యోగి రాయబారం: ‘రాజకీయ పరిణితి లేనోడు’.. అఖిలేష్‌కి ఒకేసారి డబుల్‌ షాక్‌

9 Jul, 2022 15:56 IST|Sakshi

లక్నో: అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తర ప్రదేశ్‌ రాజకీయం మరింత మలుపులు తిరుగుతోంది. సీఎం యోగి రాయబారంతో ప్రతిపక్ష కూటమిలో మనస్పర్థలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, ఎస్సీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌కు ఝలక్‌ తగిలింది. ఇచ్చింది ఎవరో కాదు.. ఆయన సొంత బాబాయ్‌ శివపాల్‌ సింగ్‌ యాదవ్‌. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిని కాదని.. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు శివపాల్‌ యాదవ్‌. 

శివపాల్‌ యాదవ్‌తో పాటు ఎస్సీ కూటమి పార్టీ సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌.. శుక్రవారం రాత్రి సీఎం యోగి ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు ఇద్దరూ. ‘‘సమాజ్‌వాదీ పార్టీ నన్నేం పిలవలేదు. తాము మద్దతు ఇచ్చే అభ్యర్థికి ఓటేయమనీ అడగలేదు. సీఎం యోగి ఆదిత్యానాథ్‌ నన్ను ఆహ్వానించి.. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలపాలని అడిగారు. అందుకే అంగీకరించాం’’ అని బాబాయ్‌-అబ్బాయ్‌ మధ్య నెలకొన్న గ్యాప్‌ను మరోసారి బయటపెట్టారు శివపాల్‌ యాదవ్‌. 

అఖిలేష్‌కు సరైన రాజకీయ పరిణితి లేకపోవడం వల్లే.. తనను కీలక సమావేశాలకు ఆహ్వానించడం లేదని, అందుకే కూటమిలోని పార్టీలు తలోదారి చూసుకుంటున్నాయని శివపాల్‌ ​యాదవ్‌ మండిపడ్డారు. అఖిలేష్‌ గనుక నా సలహాలు గనుక పాటించి ఉంటే.. ఎస్పీ పరిస్థితి యూపీలో ఇవాళ మరోలా ఉండేదన్నారు ఆయన. 

ఇక ద్రౌపది ముర్ముకు మద్ధతు విషయంపై రాజ్‌భర్‌ కూడా స్పందించారు. ఎస్పీతో కూటమిలోనే తాము కొనసాగుతామని, ఒకవేళ అఖిలేష్‌ గనుక బలవంతంగా వెళ్లిపొమ్మంటే బయటకు వచ్చేస్తామని ప్రకటించారాయన. ముర్ముకు మద్దతు విషయం పూర్తిగా తన సొంత నిర్ణయమని పేర్కొన్నారాయన. 

విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు మద్దతు ప్రకటించే విషయమై.. గురువారం అఖిలేష్‌ నేతృత్వంలో సమాజ్‌వాదీ పార్టీ.. కూటమి పార్టీలతో కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి ప్రగతీశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ-లోహియా అధ్యక్షుడు శివపాల్‌ యాదవ్‌తో పాటు ఎస్బీఎస్పీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌కు సైతం ఆహ్వానం అందలేదు. ఈ క్రమంలోనే ఆగ్రహం, అసంతృప్తితో రగిలిపోతున్న ఈ ఇద్దరికీ ఆహ్వానం పంపి.. తమవైపు తిప్పుకున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌.

ఇదిలా ఉంటే.. అఖిలేష్‌ యాదవ్‌ సొంత బాబాయ్‌ అయిన శివపాల్‌ యాదవ్‌.. 2012-17 అఖిలేష్‌ యాదవ్‌ సీఎంగా ఉన్న టైంలో ‘నెంబర్‌ టూ’గా కొనసాగారు. 2018లో అఖిలేష్‌తో పొసగక బయటకు వచ్చి ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ-లోహియా పేరిట కొత్త పార్టీ పెట్టారు. అయితే.. 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరిగి అబ్బాయితో కలిసి చేతులు కలిపారాయన. ఆ ఎన్నికల్లో.. జశ్వంత్‌ నగర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు శివపాల్‌ యాదవ్‌. అయితే ఆయన నెగ్గింది మాత్రం సమాజ్‌వాదీ పార్టీ గుర్తు మీదే కావడం గమనార్హం.

మరోవైపు ఓంప్రకాశ్‌ రాజ్‌భర్‌ ఎస్బీఎస్పీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు సీట్లు నెగ్గింది. కూటమి నుంచి బయటకు వెళ్లే ప్రసక్తి లేదంటూనే.. అఖిలేష్‌పై ఓంప్రకాశ్‌ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. తాజాగా లోక్‌సభ ఉపఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో అఖిలేష్‌యాదవ్‌కు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు ఓంప్రకాశ్‌. 2012 సమయంలో అఖిలేష్‌ ముఖ్యమంత్రి అయ్యింది కూడా కేవలం తండ్రి ములాయం వల్లేనని, అఖిలేష్‌ నిజానికి అంత అర్హత ఉన్నోడు కాదంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు ఓంప్రకాశ్‌.

మరిన్ని వార్తలు