Pushpa-Jignesh Mevani: బెయిల్‌పై బయటికి.. వెంటనే నోట ‘పుష్ప’ సినిమా డైలాగ్‌

30 Apr, 2022 08:21 IST|Sakshi

అధికారం ఉందని ఓ మహిళను అడ్డుపెట్టుకుని తనపై అక్రమ కేసు బనాయించారంటూ బీజేపీపై ఆరోపణలు గుప్పించాడు గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేష్‌ మెవానీ. అస్సాంలో మహిళా కానిస్టేబుల్‌ను దుర్భాషలాడిన చేసిన కేసులో జిగ్నేష్‌ మేవానీకి శుక్రవారం బెయిల్‌ లభించిన విషయం తెలిసిందే. బెయిల్‌పై బయటికి వచ్చి రాగానే అ‍ల్లు అర్జున్‌ పుష్ప సినిమాలోని ఫేమస్‌ డైలాగ్‌ కొట్టాడాయన.

పుష్ప సినిమాలోని ఝుకేగా నహీ(తలవంచను).. తగ్గేదే లే.. డైలాగ్‌తో ఓ మీడియా ఛానెల్‌ ముందు పుష్పరాజ్‌ తరహా మేనరిజాన్ని ప్రదర్శించాడు జిగ్నేష్‌ మేవానీ. ‘‘నా అరెస్ట్‌ సాధారణ విషయం కాదు. పీఎంవోలో ఉన్న పొలిటికల్‌ బాస్‌ల సూచనలతోనే జరిగింది. నేను చేసిన ట్వీట్‌లో తప్పేం లేదు. ఆ విషయం ఇప్పటికీ గర్వంగా చెప్తున్నా.. 

జరిగిన మతఘర్షణలను, అల్లర్లను చూసి ఈ దేశంలో ఒక పౌరుడిగా శాంతి సామరస్యాలను కాపాడమని దేశ ప్రధానిని కోరా. అడగడానికి నాకు హక్కు ఉంది. అంటేకాదు చట్ట సభ ప్రతినిధిగా శాంతిని పాటించాలని ప్రజలను కోరా. అది నా విధి. అదేగా నేను చేసింది. దానికే కేసు పెట్టి అరెస్ట్‌ చేశారు అని మేవానీ తెలిపారు.   

ఆపై ఒక ఆడదాన్ని అడ్డుపెట్టి.. కథను అల్లి మరో కేసు పెట్టారు. పిరికిపంద చర్యే ఇది. గుజరాత్‌ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా అందుకే బీజేపీ ఇలా చేస్తోంది అని మేవానీ ఆరోపించారు. అరెస్ట్‌ వేళ తనకు మద్దతు ఇచ్చిన అస్సాం ప్రజానీకానికి, కాంగ్రెస్‌కు ధన్యవాదాలు తెలిపాడాయన. అలాగే ఎక్కడో అస్సాంలో తనను అరెస్ట్‌ చేయడం, కేసులు బనాయించి బయటకు రాకుండా చేయడం.. ముమ్మాటికీ బీజేపీ కుట్రే అని అంటున్నాడు. ప్రశ్నించేవారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు వీళ్లు. అలాగే ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నన్నూ టార్గెట్‌ చేశారు. దళితులు, గుజరాత్‌ ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. సరైన టైంలో బుద్ధి చెప్తారు. గుజరాత్‌ ఎన్నికల్లో వాళ్లు(బీజేపీ) మూల్యం చెల్లించుకోక తప్పదు. అని పేర్కొన్నాడు ఎమ్మెల్యే మేవానీ. (చదవండి:ఎట్టకేలకుజిగ్నేష్‌ మేవానీకి బెయిల్‌)

పోలీసులపై కోర్టు ఆగ్రహం
మహిళా కానిస్టేబుల్‌పై దాడి కేసులో గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని ‘‘కావాలనే’’ ఇరికించేందుకు ప్రయత్నించారంటూ అస్సాం పోలీసులపై అక్కడి కోర్టు మండిపడింది. బార్‌పేట కోర్టు మేవానీకి బెయిల్‌ మంజూర్‌ చేసే క్రమంలో తీవ్రంగా పోలీసులను మందలించింది. రాష్ట్రాన్ని పోలీస్‌ స్టేట్‌గా మార్చాలనుకుంటున్నారా? అని ప్రశ్నించింది.

మరిన్ని వార్తలు