హేమంత్‌ సోరెన్‌ రాజీనామాపై ఊహాగానాలు.. కాంగ్రెస్‌ ఏమందంటే?

1 Sep, 2022 21:17 IST|Sakshi

రాంచీ: జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ శాసనసభ్యతం రద్దుపై సస్పెన్స్ కొనసాగుతోంది. గవర్నర్‌ నిర్ణయానికి ముందే సోరెన్‌ రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమికి చెందిన నేతలు రాష్ట్ర గవర‍్నర్‌ రమేశ్‌ బయాస్‌ను గురువారం సాయంత్రం కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం హేమంత్‌ సోరెన్‌ రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ చీఫ్‌ బంధు టిర్కే. ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ రాజీనామా చేయట్లేదని స్పష్టం చేశారు. 

‘ఆయన రాజీనామా చేయటం లేదు. గవర్నర్‌ న్యాయ సలహా కోసం వేచిచూస్తున్నారు. రెండు రోజుల్లో నిర్ణయం వెలువరుస్తామని మాకు చెప్పారు. మీడియాకు సమాచారం లీకవటంపై గవర్నర్‌ను ప్రశ్నించాం. అయితే, సమాచారం బయటకి వస్తోంది తన కార్యాలయం నుంచి కాదని చెప్పారు.’ అని పేర్కొన్నారు రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ చీఫ్‌ బంధు టిర్కే.

జార్ఖండ్‌ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని గత మంగళవారం 32మంది శాసనసభ్యులను ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు. ఈ క్రమంలో.. ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎమ్మెల్యేలు వ్యూహాలు రచిస్తున్నట్లు ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ తెలిపారు. ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తోందన్న ఆరోపణలతో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్‌కు తరలించటం ఏడాదిన్నరలో ఇది మూడోసారి. ఈ ఏడాది జూన్‌లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా.. హరియాణా కాంగ్రెస్‌ తమ ఎమ్మెల్యేలను రాయ్‌పుర్‌కు తరలించింది. 2021, ఏప్రిల్‌లో బీపీఎఫ్‌, కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి సైతం ఎమ్మెల్యేలను తీసుకెళ్లింది. 

ఇదీ చదవండి: Jharkhand Crisis: గవర్నర్‌ను కలవనున్న అధికార కూటమి నేతలు

మరిన్ని వార్తలు