ఏపీలో గ్రామ స్వరాజ్యం సాకారం

1 Jun, 2022 04:00 IST|Sakshi

ఫూలే ఆలోచనలను సీఎం జగన్‌ అమలు చేస్తున్నారు

అన్ని పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం

ముఖ్యమంత్రి పాలనను అన్ని వర్గాల వారూ మెచ్చుకుంటున్నారు

మీడియాతో మంత్రి జోగి రమేష్‌

సాక్షి, అమరావతి: 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడేళ్లలో చేసి చూపించారని, ఫూలే ఆలోచనలను అమలుచేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. లక్షలాది మంది పిల్లలకు చదువు చెప్పిస్తున్నారని.. ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతున్నారని.. అలాగే, అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగంలోని ప్రతి ఒక్కదాన్ని ఆచరించి చూపుతున్న గొప్ప వ్యక్తి సీఎం జగన్‌ అని కొనియాడారు. అన్ని పదవుల్లో బడుగు, బలహీనవర్గాలను పెద్దపీట వేస్తూ సామాజిక విప్లవాన్ని సృష్టించారన్నారు. అలాంటి సీఎంపై చంద్రబాబు అన్నట్లుగా ప్రజల్లో వ్యతిరేకత ఎందుకుంటుందని జోగి ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో  మంత్రి మంగళవారం మాట్లాడారు. ఆయనేమన్నారంటే..

‘చంద్రబాబు తన సామాజికవర్గ ప్రతినిధి అని.. జగన్‌ సమసమాజ స్థాపనకు ప్రతినిధి అని అందరూ మెచ్చుకుంటున్నారు. చంద్రబాబుకు రాజ్యసభ టికెట్లు ఇచ్చే అవకాశం ఇప్పుడుంటే అమ్మేసుకునే వాడు.. లేదా తన సామాజికవర్గం వారికి ఇచ్చేవాడు. ఇవాళ జగన్‌ చేస్తున్న సామాజిక ధర్మాన్ని అన్ని వర్గాల వారు ప్రశంసిస్తున్నారు. మహానాడు వేదికగా టీడీపీ వారు తొడలు కొడుతూ, బూతులు తిడితే సామాజిక న్యాయం అవుతుందా చంద్రబాబూ? అక్కడే చంద్రబాబు తిట్ల పురాణం కూడా అందుకున్నారు.

ఫూలే ఆలోచనలను సీఎం జగన్‌ అక్షరాలా అమలు చేస్తున్నారు. అందుకే బీసీలందరూ టీడీపీకి దూరమై సీఎం జగన్‌ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు. అన్ని నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం ఇస్తూ ఏకంగా చట్టమే చేశారు. ఇప్పుడు అన్ని ప్రాంతాల వారు ‘2024లో సీఎం జగన్‌ వన్స్‌మోర్‌.. ఆయనే మళ్లీ కావాలి’ అని చెబుతున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన బడుగు, బలహీనవర్గాల నేతలు ఫోన్‌చేసి సీఎం జగన్‌ను ఎంతో ప్రశంసిస్తున్నారు. అందుకు ఎంతో గర్వంగా ఉంది. 

బీసీలకు చంద్రబాబు ఏం చేశాడు?
వాస్తవానికి బీసీలకు బాబు ఏం చేశాడో ఆయనే చెప్పలేకపోతున్నాడు. బాబుకు దమ్ముంటే దీనిపై చర్చకు రావాలి. చంద్రబాబు ఏనాడైనా బీసీలు, ఎస్సీలకు రాజ్యసభ టికెట్‌ ఇచ్చి అవకాశం కల్పించాడా? వర్ల రామయ్యకు హామీ ఇచ్చి మాట తప్పాడు. 

లోకేశ్‌ ఎన్ని యాత్రలు చేసినా ఆదరించరు
లోకేశ్‌ పాదయాత్ర చేస్తారట.. ఆయన ఎన్ని యాత్రలు చేసినా, పొర్లు దండాలు పెట్టినా ప్రజలు ఛీకొడతారు తప్ప, ఆదరించరు. మేం గడప గడపకూ వెళ్తున్నప్పుడు సీఎం జగన్‌ మా కుటుంబ సభ్యుడని ప్రతి కుటుంబం చెబుతోంది. 2024 ఎన్నికల్లో టీడీపీ మరోసారి ఓడిపోవడం ఖాయం.  

మరిన్ని వార్తలు