కిషన్‌రెడ్డిపై జిట్టా సంచలన వ్యాఖ్యలు.. ‘బండిని తప్పించారు.. కేసీఆర్‌ ఆదేశాలతోనే సస్పెండ్‌ చేశారు’

2 Aug, 2023 18:40 IST|Sakshi

నాంపల్లి (హైదరాబాద్‌): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుడు, సస్పెన్షన్‌కు గురైన బీజేపీ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. 

కాగా, శనివారం ఆయన గన్‌పార్కు ఎదుట విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఎన్నికల తర్వాత పార్టీ గప్‌చుప్‌ కావడానికి కారణమేమిటి? పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లిన బండి సంజయ్‌ను ఎందుకు తొలగించారు? ఎమ్మెల్సీ కవిత లిక్కర్‌ స్కామ్‌ ఏమైందని ప్రశ్నిస్తే తనను సస్పెండ్‌ చేశారని ఆరోపించారు. పార్టీని బలహీనపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, విజయశాంతి తదితర నేతలపై ఏం చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డికి లేదా అని ప్రశ్నించారు.

ఇదే సమయంలో తానెక్కడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తాను ఇతర పార్టీల నేతలతో కిషన్‌రెడ్డి మాదిరిగా లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకోలేదన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతోనే కిషన్‌రెడ్డి తనను బీజేపీ నుంచి సస్పెండ్‌ చేశారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను సీబీఐ ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.

లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే కవిత  కేసును నిర్వీర్యం చేశారని, ఈ ఒప్పందంలో భాగంగానే కిషన్‌రెడ్డికి బీజేపీ అధ్యక్ష పదవి వచ్చిందని జిట్టా వ్యాఖ్యానించారు. హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎందుకు ఎత్తివేయటం లేదని ప్రశ్నించారు.  
ఇది కూడా చదవండి: కేసీఆర్‌ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ: కవిత కీలక వ్యాఖ్యలు


 

మరిన్ని వార్తలు