కుటుంబంతో వెళ్తే ఎందుకింత కుళ్లు?

23 May, 2022 04:55 IST|Sakshi

టీడీపీపై మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే టీజేఆర్‌ మండిపాటు 

పెట్టుబడులు, ఉపాధి కల్పనే లక్ష్యంగా దావోస్‌కు సీఎం జగన్‌ 

అల్జీమర్స్‌ రోగి చంద్రబాబు, యనమల పిచ్చి ప్రేలాపనలు 

సాక్షి, అమరావతి/కడప కార్పొరేషన్‌: టీడీపీ అధికారంలో ఉండగా ఐదేళ్ల పాటు విదేశీ పర్యటనలు, గ్రాఫిక్స్‌తో కాలం గడిపిన చంద్రబాబు ఏం ఒరగబెట్టారని వైఎస్సార్‌సీపీ ప్రశ్నించింది. దోచుకున్న ప్రజాదనాన్ని దాచుకోవడానికే చంద్రబాబు 38 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారని పేర్కొంది. గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో,  ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు కడపలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు.  

దోపిడీదారులతో కలసి బాబు పర్యటన 
రాష్ట్రంలో పెట్టుబడులకున్న అపార అవకాశాలను వివరించి పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే లక్ష్యంతోనే సీఎం వైఎస్‌ జగన్‌ దావోస్‌ వెళ్లారని మంత్రి జోగి రమేష్‌ పేర్కొన్నారు. కుటుంబంతో కలిసి వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. అల్జీమర్స్‌ రోగి చంద్రబాబు, కడుపుబ్బరం బాధితుడు యనమల సీఎం పర్యటనపై కుళ్లుతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు.

దోపిడీదారులైన సుజనా చౌదరి, సీఎం రమేష్‌ తదితరులను దావోస్‌ తీసుకెళ్లిన ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు బుల్లెట్‌ రైలు పక్కన ఫొటో దిగి రాష్ట్రానికి వచ్చేస్తోందంటూ మభ్యపుచ్చారని విమర్శించారు. దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆరు ఒప్పందాలు చేసుకోవడం, పెట్టుబడులపై చర్చిస్తుండటాన్ని చూసి ఓర్వలేక ఇలా మాట్లాడుతున్నారన్నారు.  

సొంత కుటుంబ సభ్యుడైనా.. 
సంక్షేమాభివృద్ధి పథకాలతో సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్‌ను సామాజిక న్యాయ నిర్మాతగా ప్రజలు ప్రశంసిస్తున్నారని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమేనని విశ్వసించే సీఎం జగన్‌ సొంత కుటుంబ సభ్యుడిపై ఆరోపణలు వస్తే వెంటనే కేసు నమోదు చేయించి అరెస్టుతోపాటు జిల్లా నుంచి బహిష్కరణకు చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌పై ఆరోపణలు రాగానే 302 సెక్షన్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసుల నమోదుకు ఆదేశించారన్నారు. 

దళితులను దూషించి మొసలి కన్నీళ్లు
చంద్రబాబు మాదిరిగా జగన్‌ దొంగ పర్యటనలు చేయట్లేదని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు పేర్కొన్నారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని అసమర్థుడు పట్టాభిరాం అని దుయ్యబట్టారు. విదేశీ పర్యటనల ద్వారా చంద్రబాబు ఎన్ని పెట్టుబడులు, పరిశ్రమలు తెచ్చారని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు కాకినాడలో డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. 

మరిన్ని వార్తలు