ఈడీ ఎదుట హాజరైన జార్ఖండ్ సీఎం.. దేశం వీడి పారిపోవడం లేదని ఘాటు వ్యాఖ్యలు..

17 Nov, 2022 15:06 IST|Sakshi

రాంచీ: అక్రమ మైనింగ్ వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. దీనికి ముందు ఆయన జార్ఖండ్‌లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. తనపై తప్పుడు కేసులు పెట్టి జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని కమలం పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

తాను ఎమ్మెల్యేగా కొనసాగకుండా అనర్హత వేటు వేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపైనా సోరెన్ స్పందించారు. తనను ఎమ్మెల్యేగా తొలగించాలని గవర్నర్‌కు ఈసీ సిఫారసు చేసిందని, ఆయన ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. గవర్నర్ దేని కోసమో ఎదురుచూస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని సోరెన్ చెప్పారు.

అలాగే బీజేపీ తనపై మోపిన ఆరోపణలు పూర్తిగా నిరాధారం అని సోరెన్ పేర్కొన్నారు. దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇతర పార్టీల నాయకులపైనా ఇలాంటి కేసులనే కేంద్రం పెడుతుందని జోస్యం చెప్పారు.

రాజ్యాంగబద్దమైన సీఎం పదవిలో ఉన్న తనకు సమన్లు పంపిన తీరు, విచారణ జరగుతున్న విధానం చూస్తుంటే తాను ఏదో దేశం వీడి పారిపోతానేమో అన్నట్లుగా చేస్తున్నారని సోరెన్ మండిపడ్డారు. ఇప్పటివరకు బడా వ్యాపారవేత్తలు మాత్రమే దేశం విడిచిపారిపోయారని, ఒక్క రాజకీయనాయకుడు కూడా ‍‍అలా చేయలేదని వివరించారు.

తాను రెండేళ్ల కాలంలో రూ.1000కోట్ల మోసానికి పాల్పడినట్లు అభియోగాలు మోపారని, కానీ ఆ వ్యవధిలో మైనింగ్‌లో మొత్తం రూ.750కోట్ల వ్యాపారమే జరిగిందని సోరెన్ వెల్లడించారు. తప్పుడు ఆరోపణలు చేసే ముందు కనీసం నిజానిజాలు తెలుసుకోవాలని కేంద్రంపై సెటైర్లు వేశారు.
చదవండి: గుజరాత్‌ ఎన్నికల వేళ ఆప్‌ నేత ఓవరాక్షన్‌.. కేసు నమోదు!

మరిన్ని వార్తలు