మీ ప్రశ్నలు సరే.. మా వాటికి బదులివ్వండి 

30 Sep, 2021 01:37 IST|Sakshi

తొమ్మిది ప్రశ్నలకు బండి సంజయ్‌ స్పందించాలి 

పీయూసీ చైర్మన్‌ జీవన్‌రెడ్డి డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ కృషితో తెలంగాణ సస్యశ్యామలంగా మారుతుంటే ప్రతిపక్షాలు రాష్ట్రప్రభుత్వంపై మిడతల దండులా దాడి చేస్తున్నాయని పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ చైర్మన్‌ (పీయూసీ) జీవన్‌రెడ్డి విమర్శించారు. ఐటీ, పరిశ్రమల శాఖ పురోగతిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి కేటీ రామారావు చేసిన ప్రసంగంతో ప్రతిపక్షాలు ఆగమవుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశంతో కలిసి బుధవారం టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం కార్యాలయంలో జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పాదయాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రోజూ తమ ప్రభుత్వానికి పది ప్రశ్నలు వేస్తున్నారని, ప్రధాని మోదీ దేశానికి చేసిన పనులు, తెలంగాణకు ఇచ్చిన హామీలపై తాను వేస్తున్న తొమ్మిది ప్రశ్నలకు స్పందించాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

మోదీ ఇచ్చిన హామీ మేరకు ప్రతీఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ, విదేశాల నుంచి నల్లధనం, బ్యాంకు రుణాలను ఎగవేసిన నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యాను ఎప్పుడు రప్పిస్తారని ప్రశ్నించారు. తెలంగాణకు పసుపు బోర్డు, ట్రైబల్‌ యూనివర్సిటీ స్థాపన ఎందాకా వచ్చిందని, రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఎప్పుడు చేస్తారని నిలదీశారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, కరోనా సంక్షోభం నుంచి బయట పడేందుకు ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ వివరాలు వెల్లడించాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ యువత కోసం అక్టోబర్‌ 2 నుంచి డిసెంబర్‌ 9 వరకు జంగ్‌ సరైన్‌ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వసూళ్లకు తెరలేపారన్నారు.

రేవంత్‌ది పోరాటం కాదని పదవుల కోసం ఆరాటమని జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు, మాణిక్యం ఠాగూర్, రాహుల్‌గాంధీకి.. రేవంత్‌ సామంత రాజుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి మాట్లాడాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు అసత్యాలు అలవాటుగా మారాయని, హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావని మల్లేశం అన్నారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ప్రజలు త్వరలో నియోజకవర్గ బహిష్కరణ చేస్తారని హెచ్చరించారు.   

మరిన్ని వార్తలు