విశ్వాస పరీక్షలో నెగ్గిన సోరెన్ సర్కార్‌

5 Sep, 2022 13:17 IST|Sakshi

రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష జరిగింది. సీఎం హేమంత్ సోరెన్  సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది.  అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన వెంటనే సభలో విశ్వాసపరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సోరెన్. అనంతరం దీనిపై కాసేపు చర్చ జరిగింది. ఆ తర్వాత నిర్వహించిన ఓటింగ్లో సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 48 ఓట్లు వచ్చాయి. ఓటింగ్‌కు ముందే బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో మెజారిటీకి 42 సీట్లు అవసరం.

విశ్వాస పరీక్ష సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సోరెన్. కమలం పార్టీ ప్రతిరోజు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఆ పార్టీ పని చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు గొడవలు సృష్టించి దేశంలో పౌర యుద్ధం తరహా పరిస్థితులు తీసుకురావాలని చూస్తోందని ధ్వజమెత్తారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా జార్ఖండ్ ఎ‍మ్మెల్యేలను ప్రలోభపెట్టి తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించారని సోరెన్ ఆరోపించారు. జార్ఖండ్‌లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు బీజేపీ ప్రయత్నాలేవీ ఫలించవని స్పష్టం చేశారు. ఆ పార్టీకి రాజకీయంగా తగిన రీతిలో బదులిస్తామన్నారు.

ముందు రోజు రాంచీకి వచ్చిన ఎమ్మెల్యేలు..
బలపరీక్ష నేపథ్యంలో అధికార యూపీఏకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు ఆదివారం ఛత్తీస్‌గఢ్‌ నుంచి తిరిగి రాంచీకి చేరుకున్నారు.  ఆగస్ట్‌ 30 నుంచీ వీరు రాయ్‌పూర్‌లోని ఓ విలాసవంతమైన రిసార్టులో మకాం వేసిన విషయం తెలిసిందే. తమ సంకీర్ణాన్ని ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నిస్తుందన్న అనుమానాల మధ్య సీఎం హేమంత్‌ సోరెన్‌ ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం జార్ఖండ్ గవర్నర్‌కు లేఖ రాయడంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి దారి తీసిన విషయం తెలిసిందే.
చదవండి: ‘2024లో బీజేపీకి రెండే సీట్లు.. ఎక్కడ మొదలయ్యారో అక్కడికే’

మరిన్ని వార్తలు