బీజేపీలోకి వస్తారా? లేక బుల్‌డోజర్లు తీసుకురమ్మంటారా? మంత్రి వ్యాఖ్యలపై దుమారం

20 Jan, 2023 14:04 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలంతా బీజేపీలోకి రావాలని,  లేదంటే బుల్‌డోజర్లు సిద్ధంగా ఉ‍న్నాయని ఆయన బహిరంగంగా బెదిరించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

'మీరందరు బీజేపీలో చేరండి. నెమ్మదిగా అధికార పార్టీలోకి రండి. మధ్యప్రదేశ్‌లో 2023లో కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది.  బుల్‌డోజర్లు సిద్ధంగా ఉన్నాయి.' అని బీజేపీ మంత్రి అన్నారు. రాఘోగఢ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈమేరకు మాట్లాడారు.

బీజేపీ మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆయన మతిస్తిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నారో తెలియక ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడింది. బీజేపీకి ప్రజలే తగిన రీతిలో బుద్ది చెబుతారని పేర్కొంది. ఎలాంటి భాష ఉపయోగించాలో మంత్రి నేర్చుకోవాలని హితవు పలికింది.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్‌డోజర్ సంస్కృతి విపరీతంగా పెరిగింది. నేరస్థులు, నిందితుల ఇళ్లు, ఆస్తులను ప్రభుత్వం బుల్‌డోజర్లతో కూల్చివేస్తోంది. మధ్యప్రదేశ్‌లో కూడా ఈ తరహా ఘటనలు ఎక్కువయ్యాయి. సీఎం శివరాజ్‌ సింగ్ చౌహన్ వీటిని బహిరంగంగా సమర్థిస్తున్నారు.
చదవండి: సచిన్‌ పైలట్‌ను కరోనాతో పోల్చిన రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌

మరిన్ని వార్తలు