పవన్‌.. చిల్లర వేషాలేస్తే ఊరుకోం

16 Oct, 2022 06:00 IST|Sakshi

ఎయిర్‌పోర్టు వద్ద దాడి మంచి పద్ధతి కాదు 

కర్రలతో కొట్టటం, రాళ్లతో గుద్దడం ఏమిటీ? 

ఆరాచక శక్తుల వికృత చేష్టలు, భౌతిక దాడులు సహించం 

మా కార్యకర్తలను పురమాయిస్తే పవన్‌ తిరగగలడా? 

మంత్రి జోగి రమేష్‌ హెచ్చరిక 

సాక్షి, అమరావతి: ‘విశాఖ గర్జన’లో పాల్గొని విమానాశ్రయానికి వస్తున్న తమపై జనసేన కార్యకర్తలు దాడిచేశారని, ఇలాంటి చిల్లర వేషాలేస్తే ఊరుకోబోమని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ను మంత్రి జోగి రమేష్‌ శనివారం హెచ్చరించారు. ఈ ఘటనలో తమ వాళ్లకు గాయాలయ్యాయని దాడి అనంతరం ఆయన ‘సాక్షి’కి చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇది సరికాదన్నారు.

వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన ర్యాలీ, బహిరంగ సభను ముగించుకుని ఎయిర్‌పోర్టుకు టీటీడీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి ఆర్కే రోజా, తాను వస్తున్నామని.. విమానాశ్రయానికి రాగానే తమ కార్లపై జనసేన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారని మంత్రి వివరించారు.

ఈ దాడిలో తమ కార్ల అద్దాలు ధ్వంసం కావడంతోపాటు మంత్రి రోజా సహాయకుడికి గాయాలయ్యాయని తెలిపారు. తాగుబోతు కుర్రాళ్లను, ఆరాచక శక్తులను, అల్లరి మూకలను, రౌడీలను పోగుచేసి దాడిచేయించటం సరికాదని.. పవన్‌ తన కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలని.. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని జోగి రమేష్‌ హితవు పలికారు.

తమ కార్యకర్తలను పురమాయిస్తే పవన్‌ ఎక్కడ కూడా తిరగలేడని ఆయన హెచ్చరించారు. నాయకుడికి స్వాగతం చెప్పుకోడానికి, జిందాబాద్‌... అని నినాదాలు ఇవ్వడానికి వచ్చిన వారి వద్ద రాళ్లు, కర్రలు ఎందుకు ఉన్నట్లని మంత్రి ప్రశ్నించారు. జనసైనికుల దాడిపై పవన్‌కల్యాణ్‌ వెంటనే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు