ప్రజలు చెప్పుతో కొట్టినా బుద్ధి రాలేదు

5 Oct, 2020 04:49 IST|Sakshi

టీడీపీపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ మండిపాటు

సాక్షి,అమరావతి: వలంటీర్ల సేవల్ని శభాష్‌ అంటూ ప్రజలు మెచ్చుకుంటున్నారని, వారి సేవలకు చప్పట్లు కొట్టమంటుంటే కొంతమంది రాక్షసులు, దుర్మార్గులు, శిఖండులు చెప్పులతో కొట్టాలంటూ ట్వీట్‌ చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ మండిపడ్డారు. 16 నెలల కిందటే ఓటు అనే ఆయుధంతో ప్రజలు టీడీపీని చెప్పుతో కొట్టారని అయినా సిగ్గు రాలేదని ధ్వజమెత్తారు. ఇలాంటి రాక్షసుల్ని ఏమనాలని ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో అద్భుత సేవలందిస్తున్నారని.. వారు వలంటీర్లు కాదని వారియర్స్‌ అని కొనియాడారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా దెబ్బకు టీడీపీ, చంద్రబాబు పారిపోతే.. వలంటీర్లు వీరుల్లా నిలబడి సేవలందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం కోల్పోతున్న టీడీపీ ఉనికి కోసం ఆరాటపడుతోందని, అందుకే జూమ్‌ మీటింగ్‌లు, టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తోందని దుయ్యబట్టారు.

రాళ్లు వేయడం, తగలబెట్టడం వంటివి టీడీపీ జిమ్మిక్కులే
సబ్బం హరి కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. టీడీపీకి చెందిన పట్టాభి కారుపై రాయి ఎవరేస్తారు? తగులబెట్టడం, రాళ్లు వేసుకోవడం.. ఇవన్నీ టీడీపీ జిమ్మిక్కులేనన్నారు. చంద్రబాబు లాంటి కేపిటలిస్టులకు సీపీఐ రామకృష్ణ అమ్ముడుబోయి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి నిధులు రావాలని, రాష్ట్రానికి మెరుగైన సాయం చేయాలని ప్రధాని మోదీని సీఎం జగన్‌ కోరతారని అందులో తప్పేముందన్నారు.   

మరిన్ని వార్తలు