన్డీఏను వీడాల్సి వచ్చిందంటూ తన చర్యను సమర్థించుకున్నారు. నిజానికి బిహార్లో బీజేపీ ఇలాంటి ప్రయత్నం చేస్తోందని కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది కూడా. దాంతో రంగంలోకి దిగిన నితీశ్‌ బీజేపీ కంటే ముందు తనే పావులు కదిపి అధికార పీఠాన్ని కాపాడుకున్నారు. తద్వారా ఒక సిద్ధాంతమంటూ లేని రాజకీయ అవకాశవాదిగా ఆయనపై ఉన్న ముద్రకు మరింత బలం చేకూరింన్నది పరిశీలకుల అభిప్రాయం. కాకపోతే నానా రకాలుగా ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల ఉసురు తీస్తూ వస్తున్న బీజేపీనే దెబ్బ కొట్టిన హీరోగా కూడా నిలిచారని వారంటున్నారు. 

వెన్నతో పెట్టిన విద్యే 
పార్టీలను, కూటములను మార్చడం నితీశ్‌కు కొత్తేమీ కాదు. గత తొమ్మిదేళ్లలో ఆయన ఎన్డీఏకు దూరమవడం ఇది రెండోసారి. బీజేపీ–జేడీ(యూ) 2005లోనే బిహార్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. 2010లో బంపర్‌ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకున్నాయి. కానీ నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్డీఏ కూటమి నుంచి 2013లో నితీశ్‌ తొలిసారి వైదొలిగారు. తర్వాత 2014లో లోక్‌సభ ఎన్నికల పరాజయానికి బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహా ఘట్‌బంధన్‌తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ అవినీతిని, అధికార లాలసను భరించలేనంటూ 2017లో ఘట్‌బంధన్‌కు గుడ్‌బై చెప్పి మళ్లీ ఎన్డీఏతో జట్టు కట్టి సీఎంగా కొనసాగారు.

2019లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసే పోటీ చేశారు. రాష్ట్రంలో 40 లోక్‌సభ సీట్లకు గాను ఎన్డీఏ ఏకంగా 39 సీట్లు కొల్లగొట్టింది. బీజేపీకి 17, జేడీ(యూ)కు 16, మరో భాగస్వామి ఎల్జేపీకి 6 సీట్లొచ్చాయి. కానీ ఎక్కువ ఎమ్మెల్యేల బలంతో ఎన్డీఏ సంకీర్ణంలో ఎప్పుడూ పెద్దన్నగానే ఉన్న జేడీ(యూ) గత పదేళ్లుగా క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 74 సీట్లు రాగా జేడీ(యూ) 43 స్థానాలకు పరిమితమైంది. అయినా ముందే ప్రకటించినట్టుగా నితీశ్‌నే సీఎంగా బీజేపీ కొనసాగించింది. కానీ పాలనలో పదేపదే వేలు పెడుతూ తనను అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని నితీశ్‌ అసంతృప్తికి లోనయ్యారు. దీనికితోడు జేడీ(యూ) ఉనికినే దెబ్బ తీసేందుకు కాషాయ పెద్దలు పథక రచన చేస్తున్నారన్న వార్తలు ఆయన్ను మరింతగా చికాకు పరిచాయి.

మహారాష్ట్రలో శివసేన అసంతృప్త నేత ఏక్‌నాథ్‌ షిండే సాయంతో ఆ పార్టీ పుట్టి ముంచిన వ్యూహాన్నే తమపైనా బీజేపీ ప్రయోగించనుందని నితీశ్‌ అనుమానించారు. అందులో భాగంగా జేడీ(యూ) అసంతృప్త నేత ఆర్సీపీ సింగ్‌ పార్టీలో తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు ఆయన్ను కలవరపరిచాయి. నిజానికి ఆర్సీపీ సింగ్‌తో నితీశ్‌కు చాలాకాలంగా ఉప్పూనిప్పుగానే ఉంది. నితీశ్‌ అంగీకారం లేకుండానే సింగ్‌కు బీజేపీ కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టింది. ఆ కారణంగానే ఇటీవల సింగ్‌ రాజ్యసభ పదవీకాలం ముగిసినప్పుడు నితీశ్‌ మళ్లీ అవకాశమివ్వలేదు. దాంతో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆపై తన మద్దతుదారులతో కలిసి తిరుగుబాటు ప్రయత్నాలను సింగ్‌ వేగవంతం చేశారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నితీశ్‌ మరోసారి బీజేపీకి చెయ్యిచ్చి మహా ఘట్‌బంధన్‌ గూటికి చేరారు. ఒక్క దెబ్బతో ఇటు తిరుగుబాటు వార్తలకు చెక్‌ పెట్టడమే గాక బీజేపీకి కూడా  షాకిచ్చారు.
– నేషనల్‌ డెస్క్, సాక్షి 

మరిన్ని వార్తలు